ETV Bharat / bharat

'దేశదేశాలు తిరిగి సేవచేస్తుంటే అవమానిస్తారా?'

author img

By

Published : Mar 24, 2020, 3:29 PM IST

ఇరుగుపొరుగువారి నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు విమాన సిబ్బంది. కరోనా సోకిందని పుకార్లు సృష్టిస్తూ.. తమ కుటుంబసభ్యులను అంటరానివారిలా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఓ ఉద్యోగి. ఈ వేధింపులపై స్పందించిన పౌర విమానయాన మంత్రి హర్దీప్​ సింగ్ పూరి వారికి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Coronavirus: Puri seeks protection for airline staffers being harassed by neighbours
'దేశాలు తిరిగి సేవలందిస్తున్నందుకు అవమానిస్తారా?'

వైరస్​ వ్యాపిస్తుందని వైద్యులు ఇంట్లో కూర్చుంటే.. కరోనా రోగుల గతేంటి? విమాన సిబ్బంది సాహసం చేయకపోతే ఇతర దేశాల్లో చిక్కుకున్న భారతీయులు స్వదేశాలకు వచ్చే దారేది? అందుకే వైరస్​ వ్యాప్తికి సామాన్యులు బలికాకూడదని ముఖాలపై మాస్కుల అచ్చులు పడుతున్నా సేవారంగాల సిబ్బంది మాత్రం నిస్వార్థంగా తమ విధులను నిర్వర్తిస్తునే ఉన్నారు. కానీ, అలాంటివారికే కరోనా​ సోకిందని పుకార్లు సృష్టిస్తున్నారు కొంతమంది. వారి కుటుంబాలను అంటరానివారిలా చూస్తూ అవమానిస్తున్నారు.

వివిధ దేశాలు తిరిగి సేవలందిస్తోన్న విమానయాన సిబ్బందికి సొంత ఊర్లో అవమానాలు ఎదురవుతున్నాయి. కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా సోకిందని అనుమానాలు చుట్టుముడుతున్నాయి.

ఇరుగుపొరుగువారి సూటిపోటి మాటలకు మనస్తాపానికి గురైన ఓ ఉద్యోగి.. వీడియో ద్వారా తన బాధను వ్యక్తపరిచారు. పుకార్లు సృష్టించకుండా, కరోనా పట్ల అవగాహన పెంచుకోండి.. అంటూ ప్రజలను కోరారు.

'దేశదేశాలు తిరిగి సేవచేస్తుంటే అవమానిస్తారా?'

"మా కాలనీలో నాకు కరోనా సోకిందని పుకార్లు రేపుతున్నారు. నేను ఇంట్లో లేనప్పుడు ఇరుగుపొరుగువారొచ్చి మా అమ్మను వేధిస్తున్నారు. ఆమె కనీసం మార్కెట్​కు వెళ్లి సరుకులు తెచ్చుకోలేకపోతోంది. ఎందుకంటే, 'నీ కూతురికి కరోనా ఉంది, నీకు కూడా ఉండొచ్చు' అని జనాలు ఆమెను వెలివేసినట్టు మాట్లాడుతున్నారు. ఈ సేవా విభాగంలో పనిచేస్తున్నందుకు నా సహోద్యోగులు కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. కనుక, చదువుకున్న మూర్ఖులందరికీ నేను చెప్పేది ఒకటే.. విధులు నిర్వహించేటప్పుడు మమ్మల్ని జాగ్రత్తగా తనిఖీ చేస్తారు. మేము మీకంటే ఎంతో సురక్షితంగా ఉంటాం."

- విమానయాన సంస్థ ఉద్యోగి

ఇండిగో, ఎయిర్​ ఇండియా సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు వేధింపులకు గురికావడంపై స్పందించారు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్​ పూరి. విమాన సిబ్బందికి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి: దేశంలో 500కు చేరువలో కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.