ETV Bharat / bharat

ఇక దమ్ము కొట్టాలంటే ఈ వయస్సు దాటాల్సిందే!

author img

By

Published : Feb 23, 2020, 6:32 PM IST

Updated : Mar 2, 2020, 7:54 AM IST

పొగ తాగే వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ముఖ్యంగా పాఠశాల, కళాశాల వయస్సులోనే ఈ మహమ్మారికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత. ఈనేపథ్యంలో పొగాకు వినియోగాన్ని కట్టడి చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది కేంద్రం. పొగ తాగేందుకు కనీస వయస్సును పెంచడంపై కసరత్తు చేస్తోంది.

Health Ministry mulling to increase legal age for tobacco consumption
ఇక దమ్ముకొట్టాలంటే ఈ వయస్సు దాటాల్సిందే

ధూమపానం.. సరదా కోసం అలవాటు చేసుకున్నప్పటికీ ఓ వ్యసనంగా మారి జీవితాన్ని చిన్నాభిన్నం చేసే మహమ్మారి. ఎక్కువ శాతం మంది యువతే దీని బారిన పడుతున్నారు. పొగ తాగటం ఓ ఫ్యాషన్​గా భావించి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్యాన్సర్​ వంటి జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు.

ధూమపానాన్ని కట్టడి చేసేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా మరో అడుగు వేసేందుకు కసరత్తు ప్రారంభించింది. పొగాకు వినియోగించే వారి కనీస వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని యోచిస్తోంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టంలోని నిబంధనలను ఈమేరకు కఠినతరం చేయాలని భావిస్తోంది.

న్యాయ నిపుణుల బృందం సిఫార్సులు..

పొగాకు నియంత్రణ చట్టాన్ని సవరించడంపై న్యాయ నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేసింది ఆరోగ్యమంత్రిత్వ శాఖ. ఇటీవల సమావేశమైన ఆ బృందం కొన్ని సిఫార్సులను చేసింది.

  • పొగాకు వినియోగం తగ్గించేందుకు ప్రధానంగా ధూమపానం చేసేందుకు వయో పరిమితి మార్చడం అవసరం. ప్రస్తుతం ఉన్న వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని సిఫార్సు.
  • నిబంధనలు ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాలు భారీగా పెంపు.
  • పొగాకు, దాని ఉత్పత్తులను అక్రమంగా అమ్మినవారిని గుర్తించడానికి వీలుగా ట్రాకింగ్​ విధానం తీసుకురావటం.
  • పొగాకు ఉత్పత్తులను చట్టబద్ధంగా గుర్తించేందుకు వీలుగా వాటిపై బార్​కోడ్​ ముద్రించటం. దీంతో పన్నుల వసూలుకూ వీలు కలుగుతుందని అభిప్రాయం.

17.9 ఏళ్లకే పొగాకు వినియోగం..

సగటున 17.9ఏళ్ల వయస్సుకే యువత పొగాకు వినియోగించడం మొదలు పెడుతున్నట్లు గ్లోబల్​ అడల్ట్​ టొబాకో సర్వే(జీఏటీఎస్​2) తేల్చింది. ఇది జీఏటీఎస్​1 సర్వేనాటికి 18.9 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 19శాతం పురుషులు, 2శాతం మహిళలు, 10.7శాతం పెద్దలు ప్రస్తుతం ధూమపానం చేస్తున్నట్లు జీఏ​టీఎస్​2లో నిర్ధరించారు. 26.9శాతం పురుషులు, 12.8శాతం మహిళలు, 21.4 శాతం పెద్దలు ఇతర పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారని నివేదిక తేల్చింది.

యువతే లక్ష్యంగా..

అత్యధికంగా యువతే పొగాకుకు బానిసలుగా మారుతున్నారు. పాఠశాలలు, కళాశాలల్లోని 18 నుంచి 21 ఏళ్లలోపు ఉన్న విద్యార్థులే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చిన్న చిన్న ఒత్తిళ్లకు తలొగ్గి.. తోటివారిని చూసి ఫ్యాషన్​గా భావించడం ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొగాకు పరిశ్రమలు యువతను లక్ష్యంగా చేసుకుంటున్నాయని చెబుతున్నారు.

వయస్సును సడలించినట్లయితే ప్రతిఏడాది అధిక సంఖ్యాకులను పొగాకు బారిన పడకుండా చేయవచ్చని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని ఈ ఉత్పత్తుల కొనుగోలుకు సహకరించవద్దని అధికారులు అంటున్నారు.

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్​: అధ్యక్షుడి పూర్తి షెడ్యూల్​ ఇదే

Last Updated : Mar 2, 2020, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.