ETV Bharat / bharat

'నాలుగు కేంద్ర మంత్రి పదవులు అడిగితే.. భాజపా అప్పుడు ఒప్పుకోలేదు'

author img

By

Published : Aug 12, 2022, 10:55 PM IST

Nitish Kumar comments on BJP: బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్.. భాజపాపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో నాలుగు కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలన్న తన డిమాండ్‌ను భాజపా తిరస్కరించినప్పుడే ఇక తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్టు నితీశ్ వెల్లడించారు.

nitish kumar news
జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌

Nitish Kumar comments on BJP: ఇటీవల భాజపాతో తెగదెంపులు చేసుకొని మహాకూటమితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో నాలుగు కేంద్రమంత్రి పదవులు ఇవ్వాలన్న తన డిమాండ్‌ను భాజపా తిరస్కరించినప్పుడే ఇక తమ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో చేరకూడదని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. తన మాజీ సన్నిహితుడు ఆర్‌సీపీ సింగ్‌ గతేడాది కేంద్రమంత్రివర్గంలో చేరడంలోనూ తన అంగీకారం లేదని నితీశ్ స్పష్టంచేశారు.

"మాకు 16మంది ఎంపీలు ఉన్నారు.. కనీసం నాలుగు కేంద్రమంత్రి పదవులు కావాలని 2019లోనే భాజపాను అడిగా. బిహార్‌ నుంచి మరొకరికి మాత్రమే ఇవ్వగలమని చెప్పారు. ఐదుగురికి ఇవ్వాల్సిన చోట అంతకన్నా తక్కువ మందికి ఇవ్వడానికి అంగీకరిస్తే చెడు సందేశం వెళ్తుంది. వాళ్లు ఐదుగురికి ఇచ్చేందుకు తిరస్కరించడంతో మేం కేంద్ర మంత్రివర్గంలో చేరలేదు" అని నీతీశ్‌ వ్యాఖ్యానించారు. అలాగే, ఆర్‌సీపీ సింగ్‌ కేంద్రమంత్రివర్గంలో చేరడానికి ముందే నీతీశ్‌ సమ్మతి కోరినట్టుగా భాజపా నేతలు చేస్తున్న వ్యాఖ్యల్నీ ఆయన ఖండించారు. అవన్నీ అబద్ధాలేనన్నారు.

ఇటీవల నితీశ్‌ కుమార్‌ ఎన్డీఏతో తెగదెంపులు చేసుకోవడంతో బిహార్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. భాజపా-జేడీయూ సంకీర్ణ ప్రభుత్వంలో సీఎంగా కొనసాగిన నితీశ్‌.. తన పదవికి రాజీనామా చేసి ఆర్జేడీ-కాంగ్రెస్‌-వామపక్షాల సారథ్యంలోని మహాకూటమితో చేతుల కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో మొన్న నితీశ్‌ ఎనిమిదోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ రెండోసారి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. దీంతో నితీశ్‌పై భాజపా నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

ఇవీ చదవండి: పెరుగుతున్న కొవిడ్ కేసులు.. కేంద్రం అలర్ట్.. ప్రజలు గుమిగూడొద్దంటూ..

ఫ్రీ విమాన టికెట్ అంటూ ఎర.. లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.