ETV Bharat / bharat

కరోనా సోకిన వారితో సంబంధం లేకపోయినా పాజిటివ్​ కేసులు

author img

By

Published : Apr 11, 2020, 7:38 AM IST

coronavirus update india: Can India win the fight against
కరోనా సోకిన వారితో సంబంధం లేకపోయినా పాజిటివ్​ కేసులు

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకూ వైరస్​ బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమింటంటే ఎటువంటి విదేశీ ప్రయాణాలు చేయకపోయనా, వైరస్ సోకిన వారిని కలవకపోయినా మహమ్మారి బారిన పడుతుండటం అందరినీ కలవరపెడుతోంది. ఈ తరహా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతయినా ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) చెబుతోంది.

ఎలాంటి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు చేయకపోయినా, కరోనా బాధితులతో సంబంధం లేకపోయినా.. మహమ్మారి బారినపడుతున్న కేసులు వెలుగుచూస్తుండడం దేశంలో తీవ్ర ఆందోళన సృష్టిస్తోంది. అకస్మాత్తుగా తీవ్ర శ్వాస సంబంధ అనారోగ్యాని(సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ ఇల్‌నెస్‌- ‘సారీ’)కి గురవుతున్న వారిలో పలువురు కరోనా బారినపడుతున్నారు. ఇలాంటి 100 మందిలో కనీసం 39 శాతం మందికి ఎలాంటి ప్రయాణ నేపథ్యంకానీ, వైరస్‌ బాధితుల్ని కలిసిన సందర్భం కానీ లేదు. ఈ తరహా కేసులు ఎక్కువగా ఉన్న 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో వ్యాధి నివారణకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) నొక్కిచెప్పింది.

ఇలా వెల్లడైంది...

ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2 వరకు దేశంలోని 21 రాష్ట్రాల్లోని 52 జిల్లాల్లో అకస్మాత్తుగా ‘సారీ’కి గురైన 5,911 మంది రోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 104 (1.8%) మంది కరోనా బారినపడినట్లు వెల్లడైంది. బాధితుల్లో 40 మంది (39.2%)కి ఎలాంటి దేశ, విదేశ ప్రయాణం, కరోనా బాధితుల్ని కలిసిన నేపథ్యం లేదు. ఇద్దరు(2%) తమకు కరోనా పాజిటివ్‌ ఉన్న కేసులతో సంబంధం ఉన్నట్లు తెలిపారు. ఒకరు(1%) ఇటీవల విదేశీయానం చేసినట్లు చెప్పారు. 59(57.8%) మందికి అది ఎలా సోకిందన్న సమాచారం(ఎక్స్‌పోజర్‌ హిస్టరీ) లేదు. ఐసీఎంఆర్‌ రూపొందించిన ఈ పరిశోధన పత్రం.. భారతీయ వైద్య పరిశోధన జర్నల్‌లో తాజాగా ప్రచురితమైంది.

  • సారీ రోగుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య మార్చి 14కి ముందు 0% ఉండగా, ఏప్రిల్‌ 2 నాటికి అది 2.6%కి చేరింది.
  • ఆంధ్రప్రదేశ్‌లో 2 జిల్లాల్లో 129 మందికి, తెలంగాణలో 2 జిల్లాల్లో 190 మందికి ఈ పరీక్షలు నిర్వహించగా.. ఏపీలో నలుగురు (3.1%), తెలంగాణలో 8 మంది(4.2%)లో కరోనా నిర్ధారణ అయింది. పరీక్షించిన వారిలో అత్యధిక నిష్పత్తిలో పాజిటివ్‌గా తేలినవారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఐసీఎంఆర్‌ అధిక జాగ్రత్తలు సూచించిన 36 జిల్లాల్లో ఏపీ, తెలంగాణ జిల్లాలు ఉన్నాయా? లేవా? అనేది వెల్లడి కాలేదు.
  • ఈ పరీక్షలు అత్యధికంగా గుజరాత్‌ రాష్ట్రంలో 792 మందికి, తమిళనాడులో 577 మందికి, మహారాష్ట్రలో 553 మందికి నిర్వహించారు. తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో అత్యధికంగా 3.8% మంది ‘సారీ’ బాధితుల్లో కరోనా నిర్ధారణ అయింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.