ETV Bharat / bharat

రామాయణం థీమ్​తో కొత్త రైలు.. మార్చి 10న ప్రారంభం!

author img

By

Published : Feb 14, 2020, 6:48 PM IST

Updated : Mar 1, 2020, 8:40 AM IST

With Ramayana themed interiors and bhajans new train set to be launched by March end
ఇకపై రైల్లోనే రామాయణం: త్వరలోనే పట్టాలెక్కనున్న కొత్త రైలు

పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే వారికి రైల్వే బోర్డు శుభవార్త ప్రకటించింది. గుడిలో తరహాలోనే రైల్లో కూడా రామాయణ నేపథ్యాన్ని ప్రతిబింబించేలా ఓ కొత్త రైలు రూపుదిద్దుకుంటోంది. ఫలితంగా రైల్లోనే భక్తి పాటలు పాడుకోవచ్చు, భజనలూ చేసుకోవచ్చు. ఎటుచూసినా రామాయణ గాథ ఉట్టిపడేలా.. కనవిందు కలిగించే ఈ రైలు దేశవ్యాప్తంగా శ్రీరాముడు కొలువైన అన్ని దేవాలయాలకు పయనించనుంది.

రామాయణ ఇతిహాస గాథలు, భజన పాటలతో కూడిన సరికొత్త 'రామాయణ ఎక్స్​ప్రెస్'​ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా శ్రీరాముడు కొలువై ఉన్న అన్ని దేవాలయాలను కలుపుతూ వెళ్లే ఈ సరికొత్త రైలుకు ఈ మార్చి నెలాఖరుకల్లా పచ్చజెండా ఊపేలా ప్రణాళికలు రచిస్తోంది. ఫలితంగా భక్తులకు కదిలే ఆలయంలో ఉన్న అనుభూతి కలుగుతుందని రైల్వే బోర్డు ఛైర్మన్​ వీకే యాదవ్​ స్పష్టం చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మార్చి 10న రామాయణ ఎక్స్​ప్రెస్​ పట్టాలెక్కుతుందని ప్రకటించారు.

"దేశవ్యాప్తంగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఇలా అన్ని ప్రాంతాలకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఫలితంగా ప్రయాణికులు అందరూ రామాయణ ఎక్స్​ప్రెస్ సేవలు పొందేందుకు వీలుంటుంది. రైలు లోపల, బయటి భాగాలు మొత్తం రామాయణ ఇతివృత్తాలతో నిండి ఉంటాయి. రైలులోనే భజనలు కూడా ఏర్పాటు చేస్తాం. రైలు నడిచే సమయాలు, ప్యాకేజీలపై ఐఆర్​సీటీసీ కసరత్తులు చేస్తోంది. హోలీ పండుగ తర్వాత రైలు పట్టాలెక్కుతుందని ఆశిస్తున్నాం."

- వీకే యాదవ్​, రైల్వే బోర్డు ఛైర్మన్

గతంలో 'శ్రీ రామాయణ ఎక్స్​ప్రెస్'

గతంలో 'లార్డ్ రామ్​' పేరుతో ఓ ప్రత్యేక రైలును నడిపింది రైల్వే సంస్థ. 800 మంది ప్రయాణికుల సామర్థ్యంతో దేశంలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను కలుపుతూ ప్రయాణించే 'శ్రీ రామాయణ ఎక్స్​ప్రెస్​' రైలు గతేడాది నవంబర్​ 14న ప్రారంభమైంది.

నందిగ్రామ్​, సీతామర్హి, జానక్​పుర్​, వారణాసి, ప్రయాగ్​, శ్రీంగ్వేర్​పుర్​, చిత్రకూట్​, నాసిక్​, హంపి, అయోధ్య, రామేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలకు భక్తులను చేరవేస్తుంది శ్రీ రామాయణ ఎక్స్​ప్రెస్.

ఇదీ చదవండి: ఔరా! ఆమె చేతులు అద్భుతాన్ని చేశాయి

Last Updated :Mar 1, 2020, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.