ETV Bharat / bharat

ఒడిశా ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు.. ఘటనాస్థలికి అధికారులు.. కాంగ్రెస్ విమర్శలు!

author img

By

Published : Jun 6, 2023, 12:20 PM IST

Updated : Jun 6, 2023, 12:38 PM IST

CBI Odisha Train Accident : ఒడిశా రైళ్ల ప్రమాద ఘటనపై విచారణను ముమ్మరం చేసింది సీబీఐ. 10 మంది అధికారులతో కూడిన సీబీఐ బృందం ఘటనాస్థలిని పరిశీలించింది. రైల్వే అధికారులు సీబీఐకి సహకరిస్తున్నారు. అయితే, పత్రికల్లో హెడ్​లైన్ల కోసమే సీబీఐకి ఈ కేసు అప్పగించారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.

odisha-train-accident
odisha-train-accident

CBI Odisha train accident : ఒడిశా బాలేశ్వర్​లో జరిగిన మూడు రైళ్ల ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఘటనాస్థలిని సందర్శించింది. 10 మంది అధికారులతో కూడిన సీబీఐ బృందం.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. ప్రమాదంపై రైల్వే అధికారులతో సీబీఐ అధికారులు మాట్లాడారు. ఫోరెన్సిక్ బృందాలు సైతం ఘటనాస్థలికి చేరుకున్నాయని ఆగ్నేయ రైల్వే సీపీఆర్​ఓ ఆదిత్య కుమార్ చౌదరి వెల్లడించారు.

"ఫోరెన్సిక్, సీబీఐ బృందాలు ఇక్కడికి వచ్చాయి. దర్యాప్తులో భాగంగా వారు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. రైల్వే శాఖ అధికారులు వారికి సహకరిస్తున్నారు. అవసరమైన సమాచారం అందిస్తున్నారు. ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందా అనే కోణం సహా అన్ని కోణాల్లోనూ సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు."
-ఆదిత్య కుమార్ చౌదరి, ఆగ్నేయ రైల్వే సీపీఆర్ఓ

ఇప్పటికే ఈ ప్రమాద ఘటనపై కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ CRS బృందం కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తోంది. సీబీఐ దర్యాప్తు కూడా సమాంతరంగా సాగనుంది. ఖరగ్‌పుర్‌, బాలేశ్వర్ సహా వివిధ ప్రాంతాల్లో CRS బృందం పర్యటించి సమాచారం సేకరించింది. ప్రమాదానికి గురైన కోరమాండల్‌, బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, గూడ్సు రైలులో విధులు నిర్వర్తించిన లోకో పైలట్లు, అసిస్టెంట్‌ లోకోపైలట్లు, ప్రమాదం జరిగిన స్టేషన్‌లో సిగ్నలింగ్‌ సిబ్బంది సహా 55 మందిని విచారించింది. మూడు రైళ్లలో విధుల్లో ఉన్న పలువురు ఇతర ఉద్యోగులను, ప్రమాదం జరిగిన స్టేషన్‌తోపాటు పక్క స్టేషన్లలో సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. దర్యాప్తు పూర్తికావడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.

కాంగ్రెస్ విమర్శలు..
వార్తా పత్రికల్లో హెడ్​లైన్ కోసమే ఒడిశా ప్రమాదంపై సీబీఐ విచారణకు ఆదేశించారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ పార్టీ. బాలేశ్వర్ ఘోర విపత్తుపై రైల్వే సేఫ్టీ కమిషనర్ నివేదిక ఇవ్వకముందే సీబీఐ విచారణకు ఆదేశించడం ఏంటని ప్రశ్నించింది. 2016 కాన్పుర్ రైలు ప్రమాదంలో ఎన్ఐఏ ఇప్పటికీ తన నివేదిక సమర్పించలేదని గుర్తు చేసింది.

ఇదీ చదవండి: 'రైల్వేలో భద్రతపై ప్రజల్లో ఆందోళన.. మోదీజీ నిర్లక్ష్యం ఎందుకు?'.. ఖర్గే ప్రశ్నల వర్షం

"2016 నవంబర్ 1న ఇందౌర్- పట్నా ఎక్స్​ప్రెస్ కాన్పుర్ వద్ద ప్రమాదానికి గురైంది. 150 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రమాదంపై ఎన్ఐఏ ద్వారా విచారణ జరిపించాలని 2017 జనవరి 23న కేంద్ర హోంమంత్రి నాటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు లేఖ రాశారు. కాన్పుర్ రైలు ప్రమాదం ఓ కుట్ర అని 2017 ఫిబ్రవరి 24న ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ప్రమాదంలో ఎన్ఐఏ చార్జ్​షీట్ ఫైల్ చేయలేదని 2018 అక్టోబర్ 21న న్యూస్​పేపర్లలో ఆర్టికల్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఎన్ఐఏ నివేదికపై అధికారిక సమాచారం లేదు. జవాబుదారీతనం సున్నా! తాజా ఘటనపై సీబీఐ విచారణ సైతం హెడ్​లైన్ మేనేజ్​మెంట్ తప్ప ఇంకోటి కాదు."
-జైరాం రమేశ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

మరో ముగ్గురు మృతి
ఒడిశా రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 278కి చేరినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. చికిత్స పొందుతున్న ముగ్గురు క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. మొత్తం 1100 మందికి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయని ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేశ్ రాయ్ తెలిపారు. గాయపడగా వారిలో 900 మంది డిశ్చార్జ్‌ అయినట్లు చెప్పారు. మరో 200 మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం మృతుల సంఖ్య 275గానే ఉంది. దీనిపై స్పందించిన రింకేశ్.. ఈ సంఖ్య సమయాన్ని బట్టి మారుతుందని చెప్పుకొచ్చారు.

193 మంది మృతదేహాలను నగరంలో ఉంచినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కమిషనర్‌ విజయ్‌ అమృత్‌ కులంగే చెప్పారు. వాటిలో 80 మృతదేహాలను గుర్తించినట్లు వివరించారు. గుర్తించిన వాటిలో 55 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. మృతదేహాలకు సంబందించి భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1929కు 200 ఫోన్‌కాల్స్ వచ్చినట్లు కమిషనర్‌ వివరించారు.

Last Updated :Jun 6, 2023, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.