ETV Bharat / bharat

మంకీపాక్స్​పై కేంద్రం అలర్ట్... శృంగారం ద్వారా వ్యాప్తికి ఛాన్స్!

author img

By

Published : May 21, 2022, 5:06 AM IST

Monkeypox India alert: మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర వైద్య శాఖ అప్రమత్తమైంది. ఆఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులు ఐసోలేషన్​కు వెళ్లాలని సూచించింది. కొంతమంది నమూనాలను ల్యాబ్​కు పంపినట్లు అధికారులు తెలిపారు. కాగా, శృంగారం ద్వారా కూడా మంకీపాక్స్ వ్యాపించే అవకాశం ఉందా అనే విషయంపై శాస్త్రవేత్తలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Monkeypox India alert
Monkeypox India alert

Monkeypox India news: మంకీపాక్స్ కేసులు పలు దేశాల్లో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం కన్నేసి ఉంచాలని ఐసీఎంఆర్​, సీడీసీలకు ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్ కేసులు బయటపడ్డ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. తమకు లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే ఐసోలేషన్​కు వెళ్లాలని సూచించింది. ఈ ప్రయాణికుల నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్​కు పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్ సహా పలు ఐరోపా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ తాజా ఆదేశాలు జారీ చేశారని అధికారులు వెల్లడించారు.

monkeypox disease outbreak: బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, యూఎస్, స్వీడన్, కెనడా దేశాల్లో ఇటీవల కేసులు బయటపడ్డాయి. ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియా దేశాల్లో శుక్రవారమే మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కాగా, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగులోకి రావడంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆఫ్రికా దేశానికి వెళ్లని వారిలోనూ కేసులు నమోదు కావడంపై అయోమయం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో కూడా వైరస్ ఇలా వ్యాపించలేదని ప్రముఖ వైరాలజిస్ట్ ఒయ్​వాల్ తొమోరి తెలిపారు. వైరస్​లో ఏదో మార్పులు సంభవించి ఉండొచ్చని పేర్కొన్నారు.

"నైజీరియాలో సంవత్సరానికి 3వేల వరకు కేసులు వస్తుంటాయి. చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి బయటపడతాయి. అయితే, ఇది (ఐరోపాలో వ్యాప్తి) నైజీరియా మాదిరిగా లేదు. ఎబోలా వంటి వైరస్​లు.. ప్రారంభంలో శృంగారం ద్వారా సోకేవి కాదు. కానీ, వాటి వ్యాప్తి తీవ్రమైన తర్వాత.. సెక్స్ కూడా వైరస్ వ్యాప్తికి కారణమైంది. మంకీపాక్స్ విషయంలో కూడా ఇది నిజం కావొచ్చు. దీనిపై రికార్డులను పరిశీలించాల్సి ఉంది. భార్యాభర్తలకు, పరస్పర లైంగిక సంబంధం ఉన్న వ్యక్తులకు వైరస్ సోకిందేమో అన్న విషయాన్ని తెలుసుకోవాలి."
-ఒయ్​వాల్ తొమోరి, వైరాలజిస్ట్

ఏంటీ వైరస్‌..?
మంకీపాక్స్ ఒక వైరల్‌ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్‌ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో ఈ వైరస్‌ అధికంగా వ్యాపిస్తుంటుంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందని నిపుణులు వెల్లడించారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది బయటపడింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

లక్షణాలు ఏంటి?
జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ ​లక్షణాలు. స్మాల్‌పాక్స్‌ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందట. ఈ లక్షణాలు 14-21 రోజుల్లో బయటపడతాయి. మైల్డ్​ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.