ETV Bharat / bharat

CBI Counter: అవినాష్​రెడ్డి అరెస్టుతోనే అసలు నిజాలు వెల్లడి.. తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సీబీఐ

author img

By

Published : May 4, 2023, 8:04 AM IST

CBI Counter on MP Avinash
CBI Counter on MP Avinash

CBI Counter on MP Avinash: వివేకానందరెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ YS అవినాష్‌రెడ్డిని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సీబీఐ.. కుట్రలో ఆయన పాత్రను నిశితంగా వివరించింది. వివేకా హత్యలో కుట్రతోపాటు... సాక్ష్యాల ధ్వంసంలో ఆయన పాత్రను.. కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. హత్యకు ముందు రోజు, తర్వాత.. ఆయన కదలికలు, నిందితులతో ఫోన్‌కాల్స్‌ వంటి వివరాలను పూసగుచ్చినట్లు న్యాయస్థానానికి వెల్లడించింది. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేయాలని అభ్యర్థించింది. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హత్యతో సంబంధాలున్నట్లు ఆధారాల్లేవని స్పష్టం చేసింది.

అవినాష్​రెడ్డి అరెస్టుతోనే అసలు నిజాలు వెల్లడి.. తెలంగాణ హైకోర్టుకు నివేదించిన సీబీఐ

CBI Counter on MP Avinash: వైఎస్సార్​ జిల్లా రాజకీయాల్లో వివేకా చురుకైన పాత్ర పోషిస్తుండటంతో.. ఎంపీ అనినాష్‌రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి.. రాజకీయ విభేదాలతో కక్ష పెంచుకుని ఆయనకు వ్యతిరేకంగా కుట్ర పన్నడం ప్రారంభించారని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. 2017 MLC ఎన్నికల్లో గెలవకపోవడం.. పులివెందుల డివిజన్‌ మినహా మిగిలి ప్రాంతాల్లో గెలవడం... వైసీపీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగించిందన్న విషయం.. పలువురు సాక్షుల వాంగ్మూలం ప్రకారం తెలిసిందని.. కోర్టుకు వెల్లడించింది. ఎలాగైనా గెలుస్తానన్న ధీమాతో వివేకా తన డివిజన్‌ను వదిలి ఇతర డివిజన్లపై దృష్టి సారించారని పేర్కొంది.

పులివెందుల వ్యవహారాలను అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి చూశారని తెలిపింది. శివశంకరరెడ్డి MLC స్థానానికి పోటీ చేయాలని చూడగా.. అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి కూడా ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేశారని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. వివేకాకు జగన్‌ టికెట్ ఇవ్వడంతో వీరు కక్ష పెంచుకుని ఓడించారని.. వెన్నుపోటుతో ఓడిపోయినట్లు తెలుసుకుని వీరిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని వివరించింది. అప్పటి నుంచి గంగిరెడ్డిని నమ్మకపోవడంతో పాటు పలుమార్లు వివేకా తిట్టిన సందర్భాలున్నాయని పేర్కొంది. ఇదే సమయంలో గంగిరెడ్డి.. అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డితో సత్సంబంధాలు పెంచుకున్నారని తెలిపింది.

ఈ నేపథ్యంలో ఎంపీ టికెట్‌ను షర్మిల, లేదా విజయమ్మకు ఇవ్వాలని.. అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్ కాకుండా.. జమ్మలమడుగు MLA టికెట్ ఇవ్వాలని చెప్పడంతో పాటు.. కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీకి షర్మిలను వివేకా ఒప్పించారని.. సీబీఐ వివరించింది. వివేకా రాజకీయ ఎత్తుగడలను ఊహించిన ఆ ముగ్గురు.. ఆయనపై అసంతృప్తిగా ఉన్నారని.. తెలంగాణ హైకోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో.. నేరచరిత్ర ఉన్న శివశంకరరెడ్డి ద్వారా హత్యకు కుట్ర పన్నినట్లు.. ప్రాసంగిక సాక్ష్యాలు వెల్లడిస్తున్నాయని వివరించింది. హత్యకు నెల ముందు నుంచే భారీ మొత్తాన్ని ఆశ చూపినట్లు.. దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం 40 కోట్ల రూపాయలు ఇస్తానని శివశంకరరెడ్డి హామీ ఇచ్చారని.. సీబీఐ తెలిపింది.

