ETV Bharat / bharat

నీట్ పరీక్ష: వారి బాధ్యత కేంద్రానిదే

author img

By

Published : Aug 24, 2020, 10:57 PM IST

నీట్ పరీక్ష కోసం విదేశాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను వందేభారత్ విమానాల్లో తీసుకురావాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. వచ్చే ఏడాది నీట్​ను ఆన్​లైన్​లో నిర్వహించాలని సూచించింది. అయితే విపక్ష నేతలు మాత్రం పరీక్షను వాయిదా వేయాలనే కోరుతున్నారు.

Fly Overseas NEET Candidates In Vande Bharat Flights: Top Court To Centre
నీట్ పరీక్ష: వారి బాధ్యత కేంద్రానిదే

వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం జాతీయ అర్హత పరీక్ష (నీట్)ను దేశవ్యాప్తంగా సెప్టెంబరు 13న నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రాసేందుకు విదేశాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను వందే భారత్ విమానాల్లో తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలానే వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించడంపై దృష్టి సారించాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)కు సూచించింది. "జేఈఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నప్పుడు వచ్చే ఏడాది నుంచి నీట్ ఆన్‌లైన్‌ నిర్వహణ అంశాన్ని ఎంసీఐ పరిగణలోకి తీసుకోవాలి" అని కోర్టు వ్యాఖ్యానించింది.

పిటిషన్ విచారణ

కొద్ది రోజుల క్రితం నీట్ పరీక్ష వాయిదా వేయడం లేదా జేఈఈ పరీక్ష తరహాలో విదేశాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని విదేశాల నుంచి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, వారిని వందే భారత్ విమానాల ద్వారా భారత్‌కు తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించింది. అలానే విద్యార్థులు పరీక్ష రాసేందుకు అనుమతించడంపై సంబంధిత మంత్రిత్వ శాఖలతో మాట్లాడాలని కేంద్రం తరపున వాదనల వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. క్వారంటైన్‌ నిబంధనలు అమలులో ఉన్నందున వారు పరీక్ష రాసేందుకు వస్తున్నారని నిర్ధరిస్తే అనుమతి లభిస్తుందని మెహతా కోర్టుకు విన్నవించారు. అయితే క్వారంటైన్‌ నిబంధనల నుంచి సడలింపు ఇస్తూ తాము ఆదేశాలు ఇవ్వలేమని, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు సూచించింది.

అతి పెద్ద తప్పిదం: సుబ్రమణియన్ స్వామి

కరోనా నేపథ్యంలో నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి మరోసారి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ ప్రభుత్వం నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించడం అతి పెద్ద తప్పిదమని అన్నారు. 1976లో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం చేపట్టిన నాస్‌బందీ (నిర్భంద కుటుంబ నియంత్రణ)తో ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణను పోల్చారు. దాని వల్లే 1977 ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారతీయ ఓటర్లు నిశ్శబ్దంగా బాధను అనుభవించినప్పటికీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని సుబ్రమణియన్‌ స్వామితో పాటు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.