ETV Bharat / bharat

రోజువారీ కేసుల్లో ఆ దేశాలను దాటేసిన భారత్​

author img

By

Published : Sep 3, 2020, 6:05 PM IST

దేశంలో ఒకప్పుడు రోజుకు పది కేసులు నమోదైతేనే ప్రజలు బెంబేలెత్తిపోయారు. కానీ ఇప్పుడు ఒక్కరోజులో ఏకంగా రికార్డు స్థాయిలో 80వేలకుపైగా కేసులు బయటపడుతున్నాయి. మొత్తం కేసుల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 3వ స్థానంలో ఉంది భారత్​. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య.. బహ్రెయిన్‌ (52 వేలు), సింగపూర్‌ (56వేలు), పోర్చుగల్‌ (58 వేలు), పోలాండ్‌ (67వేలు), జపాన్‌ (69వేలు) యూఏఈ (70వేలు) దేశాల మొత్తం కేసులను మించిపోవడం గమనార్హం.

India-daily-covid-cases-crossed-these-countries-grand-total
రోజువారీ కేసుల్లో ఆ దేశాలను దాటేసిన భారత్​

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే అత్యధికంగా 83,883 పాజిటివ్‌ కేసులు వెలుగుచూడడం దేశంలో కొవిడ్‌-19 తీవ్రతకు అద్దం పడుతోంది. గతంతో పోలిస్తే వైరస్‌ వ్యాప్తి విస్తృతమవ్వడం.. పరీక్షల సంఖ్య పెరగడం ఇందుకు కారణం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుదల కనిపించకపోవడం లేదు. ఆ సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే రీతిలో పెరిగితే కరోనా మహమ్మారి వెలుగుచూసిన చైనా మొత్తం కేసులను మన రోజువారీ కేసులు దాటేసే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ దేశాల స్థాయిలో..

దేశంలో ప్రస్తుతం అన్‌లాక్‌ ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో గతంలో వందల్లో నమోదైన కేసుల సంఖ్య ఇప్పుడు వేలకు చేరింది. ముఖ్యంగా ఆగస్టు నెలలో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఆగస్టులో ఒకటో తేదీ నాటికి దేశంలో మొత్తం కేసులు 17లక్షలు కాగా.. చివరి నాటికి రెట్టింపు అయ్యింది. ఆగస్టు మొదటి వారం నుంచి రోజూ 50వేల కేసులకు పైబడే రోజువారీ కేసులు నమోదు అవుతున్నాయి. అంటే బహ్రెయిన్‌ (మొత్తం కేసులు 52 వేలు), సింగపూర్‌ (56వేలు), పోర్చుగల్‌ (58 వేలు), పోలాండ్‌ (67వేలు), జపాన్‌ (69వేలు) యూఏఈ (70వేలు) దేశాల మొత్తం కేసులను ఇప్పటికే మనం దాటేశాం. ప్రస్తుతం స్వీడన్‌ (84వేలు), బెల్జియం (85వేలు) మొత్తం కేసులకు చేరువలో ఉన్నాం. డబ్ల్యూహెచ్​ఓ గణాంకాలు వీటిని స్పష్టం చేస్తున్నాయి.

త్వరలో చైనాను..?

చైనాలో కేసుల పెరుగుదల తీరు ఇలా..


కరోనా వైరస్‌ వెలుగుచూసిన చైనాలో ప్రస్తుతం మొత్తం కేసులు సంఖ్య 90,422గా ఉంది. కొత్తగా ఆ దేశంలో ఇప్పటికీ రోజూ 10 నుంచి 20 కేసులు వెలుగుచూస్తున్నాయి. మన దేశంలో లాక్‌డౌన్‌ మొదలైనప్పటికి చైనా అన్‌లాక్ ప్రక్రియ చేపట్టింది. అప్పటికే దాదాపు కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మన దేశంలో లాక్‌డౌన్‌ చేపట్టినప్పుడు కాకుండా.. అన్‌లాక్‌ మొదలైన తర్వాత కేసుల పెరుగుదల మొదలైంది. ఈ సమయంలో వైద్యపరంగా మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి ఈ సమయం ఉపయోగపడింది.

భారత్‌లో కేసుల పెరుగుదల తీరు


ఊరటనిచ్చే అంశాలివీ..

మన దేశంలో కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ కొన్ని ఊరట నిచ్చే అంశాలు ఉన్నాయి. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాల రేటు (1.7శాతం) తక్కువగా ఉంది. మన కంటే కేసుల పరంగా కేవలం లక్ష తేడాలో ఉన్న బ్రెజిల్‌లో మరణాల సంఖ్య 1.21 లక్షలు కాగా.. దాదాపు 60 లక్షల కేసులున్న అమెరికాలో 1.82 లక్షల మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. భారత్‌ మరణాల సంఖ్య 67వేలతో పోలిస్తే బ్రెజిల్‌లో రెండు రెట్లు, అమెరికాలో మూడు రెట్ల అధికంగా మరణాలు సంభవించాయి. అలాగే, దేశంలో కోలుకున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. ఇప్పటికే 29.70 లక్షల మందికి పైగా కోలుకోగా.. మరో 8లక్షలకు పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. పరీక్షలు కూడా 10 లక్షలకు పైగానే జరుగుతున్నాయి. దేశంలో రోగ లక్షణాలు లేని వారే అధికంగా ఉంటున్నారు. అలాంటి వారు వైరస్‌ వ్యాప్తి కారకులు కాకుండా చూసేందుకు ఈ పరీక్షల సంఖ్య ఉపయోగపడుతుంది.

భారత్​లోనే తక్కువ...

ప్రపంచ దేశాల్లో (ప్రతి పదిలక్షల జనాభాకు) భారత్​లోనే తక్కువ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రతి పది లక్షల జనాభాకు 49మరణాలు నమోదవుతున్నాయని, ఇది కూడా ప్రపంచంలోనే అత్యల్పమని పేర్కొంది. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ఈ విషయాన్ని భారత జనాభా కోణంగాలో చూడాలని స్పష్టం చేసింది. దశలవారీగా ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తున్న ప్రభుత్వం.. వైద్య సదుపాయాలపైనా తగిన జాగ్రత్తలు తీసుకుందని పేర్కొంది.

దేశవ్యాప్తంగా 70జిల్లాల్లో రెండో దశ సెరొలాజికల్​ సర్వే జరుగుతోందని.. దీనికి సంబధించిన ఫలితాలు రెండు వారాల్లో వచ్చే అవకాశముందని ఆరోగ్యశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:- కంటికి నిద్ర తగ్గితే.. ఒంట్లో నీరూ తగ్గుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.