ETV Bharat / bharat

బూస్టర్‌ డోసుపై ఎయిమ్స్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Oct 23, 2021, 9:08 PM IST

aiims chief
ఎయిమ్స్‌ చీఫ్‌

వచ్చే ఏడాది నాటికి దేశంలో బూస్టర్‌ డోసు అవసరం ఉండొచ్చని దిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్‌ రణ్‌దీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. వైరస్ ఉత్పరివర్తనం చెందితే బూస్టర్ డోసు తప్పనిసరని చెప్పారు.

దేశంలో బూస్టర్‌ డోసుల పంపిణీపై చర్చలు జరుగుతున్న సమయంలో దిల్లీ ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా టీకా మొదటి రెండు డోసులు ఎన్ని రోజులు సమర్థంగా పనిచేస్తాయనే అంశంపైనే బూస్టర్‌ షాట్ వినియోగం ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

"బూస్టర్‌ డోసు వినియోగంపై ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. యాంటీబాడీల ఆధారంగా బూస్టర్‌ షాట్‌ను ఇవ్వలేం. అది సమయం మీద ఆధారపడి ఉంటుంది. రెండో డోసు తీసుకున్న ఏడాది తర్వాత బూస్టర్‌ డోసు గురించి ఆలోచించాలి. అయితే దీనిపై మరింత సమాచారం అవసరం."

-రణ్‌దీప్‌ గులేరియా

మూడో డోసు వినియోగంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నట్లు గులేరియా తెలిపారు. ఈ టీకాపై ప్రభుత్వం వచ్చే ఏడాదే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. వైరస్‌ ప్రభావం అధికంగా ఉండేవారు, వృద్ధులకే మొదట ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు.

"బ్రిటన్‌లో కేసులు పెరుగుతుండటాన్ని మనం చూస్తున్నాం. అయితే ఆసుపత్రుల్లో చేరేవారు, మృతుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. బ్రిటన్‌ గతేడాది డిసెంబర్‌లో వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది. అంటే డిసెంబర్‌లో ఇచ్చినప్పటికీ టీకాల ప్రభావం ఇంకా వారిపై ఉంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుంటే భారతీయులు సురక్షితంగానే ఉన్నట్లు అర్థం. అయితే వైరస్‌లో మరిన్ని మ్యుటేషన్లు ఏర్పడితే బూస్టర్‌ డోసు తప్పనిసరి అవుతుంది."

-రణ్‌దీప్‌ గులేరియా

పిల్లలకు వ్యాక్సిన్లపై స్పందించిన గులేరియా.. 'చిన్నారులకు వేసే టీకాలపై ఇంకా చర్చలు సాగుతున్నాయి. అమెరికా లాంటి దేశాలు సిఫార్సు చేసిన వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచే అవకాశాలున్నాయి' అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.