ETV Bharat / bharat

రాహుల్​ 2.0: కాంగ్రెస్​లో మళ్లీ యువనేత జోరు!

author img

By

Published : Nov 30, 2020, 3:36 PM IST

rahul-gandhi-leading-from-front-meeting-leaders-of-poll-bound-states
కాంగ్రెస్​లో మళ్లీ రాహుల్ జోరు!

కాంగ్రెస్​కు నూతనోత్తేజం నింపే దిశగా రాహుల్ గాంధీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు చెందిన నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు రాహుల్. పార్టీ అనుబంధంగా ఉన్న యువజన, విద్యార్థి సంఘాలతో భేటీ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపైనా వరుస విమర్శలు చేస్తున్నారు.

కాంగ్రెస్ రాజకీయాల్లో రాహుల్ గాంధీ మళ్లీ కీలకంగా మారారు. ఇటీవల పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై దృష్టిసారించారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల్లో ముందుంటున్నారు.

బంగాల్ కాంగ్రెస్ నేతలతో ఇదివరకే వర్చువల్​గా భేటీ అయిన రాహుల్.. తమిళనాడు, అసోం నేతలతో సోమవారం సమావేశాలు ఏర్పాటు చేశారు. బంగాల్ సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులతో సమావేశంలో.. వారి నుంచి సలహాలు, సూచనలు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సన్నద్ధతపై ఆరా తీశారు. కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

పార్టీలో కీలక వ్యూహకర్త అహ్మద్ పటేల్ మరణించిన నేపథ్యంలో రాహుల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సొంతంగా ఎలాంటి వ్యూహరచన చేస్తారా అని పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. బంగాల్​లో పొత్తు అంశంపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకోవాలని ఆ రాష్ట్ర వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో వీటిపై ఎలా ముందుకెళ్తారనే అంశంపై అందరి దృష్టి పడింది.

అదే సమయంలో భారత జాతీయ విద్యార్థి సమాఖ్య(ఎన్​ఎస్​యూఐ), భారత యువజన కాంగ్రెస్ నేతలతో కీలక చర్చలు జరుపుతున్నారు రాహుల్. ఈ రెండు సంస్థలు నిర్వహించిన ఆఫీస్ బేరర్ల సమావేశాలకు కూడా హాజరయ్యారు. మరోవైపు, కొద్ది నెలలుగా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రైతుల నిరసనలు, వ్యవసాయ చట్టాలు, ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిరుద్యోగం, కరోనా నియంత్రణ విషయాలపై ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు.

ఉత్తేజం నింపుతారా?

కాంగ్రెస్​కు పూర్తి స్థాయి అధ్యక్షుడు కావాలంటూ పార్టీలోని 23 మంది కీలక నేతలు సోనియా గాంధీకి లేఖ రాశారు. పార్టీ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే పార్టీలోని చాలా మంది రాహుల్ గాంధీ​నే తర్వాతి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని కోరుతున్నారు. అయితే ఆయన మాత్రం దీనిపై మౌనం వహిస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ కార్యకలాపాల్లో మునుపటి జోరు కనబర్చడం వల్ల కాంగ్రెస్​కు నూతనోత్తేజం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.