ETV Bharat / bharat

అక్రమ వసూళ్లు.. అవినీతి 'రహదారి'..!

author img

By

Published : Mar 1, 2020, 8:38 AM IST

Updated : Mar 3, 2020, 12:55 AM IST

Roads that turn into corruption
అవినీతికి అడ్డగా మారిన రహదారులు

దేశానికి పరాయిపాలన పీడ విరగడయ్యాక తన తదుపరి పోరాటం అవినీతిపైనే అనేవారు మహాత్మాగాంధీ. అవినీతి అంతానికి పంతం పట్టినట్లు అందరూ చెబుతున్నా వాస్తవంలో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని ఆ మధ్య సర్వోన్నత న్యాయస్థానమే విచారం వెలిబుచ్చింది. రోడ్డెక్కిన ట్రక్కులు గమ్యం చేరేలోగా వివిధ సర్కారీ విభాగాల సిబ్బందికి ముట్టజెబుతున్న మామూళ్ల మొత్తం ఏడాదికి దాదాపు రూ.22 వేలకోట్లు. తాజాగా అందులో ‘విశేష వృద్ధి’ నమోదైంది. ఆ బాగోతమేమిటో మీరే పరికించండి...

దేశానికి పరాయిపాలన పీడ విరగడయ్యాక తన తదుపరి పోరాటం అవినీతిపైనే అనేవారు మహాత్మాగాంధీ. అనంతర కాలాన- స్వతంత్ర భారతంలో అవినీతి లేనిదెక్కడని ప్రశ్నించి యావత్‌ ప్రపంచాన్నీ విస్మయపరచిన ఘనత ఇందిరాగాంధీది. తరవాతి కథ, నడుస్తున్న చరిత్ర అందరికీ తెలిసినవే. అవినీతి అంతానికి పంతం పట్టినట్లు అందరూ చెబుతున్నా వాస్తవంలో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని ఆమధ్య సర్వోన్నత న్యాయస్థానమే విచారం వెలిబుచ్చింది. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిన చందంగా లంచాలు, ఆమ్యామ్యాల పద్దు ఎలా ఏ మేర విస్తరిస్తున్నదో లెక్కలు విశదీకరిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం లూథియానా, దిల్లీ, అహ్మదాబాద్‌, ఇండోర్‌, ముంబయి, కోల్‌కతా, విజయవాడ, బెంగళూరు, చెన్నైలలో ట్రక్కు డ్రైవర్లు ఎంతమంది మామూళ్లు చెల్లిస్తున్నారో కూపీ లాగేందుకు విస్తృత అధ్యయనం చేపట్టారు. అప్పట్లో రాబట్టిన సమాచారం ప్రకారం, రోడ్డెక్కిన ట్రక్కులు గమ్యం చేరేలోగా వివిధ సర్కారీ విభాగాల సిబ్బందికి ముట్టజెబుతున్న మామూళ్ల మొత్తం ఏడాదికి దాదాపు రూ.22 వేలకోట్లు. తాజాగా అందులో ‘విశేష వృద్ధి’ నమోదైంది. ఆ బాగోతమేమిటో మీరే పరికించండి...

ఏటా రమారమి రూ.48 వేలకోట్లు...

'సేవ్‌లైఫ్‌ ఫౌండేషన్‌'’ అనే స్వచ్ఛంద సంస్థ దేశంలోని పది ప్రధాన రవాణా జోన్లలో వివరాలు సేకరించి క్రోడీకరించగా, కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయమంత్రి వీకే సింగ్‌ చేతుల మీదుగా విడుదలైన నివేదిక వెల్లడించిన ముఖ్యాంశమేమిటో తెలుసా? ట్రాఫిక్‌, హైవే పోలీసులు, రవాణా సిబ్బంది, పన్ను విభాగాలవారికి ట్రక్కు డ్రైవర్లు, యజమానులు సమర్పించుకుంటున్న లంచాల రాశి ఇప్పుడు ఏటా రమారమి రూ.48 వేలకోట్లకు చేరింది. గువాహటీలో 97.5 శాతం, చెన్నైలో 89 శాతం, దిల్లీలో 84.4 శాతం దాకా సర్వేలో పాల్గొన్న డ్రైవర్లు తాము లంచాలు ముట్టజెప్పామని అంగీకరించారు. ఆర్టీఓ అధికారుల అవినీతికి సంబంధించి బెంగళూరు దేశంలోనే ముందున్నదని ఆ అధ్యయనం నిగ్గుతేల్చింది. డ్రైవింగ్‌ లైసెన్సుల పునరుద్ధరణ కోసం ముంబయిలో 93 శాతం దాకా ముడుపులు ఇవ్వక తప్పలేదని వాపోయినవారే. ఒక్కముక్కలో- ఇది, తరతమ భేదాలతో దేశమంతటా ముక్కుపుటాలు అదరగొడుతున్న గబ్బు బాగోతాలకు మచ్చతునక!

