ETV Bharat / bharat

టెన్త్ పరీక్షల్లో 7వ తరగతి అమ్మాయికి 90% మార్కులు.. UPSC టాపర్​ అవ్వడమే టార్గెట్​!

author img

By

Published : May 12, 2023, 10:45 AM IST

ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని.. పదో తరగతి పరీక్షలు రాసి 90.50 శాతం మార్కులు సాధించింది. అతి చిన్న వయసులో UPSC టాపర్​ అవ్వడమే తన లక్ష్యమని చెబుతోంది. ఓ సారి ఆ అమ్మాయి గురించి తెలుసుకుందాం రండి.

chhattisgarh 10th results 7th class student scores 90 percent in 10th class exams
chhattisgarh 10th results 7th class student scores 90 percent in 10th class exams

ఛత్తీస్​గఢ్​కు చెందిన ఓ 13 ఏళ్ల బాలిక.. పదో తరగతి పరీక్షలు రాసి 90.50 శాతం మార్కులు సాధించింది. ఏడో తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని.. పది పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించి అందర్నీ ఆశ్యర్యపరిచింది. UPSCలో టాపర్​ అవ్వడమే తన లక్ష్యమని చెబుతోంది.

బాలోద్​ జిల్లాకు చెందిన నర్గీస్​ ఖాన్​.. స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆమె పదో తరగతి పరీక్షలు రాయాలనుకుంది. అందుకు సంబంధించిన అర్హతల కోసం ఇంటర్నెట్​లో వెతికింది. IQ పరీక్షకు హాజరై ఉత్తీర్ణత సాధిస్తే.. పదో తరగతి పరీక్షలు రాయొచ్చని తెలుసుకుంది. IQ పరీక్షలో పాస్​ అయ్యి.. పది పరీక్షలు రాసేందుకు అర్హురాలైంది. ఆ తర్వాత ఎక్సలెంట్ ఇంగ్లీషు మీడియం స్కూల్​లో చేరింది. పరీక్షల కోసం సన్నద్ధమైంది. అంతకుముందే కొవిడ్​ సమయంలో యూట్యూబ్​, గూగుల్​ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకుంది.

"నేను UPSCలో అతి చిన్న వయసు గల టాపర్ అవ్వాలనుకుంటున్నాను. అదే దృష్టిలో ఉంచుకుని.. ఇంటర్నెట్‌లో వెతికాను. IQ పరీక్ష ఆధారంగా పదో తరగతి పరీక్షలకు అర్హత సాధించాను. 98 శాతం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. టైమ్‌టేబుల్ ప్రకారం క్రమం తప్పకుండా రోజూ 6-7 గంటలు చదివాను. పదో తరగతి పరీక్షల్లో 90.50 శాతం సాధించాను" అని నర్గీస్ తెలిపింది.

కలెక్టర్​ అభినందనలు..
నర్గీస్​ ఖాన్​ను బలోడ్​ జిల్లా కలెక్టర్​ కుల్దీప్​ శర్మ అభినందించారు. ఆ బాలిక తన కల సాకారం చేసుకుందని, కష్టానికి తగ్గ ఫలితం ఆమెకు దక్కిందని ఆయన అన్నారు. నర్గీస్​ చాలా కష్టపడిందని, ఎందరో విద్యార్థులకు ఆమె ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.

పది పరీక్షల్లో మెరిసిన నక్సలైట్ల కూతురు.. డాక్టర్​ అవ్వడమే టార్గెట్​!
ఛత్తీస్​గఢ్​లోని నారాయణపుర్ జిల్లాకు చెందిన ఓ నక్సలైట్ దంపతుల కుమార్తె పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. భవిష్యత్తులో వైద్యురాలిగా మారి గిరిజనులకు సేవ చేస్తానని చెబుతోంది. జిల్లాలోని అబుజ్​మద్​ ప్రాంతానికి చెందిన ఆ బాలిక తల్లిదండ్రులిద్దరూ క్రియాశీల నక్సలైట్లు. బుధవారం విడుదల చేసిన.. ఛత్తీస్‌గఢ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫలితాల్లో ఆమె 54.5 శాతం మార్కులు సాధించింది.

"నేను 1 నుంచి 5వ తరగతి వరకు కుతుల్ గ్రామంలో రామకృష్ణ మిషన్ వివేకానంద విద్యా మందిర్‌లో చదువుకున్నాను. 6,7,8 తరగతులు వివేకానంద విద్యాపీఠ్‌లో చదివాను. కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు లేనందున చదువు మానేశాను. కొన్ని నెలల తర్వాత బంధువుల ఇంట్లో ఉండి చదువుకోవడం ప్రారంభించాను. భట్​పాల్ గ్రామంలో ఉన్న పాఠశాలకు రోజూ రెండు కి.మీ నడిచి వెళ్లేదాన్ని. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినందుకు సంతోషంగా ఉంది. నేను డాక్టర్‌ అయ్యి మా ఊరి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను. సరైన కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం వల్ల అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాను. ఆ సర్టిఫికెట్లు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడంలో నాకు సహాయపడతాయి. డాక్టర్ కావాలనే నా కలను నెరవేర్చుకోవడానికి నాకు దోహదం చేస్తాయి" అని ఆమె తెలిపింది.

ఈ విషయంపై నారాయణ్​పుర్​ జిల్లా కలెక్టర్​ అజిత్​ వసంత్​ స్పందించారు. ఆ విద్యార్థిని అవసరమైన అన్ని పత్రాలు మంజారు అయ్యేలా చర్యలు తీసుకంటామని చెప్పారు. అందుకు స్థానిక అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలు కూడా ఆమెకు అందుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఆమెకు కావాల్సిన అన్న రకాల సహాయం చేస్తామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.