ETV Bharat / bharat

'సస్పెన్షన్'​పై భగ్గుమన్న విపక్షాలు.. ప్రభుత్వంపై ధ్వజం

author img

By

Published : Sep 21, 2020, 6:40 PM IST

వ్యవసాయ రంగంలో సంస్కరణలు ఉద్దేశించి కేంద్రం తీసుకొచ్చిన రెండు బిల్లులపై విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ రసాభాసాగా మారింది. ఆదివారం బిల్లుల ఆమోదం సమయంలో గందరగోళం సృష్టించిన 8 మందిపై సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్​ వేటు వేయటంతో పరిస్థితులు మరింత వేడెక్కాయి. విపక్షాల ఆందోళనలతో సభ మంగళవారానికి వాయిదా పడింది. అనంతరం పార్లమెంట్​ ఆవరణలో నిరసనకు దిగాయి ఎన్డీఏ యేతర పక్షాలు.

Opposition parties
'సస్పెన్షన్'​పై భగ్గుమన్న విపక్షాలు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రాజ్యసభ అట్టుడుకుతోంది. వ్యవసాయ రంగంలో సంస్కరణను ఉద్దేశించిన ఈ బిల్లులను పార్లమెంటు ఉభయసభలు ఆమోదించటంపై విపక్షాలు భగ్గుమన్నాయి. రాజ్యసభలో ఆదివారం ఆందోళనకు దిగగా.. అదే తంతును సోమవారం కొనసాగించాయి. సభ ప్రారంభమైన తర్వాత డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​ సింగ్​పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారు ఛైర్మన్​ వెంకయ్య. అది సరైన విధానంలో లేదని.. 14 రోజుల నోటీస్​ పీరియడ్​ ఇవ్వలేమని స్పష్టం చేశారు.

8 మంది ఎంపీలపై వేటు..

బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో గందరగోళం సృష్టించిన టీఎంసీ నేత డెరెక్​ ఓబ్రియన్​, ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్​ సహా ఎనిమిది మందిపై సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్​​ వేటు వేశారు. 8 మందిపై సస్పెన్షన్​ తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టగా.. మూజువాణి ఓటుతో ఆమోదించారు. అయితే.. సస్పెండ్​కు గురైన సభ్యులు సభ నుంచి వెళ్లేందుకు నిరాకరించటం వల్ల సభ పలు మార్లు వాయిదా పడింది.

అనంతరం విపక్షాల ఆందోళన మధ్యే సభ కొనసాగించే ప్రయత్నం చేశారు ఛైర్మన్​. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం సహా ఇతర అంశాలపై చర్చకు ఆహ్వానించారు. కానీ, ఇతర సభ్యులతో కలిసి సస్పెండ్​ అయిన వారు ఆందోళన చేపట్టారు. దాంతో పలు మార్లు సభ వాయిదా పడింది. సభను రోజు మొత్తం వాయిదా వేయాలని నినదించారు. ఇక చేసేదేమీ లేక సభను మంగళవారం ఉదయం 9 గంటల వరకు వాయిదా వేశారు ఛైర్మన్.

పార్లమెంట్​ ఆవరణలో విపక్షాల ఆందోళన..

ఎనిమిది మంది రాజ్యసభ ఎంపీలను సస్పెండ్​ చేయటంపై పార్లమెంట్​ ఆవరణలో కాంగ్రెస్​, సీపీఎం, శివసేన, జేడీఎస్​, టీఎంసీ, సీపీఐ, సమాజ్​వాదీ పార్టీలు ఆందోళన చేపట్టాయి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటం, పార్లమెంటు మరణం, సిగ్గుచేటు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు విపక్ష ఎంపీలు.

ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్​ చేయటం అప్రజాస్వామికమని, ఏకపక్షమని పేర్కొంది కాంగ్రెస్​. సభ్యుల గొంతుకను అణచివేయటం, ఆ తర్వాత సస్పెండ్​ చేయటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాలరాసిందన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ.

రైతుల కోసం పోరాడుతున్న ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్​ చేయటం దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్య నిబంధనలు, సూత్రాలను గౌరవించని నిరంకుశ ప్రభుత్వ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రభుత్వం ముందు తలవంచం. పార్లమెంట్​తో పాటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై పోరాడతాం.

- మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి

ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను రైతులు వ్యతిరేకించాలని కోరారు సస్పెన్షన్​కు గురైన ఆప్​ ఎంపీ సంజయ్​ సింగ్​. అదానీ-అంబానీలకు రైతుల జీవితాలను భాజపా ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఆరోపించారు. తాము పార్లమెంట్​లో ఆందోళన చేపడతామని, అందరూ బయట ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. బిల్లులను వ్యతిరేకించినందుకే తమను సస్పెండ్​ చేశారని పేర్కొన్నారు.

రాష్ట్రపతికి విపక్షాల లేఖ...

పార్లమెంట్​లో ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​కు లేఖ రాశాయి ఎన్డీయేతర పార్టీలు. ప్రతిపాదిత బిల్లులను ఆమోదించొద్దని కోరాయి. ఈ అశంలో కలుగుజేసుకోవాలని మెమోరండం అందించాయి.

మరోవైపు.. శిరోమణి అకాలీదళ్​ నాయకత్వం రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ను కలవనున్నారు. వ్యవసాయ బిల్లులపై సంతకం చేయొద్దని కోరనున్నట్లు సమాచారం.

21వ శతాబ్దానికి అవసరం: మోదీ

పార్లమెంట్​ ఆమోదం పొందిన రెండు వ్యవసాయ బిల్లులు దేశంలో 21వ శతాబ్దానికి అవసరమని నొక్కి చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కనీస మద్దతు ధరకు ప్రభుత్వం రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయటం కొనసాగుతుందని భరోసా కల్పించారు. రైతులు తమకు నచ్చిన ప్రాంతంలో నచ్చిన ధరకు అమ్ముకునే వీలు కలిగిందని ఉద్ఘాటించారు. విపక్షాలపై విమర్శలు గుప్పించారు మోదీ. పంట ఉత్పత్తుల అమ్మకాల నిబంధనల సంకెళ్లలో ఉన్నంత కాలం రైతులు దోపిడీకి గురయ్యారని, తమ ప్రభుత్వం దానిని తొలిగించిందన్నారు మోదీ. కొంత మంది ధరల నియంత్రణపై పట్టు కోల్పుతున్న క్రమంలోనే రైతులను తప్పుదోవపట్టిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి: ఎంపీల వేటుపై అట్టుడికిన పెద్దల సభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.