బస్తీ మే సవాల్‌’ అంటున్న దిల్లీ..

వాయుకాలుష్యంలోనే కాదు, అవినీతి కశ్మలం పరంగానూ దేశ రాజధాని దిల్లీ మహానగరం ‘బస్తీ మే సవాల్‌’ అంటున్న రీతిగా అలవిమాలిన అప్రతిష్ఠ మూటకట్టుకుంటోంది. దిల్లీలో 84 శాతం డ్రైవర్లు తాము ట్రాఫిక్‌, హైవే పోలీసుల చేతులు తడిపినట్లు అంగీకరించారు. దిల్లీ- దేశరాజధాని ప్రాంత ట్రక్కర్లలో 78 శాతం తమ డ్రైవింగ్‌ లైసెన్స్‌ పునరుద్ధరణకు మామూళ్లు ఇచ్చినట్లు ఒప్పుకొన్నారు. మిగతా ప్రాంతాలతో పోలిస్తే లైసెన్స్‌ రెన్యువల్‌కు దిల్లీలో ముక్కుపిండి వసూలు చేస్తున్న సగటు లంచం రూ.2,025 దేశంలోనే అత్యధికమట!

రెండింతలకు పైబడిన లంచం...

దేశంలో జీఎస్‌టీ (వస్తుసేవల సుంకం) శకానికి ముందు చెక్‌పోస్టులు ఎడాపెడా లంచాలు వసూలుచేసే కేంద్రాలుగా పరువు మాయడం బహిరంగ రహస్యం. అవినీతి వాటావరణాన్ని తుడిచిపెట్టేదన్న ప్రచార సంరంభం నడుమ జీఎస్‌టీ వచ్చాక- సేల్స్‌టాక్స్‌ చెక్‌పోస్టులకు నూకలు చెల్లిపోయాయి. ఆర్టీఓ చెక్‌పోస్టులు భద్రంగానే ఉన్నాయి. ఇదివరకటికన్నా అంతర్రాష్ట్ర సరఫరాకు వ్యవధి గణనీయంగా తగ్గిన మాట వాస్తవం. లంచాలమోత మాత్రం రెండింతలకు పైబడిందని సరికొత్త అధ్యయనం స్పష్టీకరిస్తోంది. సగటున ఏదైనా ట్రక్కు ఒకసారి సరకు రవాణా చేసి వచ్చేలోగా చచ్చినట్లు ఇచ్చుకోవాల్సిన కనీస మొత్తం రూ.1,257 అన్నది సరికొత్త అంచనా. ఇటువంటి చిన్న మొత్తాలెన్నో కలిసి దేశవ్యాప్తంగా వార్షిక జీఎస్‌టీ రాబడిలో ఇంచుమించుగా సగం వరకు లెక్కతేలుతున్నదంటే- రహదారులపై దోపిడి తీవ్రత ఎంతటిదో వేరే చెప్పాలా?

రాష్ట్రాలవారీగానూ రికార్డులు...

ఈ లంచాలు, ముడుపుల ప్రకోపం రోడ్లకే పరిమితం కాలేదు. రాష్ట్రాలవారీగానూ రికార్డులు బద్దలవుతున్నాయి. మూడు నెలల క్రితం వెలుగుచూసిన ‘ఇండియా కరప్షన్‌ సర్వే- 2019’ అవినీతి పద్దులో రాజస్థాన్‌కు ప్రథమస్థానం కట్టబెట్టింది. బిహార్‌, యూపీ, ఝార్ఖండ్‌, తెలంగాణ, కర్ణాటక దాన్ని వెన్నంటి నిలిచాయి. ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ పదమూడో స్థానం దక్కించుకుంది. వివిధ రాష్ట్రాల్లో రెవిన్యూ, పురపాలక, హోం, వైద్యం, ఇంధనం, పంచాయతీరాజ్‌ తదితర శాఖలు అవినీతి మడుగులో ఈదులాడుతున్నాయి. దశాబ్దం క్రితం తెలుగు గడ్డ మీద మూడోవంతు నిరుపేదలు- ఆస్పత్రి, పాఠశాల విద్య, పౌరసరఫరాలు, రిజిస్ట్రేషన్లు వంటి సేవలు పొందడానికి సంవత్సర కాలంలో రూ.900 కోట్లు ముడుపులుగా ముట్టజెప్పాల్సి వచ్చినట్లు అధ్యయనాలు ధ్రువీకరించాయి. అలా చేతులు మారుతున్న సొమ్ము ఏటికేడాది ఇంతలంతలవుతూనే ఉంది.

