ETV Bharat / bharat

ప్రియాంక.. ద చాయ్​వాలీ! ఒంటరిగా రాజధానికి చేరి.. నిరుద్యోగంపై గెలిచి...

author img

By

Published : Apr 19, 2022, 5:18 PM IST

Updated : Apr 19, 2022, 7:52 PM IST

Chaiwali in Patna: డిగ్రీ పాసై రెండేళ్లయినా నిరుద్యోగిగానే ఉన్న ఓ యువతి.. చాయ్​వాలీగా మారింది. సొంత ఊరిని, కన్నవారిని వదిలి ఒంటరిగా రాజధానికి చేరుకుని.. టీ దుకాణం ప్రారంభించింది. ఐదు రకాల చాయ్​ల రుచి చూపిస్తూ.. తన కథతో అందరిలో స్ఫూర్తి నింపుతోంది.

chaiwali in patna
'చాయ్​వాలీ' ప్రియాంక గుప్తా

Chaiwali in Patna: బిహార్ రాజధాని పట్నాలోని ఉమెన్స్ కాలేజీ ప్రాంతమది. ఏప్రిల్​ 11న అక్కడొక టీ దుకాణం వెలిసింది. ఇప్పటికే చాలా ఉన్నాయి.. అలాంటిదే మరొకటిలే అనుకున్నారు చూసినవారు. కస్టమర్లకు ఓ యువతి చాయ్​లు అందిస్తూ ఉండడం చూసి.. తండ్రికో, సోదరుడికో సాయం చేస్తోందేమోలే అని భావించారు. అలా 2-3 రోజులు గడిచాక అక్కడి వారికి అర్థమైంది.. అది సాదాసీదా టీ దుకాణం కాదని. ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రియాంక గుప్తా.. స్వయం ఉపాధి కోసం ఇలా చాయ్​వాలీగా మారిందని తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. ఆమె అందించే రుచికరమైన చాయ్​ తాగుతూ, ఆమె కథ వింటూ.. ఔరా అంటున్నారు.

chaiwali in patna
చాయ్ దుకాణంలో ప్రియాంక గుప్తా

"గతేడాది బ్యాంక్ ఎగ్జామ్​ రాశా. కొద్ది మార్కుల తేడాతో అవకాశం కోల్పోయా. 2019లో డిగ్రీ పూర్తయింది. రెండేళ్లు గడిచినా ఉద్యోగం రాలేదు. ఎంతకాలం ఇలా ఉంటాం? ఏదొకటి చేయాలి కదా. నిరుద్యోగిగా ఉండడంకన్నా స్టార్టప్ ప్రారంభించడం నయం. టీ దుకాణానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. లాభాలు బాగుంటాయి. అందరూ చాయ్​వాలాలు ఉన్నారు. చాయ్​వాలీ కూడా ఉండాలి కదా అనుకున్నా. కానీ.. అమ్మానాన్నలకు చెప్పలేదు. బ్యాంక్ పరీక్ష కోచింగ్​ కోసం పట్నా వెళ్తున్నానని నాన్నకు చెప్పా. సరే అన్నారు. ఒంటరిగా వచ్చేశా. ఎలా చేయాలో తెలియదు. కానీ చేసి తీరాలి అనుకున్నా."

--ప్రియాంక గుప్తా, చాయ్​వాలీ

chaiwali in patna
టీ తాగుతున్న విద్యార్థులు

ఎన్ని సవాళ్లు ఎదురైనా.. సొంత కాళ్లపై నిలబడి తీరాలన్న ప్రియాంక సంకల్పం గొప్పది. అందులోనూ చాయ్​వాలీగా మారాలన్న ఆమె ఆలోచన సాహసోపేతమైంది. అయితే.. ఆమె కల అంత సులువుగా నెరవేరలేదు. ఇందుకోసం ఎన్నో కష్టాలు పడింది. మరెన్నో సవాళ్లు అధిగమించింది. ముందుగా యూట్యూబ్​నే తన గురువుగా చేసుకుంది ప్రియాంక. ఎంబీఏ చాయ్​వాలా స్టార్టప్ ప్రారంభించి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన ప్రఫుల్ భిల్లోరే వంటి వారి వీడియోలు చూసింది. బిహార్​ పూర్ణియా జిల్లాలోని స్వస్థలాన్ని విడిచి.. ఒంటరిగా పట్నా వచ్చింది. రెండు నెలలపాటు నగరంలోని చిన్నచిన్న టీ దుకాణాలకు వెళ్లి.. అక్కడి వ్యాపార శైలిని అర్థం చేసుకుంది. బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించి.. ముద్రా యోజన కింద లోన్​ కోసం బ్యాంక్​కు వెళ్లింది. అయితే.. స్థానికురాలు కాదు కాబట్టి రుణం ఇవ్వలేమన్నారు బ్యాంక్ సిబ్బంది. స్నేహితుల సాయంతో రూ.30వేలు సమకూర్చుకుని.. ఎట్టకేలకు తన కలల చాయ్ దుకాణం తెరిచింది. అందరి చేత శెభాష్ అనిపించుకుంటోంది.

"ఏ పని కూడా చిన్నది కాదు. ఇలాంటి వారిని చూస్తే జీవితం ముందుకెళ్లేందుకు స్ఫూర్తి లభిస్తుంది. టీ దుకాణం నడిపేవారిని ఎవరినీ తక్కువగా చూడకూడదు. పని చేయాలన్న సంకల్పం ఉంటే అన్ని పనులూ మంచివే."

--రియా రాజ్, కస్టమర్

chaiwali in patna
చాయ్​వాలీ దుకాణం మెనూ

ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీ దుకాణం నడుపుతోంది ప్రియాంక. మసాలా చాయ్, అల్లం చాయ్, పాన్ చాయ్, చాక్లెట్​ చాయ్​ సహా మొత్తం ఐదు రకాల టీలు అందిస్తోంది. త్వరలో సాయంత్రం వేళల్లోనూ టీ దుకాణం నిర్వహించాలని భావిస్తోంది. చాయ్​వాలీగా మారిన వారం రోజుల తర్వాత ఇంట్లో వారికి ప్రియాంక అసలు విషయం చెప్పింది. టీ దుకాణం నడపడం ఏంటని తొలుత తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పినా.. చివరకు కుమార్తెతో ఏకీభవించారు. తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.

chaiwali in patna
'చాయ్​వాలీ' ప్రియాంక గుప్తా
Last Updated :Apr 19, 2022, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.