ETV Bharat / bharat

టీఎంసీలోకి తిరిగొచ్చిన ముకుల్​ రాయ్​

author img

By

Published : Jun 11, 2021, 2:58 PM IST

Updated : Jun 11, 2021, 9:41 PM IST

Mukul Roy
ముకుల్​రాయ్​

భాజపా సీనియర్​ నేత ముకుల్​రాయ్​ తృణమూల్​ కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. కోల్​కతాలోని టీఎంసీ పార్టీ కార్యాలయంలో సీఎం మమత బెనర్జీ ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు.

బంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్రంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ భాజపాను వీడి తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో శుక్రవారం ఆయన తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. ముకుల్‌తో పాటు ఆయన కుమారుడు సుబ్రాన్షు కూడా టీఎంసీ కండువా కప్పుకొన్నారు.

బంగాల్‌ శాసనసభ ఎన్నికలకు ముందు తృణమూల్‌ కాంగ్రెస్​కు చెందిన పలువురు కీలక నేతలు భాజపాలో చేరిన విషయం తెలిసిందే. అందులో మొట్టమొదటి వ్యక్తి ముకుల్‌ రాయ్‌ కావడం గమనార్హం.

మమతా బెనర్జీకి అత్యంత ఆప్తుల్లో ఒకరైన ముకుల్‌.. పార్టీ ప్రారంభం నుంచి కీలకంగా పనిచేశారు. అయితే 2017లో దీదీతో రాజకీయపరమైన విబేధాలు రాగా పార్టీకి దూరమయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ అనుమతి లేకుండా భాజపా నేతలను కలిసి తృణమూల్‌ కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత భాజపాలో చేరి, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు.

ఇంకా వస్తారు.. వాళ్లను మాత్రం తీసుకోం!

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడి, తీవ్ర పదజాలంతో దూషించి తమకు ద్రోహం చేసిన వాళ్లను తిరిగి టీఎంసీలోకి తీసుకోబోమని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ముకుల్‌ రాయ్‌కి స్వాగతం చెబుతున్నామన్నారు. ఆయన ఎప్పుడూ టీఎంసీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. భాజపాలో ఆయన్ను బెదిరించారని, అదే ఆయన అనారోగ్యానికి దారితీసిందన్నారు. ముకుల్‌ను తమ పాత కుటుంబ సభ్యుడిగా పేర్కొన్న మమత.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అన్నారు. టీఎంసీ ఇప్పటికే బలమైన పార్టీ అని చెప్పారు. ముకుల్‌ రాయ్‌ని భాజపాలో బెదిరించారని, ప్రస్తుత నిర్ణయం ఆయనకు మానసిక ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నట్టు దీదీ పేర్కొన్నారు. సౌమ్యంగా వ్యవహరించిన వారిని మాత్రం తీసుకొనే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

ఎవరూ ఉండలేరు..

మరోవైపు.. భాజపాను వీడి సొంత గూటికి రావడం, పాత మిత్రులను చూడటం ఆనందంగా ఉందని ముకుల్‌ రాయ్‌ అన్నారు. తాను భాజపాలో ఉండలేకపోయానన్నారు. మమతను యావత్‌ దేశానికి నాయకురాలిగా అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెంగాల్‌ భాజపాలో ఎవరూ ఉండలేరని ఆయన వ్యాఖ్యానించారు. కొన్నేళ్ల క్రితం మమతపై విమర్శలు చేయడంపై మీడియా ముకుల్‌రాయ్‌ని ప్రశ్నించగా.. దీదీతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. అనంతరం జోక్యంచేసుకున్న మమత.. విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నించొద్దంటూ విలేకర్లతో అన్నారు.

భాజపాలో ఇమడలేకే..

భాజపాలో ఇమడలేకే ముకుల్​ రాయ్​ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలోకి ఆహ్వానించిన తరువాత ఆయనకు జాతీయ ఉపాధ్యక్షుడు పదవి కట్టబెట్టిన అధిష్ఠానం ఆపై ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వలేదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అంతేగాక తృణమూల్ కాంగ్రెస్​ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ముకుల్​ పార్టీ ప్రారంభం నుంచి చక్రం తిప్పుతూ వచ్చారు. అంతటి వెసులుబాటు కూడా ఆయనకు ఉన్నదని సహచరులు చెబుతుంటారు. కానీ కమలం పార్టీలోకి వెళ్లిన తరువాత అటువంటి గుర్తింపు కొరవడింది.

బంగాల్​లో ఎలాగైనా అధికారంలోకి రావాలని మమతకు నమ్మినబంటులా ఉన్న సువేందు అధికారిని కమలం అగ్రనేతలు భాజపాలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ముందుగా వచ్చిన ముకుల్​ కంటే వెనుక వచ్చిన సువేందుకు అధిష్ఠానం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనపడింది. ఇది కూడా ముకుల్​ సొంతగూటికి తిరిగి రావడానికి ఓ కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో కూడా అతనికి అంత ప్రధాన్యం ఇవ్వలేదు. ఎన్నికల్లో ఇరువురు నేతలు విజయం సాధించినా.. ప్రతిపక్షనేత ఎంపిక విషయంలో కూడా పార్టీలోకి ముందు వచ్చిన ముకుల్​ను కాదని పార్టీ పెద్దలు సువేందు వైపే మొగ్గు చూపించారు. ఇదిలా ఉంటే తృణమూల్​ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సత్యజిత్‌ బిస్వాస్‌ హత్య కేసు నిందితుడిగా ముకుల్‌ రాయ్‌ ప్రధానంగా వినిపించింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండే సీఐడీ విచారింస్తుంది. దీని నుంచి తప్పించుకోవాలి అంటే మమతకు సరెండర్​ కాక తప్పదని మరో వాదన వినిపిస్తుంది. ఇలాంటి అనేక కారణాలను దృష్టిలో పెట్టుకుని ముకుల్​ రాయ్​ తిరిగి సొంత గూటికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: కీలక నేతల 'ఘర్​ వాప్సీ'- అయోమయంలో భాజపా

Last Updated :Jun 11, 2021, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.