ఇప్పటికీ విభాగాలవారీగా పెచ్చరిల్లుతున్న అవినీతి జాడ్యాన్ని ఎప్పటికప్పుడు అనిశా (ఏసీబీ) నివేదికలు ఎండగడుతూనే ఉన్నాయి. అసలు వెలుగులోకి రాకుండానే ఎన్నో ప్రహసనాలు చీకటి పొరల మాటునే ఉండిపోతుండగా- లంచాలు మేసి అడ్డంగా దొరికిపోయినవాళ్లలో కొందరు అంతలోనే పదోన్నతులు, ప్రాధాన్య పోస్టులు పొంది రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ వసూళ్ల దందాలకు తెగబడే దౌర్భాగ్య దృశ్యాలు చూస్తున్నాం. లంచాలు ఇచ్చుకోలేక రైలు కిందపడిన అభాగ్యుల విషాదాంతాలు, మామూళ్లు చేతిలో పడేదాకా దస్త్రాల్ని బిగపట్టి అర్జీదారులను వేధిస్తున్న పరాన్నజీవుల దుర్మార్గాలకు కొదవన్నదే లేని దేశం మనది!

అవినీతి సూచీలో భారత్‌ ఎనభయ్యో స్థానం...

లోగడ ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ వంటి సంస్థలు- ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో పోలీసుల లంచాల మేత అత్యధికమని నిర్ధారించాయి. అవినీతిలో వియత్నాం, థాయ్‌లాండ్‌, కంబోడియా లాంటి దేశాలను ఇండియా తలదన్నుతున్నదనీ అవి విపులీకరించాయి. ఇప్పటికీ 180 దేశాల అవినీతి సూచీలో భారత్‌ ఎనభయ్యో స్థానాన విలపించడానికి- సర్కారీ విభాగాలు, శాఖలు మొదలు రహదారి సిబ్బంది వరకు తినమరిగినవాళ్లెందరో శాయశక్తులా పుణ్యం కట్టుకుంటున్నారు!

అవినీతికి వ్యతిరేకంగా మరో స్వాతంత్య్ర పోరాటం

జాతి మూలగను నమిలేస్తూ దేశానికి తీరని అప్రతిష్ఠ వాటిల్లజేస్తున్న ఈ లంచావతారుల ఉరవడికి విరుగుడేమిటి? రాష్ట్రపతిగా కేఆర్‌ నారాయణన్‌ లోగడ పిలుపిచ్చినట్లు, అవినీతికి వ్యతిరేకంగా ఇంకో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందిప్పుడు. కంప్యూటరీకరణ జరిగిన కార్యాలయాల్లోనూ, సీసీటీవీ వ్యవస్థ ఉన్నచోట్లా లంచాల మేత సాగుతుండటం; వాటాల దగ్గర తేడాలు వచ్చో, కాలం కలిసిరాకో పట్టుబడినవాళ్ల వద్ద వందల కోట్ల రూపాయల సంపద బయటపడుతుండటం నిర్ఘాంతపరుస్తున్నాయి. ఏ సర్కారీ ఉద్యోగి అయినా కొలువులో చేరేటప్పటికి ఆస్తిపాస్తులేమిటి, పోనుపోను అవెలా పెరిగిందీ కచ్చితంగా మదింపు వేసి- మేతాగణం భరతం పట్టే పకడ్బందీ యంత్రాంగం లేనంతవరకు, ఎవరికీ బెదురుండదు. గాడి తప్పి గడ్డి కరిస్తే పుట్టగతులుండవన్న స్పృహ ఉద్యోగివర్గంలో నెలకొనేలా- అనుచిత రాజకీయ జోక్యానికి దారులు మూసేస్తూ వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టనంతవరకు అక్రమ వసూళ్లూ ఆగవు. ఏమంటారు?

-బాలు

Last Updated :Mar 3, 2020, 12:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.