ETV Bharat / bharat

కుక్కలకు ఆహారంగా శరీర భాగాలు! ఠాణె హత్య కేసులో ట్విస్ట్.. 'ఆమెది ఆత్మహత్యే!'

author img

By

Published : Jun 9, 2023, 12:45 PM IST

Updated : Jun 9, 2023, 1:51 PM IST

Mira road Manoj Sane : మహారాష్ట్ర ఠాణెలో జరిగిన అతికిరాతక హత్య కేసులో అనూహ్య విషయాలు బయటకొస్తున్నాయి. మృతదేహ భాగాలను నిందితుడు.. కుక్కలకు ఆహారంగా వేశాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, సరస్వతిని తాను చంపలేదని, ఆమెది ఆత్మహత్య అని నిందితుడు చెప్పుకొచ్చాడు. హెచ్ఐవీతో బాధపడుతున్న తనకు.. ఆమెతో శారీరక సంబంధాలు లేవని చెప్పాడు.

Mira road Manoj Sahani
Mira road Manoj Sahani

Mira road Manoj Sane : మహారాష్ట్ర ఠాణెలో సహజీవన భాగస్వామిని అతి కిరాతకంగా చంపిన కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భాగస్వామిని చంపిన నిందితుడు.. శరీర భాగాలను ముక్కలుగా నరికి ప్రెజర్ కుక్కర్​లో ఉడికించాడని గురువారం పోలీసులు వెల్లడించారు. కొన్ని శరీర భాగాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసినట్లు సమాచారం. అయితే, తాజా సమాచారం ప్రకారం.. గతకొద్ది రోజులుగా నిందితుడు కుక్కలకు బాగా ఆహారం పెడుతున్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో శునకాలకు శరీర భాగాలనే పెట్టాడా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

మృతురాలు సరస్వతి వైద్య (36), నిందితుడు మనోజ్ సహానీ (56) సహజీవనం చేస్తూ ఠాణెలోని మీరా రోడ్ అపార్ట్​మెంట్​లో గత మూడేళ్లుగా నివాసం ఉంటున్నారు. అయితే, బుధవారం వారి ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన పొరుగింటివారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అపార్ట్​మెంట్​కు వచ్చి పరిశీలించిన పోలీసులకు.. గదిలో మృతదేహం లభించింది. దీంతో సరస్వతి హత్య వెలుగులోకి వచ్చింది. ముక్కలు ముక్కలుగా నరికిన శరీర భాగాలు.. బకెట్లలో కనిపించాయని పోలీసులు తెలిపారు. నాలుగు రోజుల క్రితమే హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.

Body parts boiled in cooker : సహానీ బెడ్​రూమ్​లో భారీ ప్లాస్టిక్ బ్యాగులు, రక్తపు మడుగులో ఉన్న చెట్లు నరికే యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రెజర్ కుక్కర్​తో పాటు గిన్నెల్లో శరీర భాగాలను ఉడకబెట్టినట్లు గుర్తించారు. ఇంకొన్ని శరీర భాగాలను మిక్సీలో వేసినట్లు తెలిపారు. మహిళ వెంట్రుకలు, సగం కాలిన ఎముకలు, శరీర భాగాలు కిచెన్​ సింక్​లో, బకెట్లలో కనిపించాయి. వీటన్నింటినీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడిని న్యాయస్థానం జూన్ 16 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.

Mira road Manoj Sahani
మృతురాలు సరస్వతి; నిందితుడు మనోజ్

అయితే, గతకొద్దిరోజుల నుంచి మనోజ్ సహానీ.. శునకాలకు ఆహారం పెడుతున్నాడని స్థానికులు పోలీసులతో చెప్పారు. గతంలో ఎన్నడూ కుక్కలకు ఒక్క బిస్కెట్ కూడా వేయని సహానీ.. రోజూ ఆహారం పెట్టడం ఆశ్చర్యంగా అనిపించిందని తెలిపారు. అయితే, మృతురాలి శరీర భాగాలనే శునకాలకు వేశాడా అన్నది తెలియలేదని పోలీసులు వెల్లడించారు. శరీర భాగాలను బయటపడేసేందుకు అనేక సార్లు బయటకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి.. కుక్కలను మచ్చిక చేసుకునేందుకు ఆహారం ఇచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సరస్వతిని చంపడానికి గల కారణాలు ఇంకా తెలియలేదని నయానగర్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతానికి నిందితుడిపై హత్య, ఆధారాల ధ్వంసం సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు.

