ETV Bharat / bharat

ఐరాసలో నేడు మోదీ కీలక ప్రసంగం

author img

By

Published : Sep 26, 2020, 5:20 AM IST

modi in UNGA
ఐరాస​ సమావేశాల్లో మోదీ కీలక ప్రసంగం నేడే...

ఐక్యరాజ్య సమితి 75వ సాధారణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కీలక ప్రసంగం చేయనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. వివిధ అంశాలపై భారత్‌ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేయనున్నారు. కరోనా, ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై మోదీ మాట్లాడే అవకాశం ఉంది.

ఐక్యరాజ్యసమితి 75వ సాధారణ సభ సమావేశాల్లో(యూఎన్​జీఏ) భాగంగా నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని మాట్లాడే అంశాలపై అందరి దృష్టి నెలకొంది. తొలి ప్రసంగం మోదీనే చేయనున్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది వర్చువల్​గానే కార్యక్రమం జరుగుతోంది. 'మనం కోరుకునే భవిష్యత్తు, ఐక్యరాజ్యసమితి ఆవశ్యకత, కరోనాపై పోరులో సమష్టి కృషి' అనేది ఈ ఏడాది యూఎన్​జీఏ ఇతివృత్తం.

ఉగ్రవాదంపై అన్నిదేశాలు కలిసికట్టుగా మరింత పోరాడాలని మోదీ పిలుపునివ్వనున్నారు. ఉగ్రవాద నియంత్రణ కమిటీలు, సంస్థలలో మరింత పారదర్శకతను కోరనుంది భారత్​. శాంతి సహకారం పెంపొందించడంలోనూ, శాంతి పరిరక్షణ కోసం భారత్ చేస్తోన్న కృషిని ప్రపంచ వేదికపై ఉద్ఘాటించనున్నారు ప్రధాని. సుస్థిరాభివృద్ధి, వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలను మోదీ ప్రస్తావించనున్నారు.

కరోనా సాయంపై..

ఆరోగ్య సేవా ప్రదాతగా తన పాత్రను పేర్కొంటూ.. కరోనా సమయంలో 150కి పైగా దేశాలకు సహాయం చేయడాన్ని భారతదేశం హైలైట్ చేయనుంది. మహిళల నాల్గవ ప్రపంచ సదస్సు 25వ వార్షికోత్సవం ఈ ఏడాది జరగనుంది. ఈ నేపథ్యంలో మహిళల నేతృత్వంలో జరిగిన అభివృద్ధి.. ఈ అంశంలో భారత విధివిధానాలు, విజయాలను పునరుద్ఘాటిస్తుంది. భారతదేశం దక్షిణ ప్రాంత అభివృద్ధిలో కీలక భాగస్వామిగా తన పాత్ర గురించి చెప్పనుంది. ముఖ్యంగా భారతదేశం-యూఎన్ అభివృద్ధి భాగస్వామ్య నిధి గురించి మాట్లాడనున్నారు ప్రధాని మోదీ.

ఐకరాజ్యసమితిలోని భద్రతా మండలిలో ప్రస్తుతం తాత్కాలిక సభ్య దేశంగా ఉంది భారత్​. ఈ ఏడాది జనవరి నుంచి రెండేళ్ల పాటు ఈ పదవిలో ఉండనుంది.

ఇదీ చూడండి: ఐరాసలో పాక్​ 'కశ్మీర్​' ప్రస్తావనపై భారత్​ ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.