2019 మార్చి 14, 15న వివేకా హత్య, సాక్ష్యాల ధ్వంసం జరిగిన తర్వాత.. మార్చి 17న అవినాష్‌రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ప్రకటన జరిగిన నేపథ్యంలో.. కుట్ర జరిగినట్లు తెలుస్తోందని.. తెలంగాణ హైకోర్టుకు సీబీఐ నివేదించింది. హత్య ముందు రోజు.. మైదుకూరు ప్రచారంలో వివేకాతో ఉన్న గంగిరెడ్డి రెండు సార్లు.. యాదాటి సునీల్‌ యాదవ్‌కు ఫోన్‌ చేశారని పేర్కొంది. గూగుల్ టేక్‌ఔట్‌ ప్రకారం సునీల్‌యాదవ్.. ఈ సమయంలో 6 గంటల 15 నిమిషాల నుంచి 6.33 మధ్య అవినాష్‌రెడ్డి వాళ్ల ఇంట్లో ఉంటూ గొడ్డలి తీసుకురావడానికి కదిరి వెళ్లిన దస్తగిరి కోసం ఎదురుచూస్తున్నాడని.. తెలిపింది.

సునీల్‌యాదవ్‌ ఫోన్‌ మెసేజ్‌ల ద్వారా దస్తగిరినీ సంప్రదించారని పేర్కొంది. ఈ మధ్యలో ఉదయ్‌కుమార్‌రెడ్డి... అవినాష్‌రెడ్డి ఇంటికి 6 గంటల 53నిమిషాలకు వచ్చి... 8 గంటల 7 నిమిషాల వరకు ఉన్నారని వివరించింది. శివశంకరరెడ్డి కూడా 7.15కు పులివెందుల చేరుకుని.. జమ్మలమడుగులో వివేకాతో ఉన్న గంగిరెడ్డికి 7.58కి ఫోన్‌ చేశారని వెల్లడించింది. హత్యకు ముందు, తర్వాత.. ఎక్కువ సమయం అవినాష్‌రెడ్డి, శివశంకరరెడ్డి.. ఒకే టవర్‌ పరిధిలో ఉన్నారని... సీబీఐ తెలిపింది.

దస్తగిరి 8 గంటల 39నిమిషాలకి పులివెందుల చేరుకుని.. సునీల్‌యాదవ్‌ను కలవగా... భాస్కరరెడ్డి... తన రెండు ఫోన్‌లను స్విచాఫ్ చేశారని పేర్కొంది. మార్చి 14న 8 గంటల 21 నిమిషాలకు చివరి కాల్ చేశాక... తిరిగి 16న 9 గంటల 40నిమిషాలకు కాల్ చేశారని వెల్లడించింది. మరో ఫోన్‌లో మార్చి 14న రాత్రి 8 గంటల13నిమిషాలకు కాల్‌ చేసి.. తర్వాత 15న 7 గంటల 35నిమిషాలకు కాల్‌ చేశారని.. మధ్యలో ఎలాంటి కాల్స్‌ లేవని.. CBI వివరించింది. 14, 15 తేదీల్లో అవినాష్‌, భాస్కరరెడ్డి ఇళ్లకు సునీల్‌యాదవ్‌ పలుమార్లు వెళుతూనే ఉన్నారని.. గూగుల్ టేక్‌ఔట్‌ ఆధారంగా.. గంటలు, నిమిషాలు సహా.. CFSL నివేదిక వెల్లడించిందని.. సీబీఐ పేర్కొంది.

యాదాటి సునీల్‌యాదవ్‌, గంగిరెడ్డి, ఉమాశంకరరెడ్డి, దస్తగిరి.. తరచూ ఫోన్‌ ద్వారా మెసేజ్‌లు పంపుకున్నారని.. తెలంగాణ హైకోర్టుకు సీబీఐ వివరించింది. ఎర్రగంగిరెడ్డి, ఉదయ్‌కుమార్‌ రెడ్డితో.. శివశంకరరెడ్డి మాట్లాడుతూనే.. YS భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డిని తరచూ సంప్రదిస్తూనే ఉన్నారని తెలిపింది. నిందితుల మధ్య 14వ తేదీ సాయంత్రం 6 నుంచి 15వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఫోన్‌కాల్స్‌ ఉన్నాయని వెల్లడించింది. 2022 జూన్‌ 7న అవినాష్‌రెడ్డి, వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి, పులివెందులలోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఉన్నట్లు.. అక్షాంశాలు, రేఖాంశాలను పరిశీలించి.. CFSL నివేదిక సిద్ధం చేసిందని.. సీబీఐ తెలిపింది.

