ETV Bharat / bharat

'భాజపాలోకి ఐదుగురు టీఎంసీ ఎంపీలు!'

author img

By

Published : Nov 21, 2020, 10:47 PM IST

తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు త్వరలో భాజపాలో చేరబోతున్నారని బంగాల్‌ భాజపా ఎంపీ అర్జున్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర 24పరగణాల జిల్లాలో శనివారం ఓ పూజా కార్యక్రమానికి హాజరైన అనంతరం అర్జున్‌ సింగ్‌ మీడియతో మాట్లాడారు.

five-tmc-mps-in-west-bengal-will-join-bjp-mp-arjun-singh-said
'భాజపాలోకి ఐదుగురు టీఎంసీ ఎంపీలు!'

బంగాల్‌ భాజపా ఎంపీ అర్జున్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీలు సౌగతారాయ్‌ సహా మరో నలుగురు ఎంపీలు భాజపాలో చేరబోతున్నట్లు వెల్లడించారు. ఉత్తర 24పరగణాల జిల్లాలో శనివారం ఓ పూజా కార్యక్రమానికి హాజరైన అనంతరం అర్జున్‌ సింగ్‌ మీడియతో ఈ వ్యాఖ్యలు చేశారు.

'నేను మరోసారి ఒక విషయాన్ని గుర్తుచేస్తున్నాను. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ఐదు మంది ఎంపీలు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏ సమయంలోనైనా వారు భాజపాలో చేరే అవకాశం ఉంది' అని అర్జున్‌ పేర్కొన్నారు. ఆ ఐదు మంది ఎంపీల్లో సౌగతారాయ్‌ పేరు ఉందా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. అర్జున్‌ స్పందించారు.

‘'సౌగతారాయ్‌ కెమెరా ముందు సీఎం మమతా బెనర్జీకి మధ్యవర్తిగా కనిపిస్తాడు. కానీ ప్రస్తుతం టీఎంసీపై ఉద్యమం చేస్తున్న అదే పార్టీ నాయకుడు, బంగాల్‌ రవాణా మంత్రి సువెందు అధికారితో ఆయన సంప్రదింపులు చేస్తున్నాడు. కాబట్టి సౌగతారాయ్‌ పేరు ఆ జాబితాలో చేర్చుకోవచ్చు'’ అని తెలిపారు.

'సువెందును అవమానించారు'

సువెందు అధికారి టీఎంసీకి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం గురించి ప్రశ్నించగా ‘సువెందు పేద ప్రజల నాయకుడు. ఆయన పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కానీ ప్రస్తుతం మమతా సువెందును పక్కన పెడుతున్నారు. ఆమె తన అల్లుడు అభిషేక్‌ బెనర్జీకి పదవులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏ నాయకుడు కూడా ఇలాంటి చర్యలను ఉపేక్షించరు. అంతేకాకుండా సువెందును అవమానించారు. ఆయన ముఖ్యమైన అనుచరులపైనా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అలాంటి ప్రజానాయకుడికి భాజపా ఎల్లప్పుడూ ఆహ్వానం పలుకుతుంది’ అన్నారు. అదేవిధంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ‘బెంగాల్‌లో భాజపా అధికారంలోకి వస్తుంది. సుబెందు భాజపాలో చేరితే ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయం’ అని ఆయన వెల్లడించారు.

'అతను థర్డ్​ క్లాస్​ పొలిటీషియన్'

తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు త్వరలో భాజపాలో చేరబోతున్నారని అర్జున్​సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు తృణమూల్​ ఎంపీ సౌగతారాయ్‌.

"భాజపా ప్రచారంలో భాగంగా వాళ్లు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారు. అర్జున్​సింగ్ ఒక థర్డ్​ క్లాస్​ రాజకీయ నాయకుడు. అతనొక బాహుబలి."

--సౌగతారాయ్​, తృణమూల్ ఎంపీ.

తాను ఎన్నటికీ భాజపాలో చేరనని సౌగతారాయ్ తేల్చి చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.