'ఆమెది ఆత్మహత్య'
మరోవైపు, సరస్వతి ఆత్మహత్య చేసుకుందని నిందితుడు పోలీసుల విచారణలో ఆరోపించాడు. ఈ కేసు తన మెడకు చుట్టుకుంటుందనే భయంతోనే మృతదేహాన్ని కనిపించకుండా చేసేందుకు ప్రయత్నించానని చెప్పాడు. తాను హెచ్‌ఐవీ బాధితుడినని.. చాలా ఏళ్ల క్రితమే ఈ వ్యాధి బారిన పడినట్లు తెలిపాడు. సరస్వతితో తనకు లైంగిక సంబంధాలు లేవని, ఆమెను కుమార్తెలా చూసుకున్నానని నిందితుడు చెప్పినట్లు తెలుస్తోంది.

"సరస్వతి పదో తరగతి పరీక్షలు రాయాలనుకుంది. ఇందుకోసం నేను ఆమెకు గణిత పాఠాలు చెప్పేవాడిని. అయితే, ఆమె చాలా సంకుచితంగా ఉండేది. నేను ఎప్పుడు ఆలస్యంగా ఇంటికి వచ్చినా అనుమానించేది. అయితే, జూన్‌ 3న నేను బయటి నుంచి ఇంటికి వచ్చే సరికి ఆమె ఆత్మహత్య చేసుకుని కనిపించింది. కేసులో ఇరుక్కుంటానన్న భయంతో ఆమె మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నా. దిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన గురించి తెలుసుకుని అదే తరహాలో మృతదేహాన్ని ముక్కలు చేశా. ఆ తర్వాత నేనూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా" అని నిందితుడు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే, ఏ విషయమైనా దర్యాప్తులో తేలుతుందని పోలీసులు స్పష్టం చేశారు.

మృతురాలు సరస్వతి వైద్యకు బంధువులు ఎవరూ లేరు. అనాథగా పెరిగిన సరస్వతి.. బోరివలీ ప్రాంతంలోని ఓ ఆశ్రమంలో ఉండేది. నిందితుడు మనోజ్‌ అవివాహితుడు. బోరివాలిలో అతడికి ఓ ఇల్లు కూడా ఉంది. కుటుంబ సభ్యులు కొందరు అక్కడే నివాసం ఉంటుండగా.. మనోజ్‌ మాత్రం వేరుగా ఉంటున్నాడు. ఐటీఐలో శిక్షణ పొందిన అతడు.. సరైన ఉద్యోగం దొరక్క గత 10 ఏళ్లుగా రేషన్‌ షాపులో పనిచేస్తున్నాడు. అక్కడే సరస్వతికి అతడితో పరిచయం ఏర్పడింది. 2014 నుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 2016 నుంచి ఇద్దరూ ఒకేచోట ఉండటం ప్రారంభించారు. మూడేళ్ల క్రితం మీరా రోడ్ అపార్ట్​మెంట్​కు మారారు. ఇద్దరి మధ్య పెద్దగా గొడవలేమీ జరిగేవి కాదని పొరుగింటివారు చెబుతున్నారు. ఏం జరిగినా వారిద్దరి మధ్యే ఉండేదని అంటున్నారు.

అయితే, నిందితుడిని తన మామగా సరస్వతి చెప్పుకునేదని సమాచారం. రెండేళ్ల క్రితం తాను పెరిగిన ఆశ్రమాన్ని సందర్శించిన ఆమె.. ముంబయిలో తన మామ వద్ద ఉంటున్నట్లు సరస్వతి వైద్య చెప్పినట్లు ఆమె పెరిగిన బాలికాశ్రమంలో పనిచేసే మహిళా ఉద్యోగి తెలిపారు. ఆయన వస్త్ర వ్యాపారి అని, చాలా ధనవంతుడని కూడా చెప్పినట్లు చెప్పారు. అయితే అప్పుడు సరస్వతి వైద్య పూర్తిగా నిరాశతో కనిపించినట్లు మహిళా ఉద్యోగి తెలిపారు.

Last Updated : Jun 9, 2023, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.