అక్షాంశాలు, రేఖాంశాలు కూడా గూగుల్‌ టక్‌ఔట్‌తో పాటు.. CFSL పరిశీలనకు పంపగా... దీని నివేదిక ప్రకారం సునీల్‌యాదవ్‌ మార్చి 15న తెల్లవారుజామున ఒంటి గంట 58 నిమిషాలకు అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలిందని పేర్కొంది. దస్తగిరి వాంగ్మూలంతో చూస్తే.. వివేకానందరెడ్డి హత్య కుట్ర వెనుక అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకరరెడ్డి ఉన్నట్లు తేలిందని.. సీబీఐ స్పష్టం చేసింది. సాక్ష్యాల విధ్వంసం సమయంలో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి ఉన్నారని సీబీఐ.. తెలంగాణ కోర్టుకు తెలిపింది. అవినాష్‌రెడ్డి డ్రాయింగ్ రూం లోపల, లాన్‌ ప్రాంతంలో ఉండగా.. శివశంకరరెడ్డి, మనోహర్‌రెడ్డి, గంగిరెడ్డితో కలిసి.. భాస్కరరెడ్డి బెడ్‌రూంలో ఉంటూ.. సాక్ష్యాలను ధ్వంసం చేయించారని వివరించింది.

వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి.. సీఐతో మాట్లాడి... FIR నమోదు చేయాలని చెప్పారని సీబీఐ తెలిపింది. అవినాష్‌రెడ్డి సహా మిగతావారు.. వివేకాను రక్తపు మడుగులో చూసిన వెంటనే భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతారెడ్డికి సమాచారం ఇవ్వడంగానీ, వారు వచ్చేదాకా వేచి ఉండటంగానీ చేయకుండా.. శుభ్రం చేయడం కుట్రలో భాగమేనని సీబీఐ పేర్కొంది. అంతేకాకుండా.. నిబంధనలు పట్టించుకోకుండా.. గుండెపోటుతో రక్తపు వాంతులు అయ్యాయని... అందుకే శుభ్రం చేశామని పేర్కొన్నారని వివరించింది. అవినాష్‌రెడ్డి సూచనల మేరకు.. అస్పష్టమైన వివరాలతో... కనీసం గాయాలు, రక్తపు మడుగులో మృతదేహం పడి ఉండటం వంటి వివరాల్లేకుండా.. ఎంవీ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని తెలిపింది.

శివశంకరరెడ్డి మార్చి 15న 8 గంటల 25నిమిషాల నుంచి 12 గంటల45 నిమిషాల వరకు.. పులివెందుల స్టేషన్ సమీపంలో ఉన్నట్లు గూగుల్ టేక్‌ఔట్‌ ద్వారా వెల్లడైందని పేర్కొంది. అంటే ఫిర్యాదు సమయంలో కృష్ణారెడ్డితో పాటు ఉన్నట్లు తెలుస్తోందని చెప్పింది. ఈ మధ్యలో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, గంగిరెడ్డి మధ్య 5 ఫోన్‌ కాల్స్ వెళ్లాయని పేర్కొంది. సునీల్‌యాదవ్‌ కూడా 9.12 నుంచి 9.46 నిమిషాల మధ్య పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లినట్లు.. గూగుల్ టేక్‌ఔట్‌ ద్వారా వెల్లడైందని.. సీబీఐ స్పష్టం చేసింది. వివేకా భార్య, కుమార్తె, అల్లుడు... హైదరాబాద్‌ నుంచి పులివెందులకు పన్నెండున్నరకు చేరుకున్నారని.. అప్పటికే కొనసాగుతున్న ఇంక్వెస్ట్ నివేదికపై సంతకం చేశారని.. సీబీఐ.. తెలంగాణ హైకోర్టుకు వివరించింది.

వివేకా హత్య వెనుక.. కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి పాత్ర ఉన్నట్లు ఆధారాల్లేవని సీబీఐ.. కోర్టుకు స్పష్టం చేసింది. షేక్‌ షమీమాను వివేకా 2010లోనే పెళ్లి చేసుకుని సంబంధం కొనసాగిస్తున్నారని.. తెలిపింది. ఈ పెళ్లి విషయంలో కుటుంబసభ్యులతో పాటు... N.శివప్రకాశ్‌రెడ్డికీ అసంతృప్తి ఉన్నా.. వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని.. తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది.

CBI Counter on MP Avinash
వివేకా హత్య కేసులో ఫోన్​ కాల్​ వివరాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.