ETV Bharat / bharat

సరిహద్దుల్లో ఉద్రిక్తతల వెనుక చైనా వ్యూహాలివే!

author img

By

Published : Jun 17, 2020, 7:25 AM IST

ధవళ వర్ణంలో మెరిసిపోయే హిమాలయాలకు చైనా నెత్తుటి మరకలు అద్దుతోంది. భారత సరిహద్దులోని కీలకమైన భూభాగాలను ఆక్రమించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ క్రమంలో 45 ఏళ్ల తర్వాత తొలిసారి తూర్పు సరిహద్దులో హింస చెలరేగింది. సరిహద్దు వివాదాన్ని చైనా వ్యూహాత్మకంగానే అమలు చేస్తోందా? హఠాత్తుగా ప్రతిష్టంభనకు దారితీసిన పరిణామాలు ఏంటో చూద్దాం..

China Tactics
భారత్​- చైనా

భారత్​- చైనా యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య ఎన్నడూ లేనంతగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాదేశిక సమగ్రతపై భారత్​ గట్టిగా నిలబడిన నేపథ్యంలో సరిహద్దుల్లో ఘర్షణలకు దారితీశాయి. చైనా దురాక్రమణ వ్యూహంలో భాగంగానే ఈ ప్రతిష్టంభన ఏర్పడిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అసలు చైనా వ్యూహాల వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఏయే ప్రాంతాల్లో పట్టు కోసం చైనా ప్రయత్నిస్తోంది? ఇప్పటి వరకు ఆక్రమించిన ప్రాంతాలేంటి? ప్రస్తుతం హఠాత్తుగా ఉద్రిక్తతలకు దారి తీసిన పరిస్థితులు ఏంటి?

డ్రాగన్‌ది దురాక్రమణ వ్యూహం

సరిహద్దులో ఉద్రిక్తతలు రేకెత్తించడం వెనుక చైనా వ్యూహాత్మక ప్రాదేశిక రాజకీయాలు ఇమిడి ఉన్నాయి. దురాక్రమణ వ్యూహాలున్నాయి. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతం తమదేనని బలంగా వాదిస్తున్న చైనా 1980ల తర్వాత ఈ ప్రాంతంలోని దెమ్‌చోక్‌-కుయుల్‌ సెక్టార్లో చాలావరకు ఆక్రమించింది. లద్దాఖ్‌ తొలి సరిహద్దు కెగు నారో అనే ప్రాంతం వరకూ ఉండేది.

ఆ తర్వాత చైనా నెమ్మదిగా ముందుకు వస్తూ 1984లో నగత్సాంగ్‌, 1991లో నకుంగ్‌, 1992లో లుంగ్మా-సెర్డింగ్‌, 2008లో స్కాక్‌జంగ్‌లను ఆక్రమించింది. 2000లో చిప్‌చాప్‌ నది పరిసర ప్రాంతాలపై కన్నేసింది. 2013లో దాదాపు 19 కి.మీ. మేర భారత్‌లోకి చొచ్చుకువచ్చింది. ఆ సమయంలో భారత్‌ దాదాపు 640 చ.కి.మీ.ల భూభాగాన్ని కోల్పోయిందని శ్యాంశరణ్‌ నివేదిక చెబుతోంది. అయితే లద్దాఖ్‌ భూభాగాన్ని తాము కోల్పోయామన్న వాదనను సైన్యం ఖండిస్తోంది.

ఉద్రిక్తతలు హఠాత్తుగా ఎందుకిలా..?

భారత్‌-చైనాల మధ్య ఏళ్లుగా సరిహద్దు వివాదం కొనసాగుతున్నా.. తాజా ఉద్రిక్తతలకు కొన్ని ప్రధాన కారణాలున్నాయి.

  • చైనా ఎత్తుగడలకు విరుగుడుగా భారత్‌ కూడా సరిహద్దులో పెద్దఎత్తున మౌలిక సదుపాయాల్ని ఏర్పాటుచేస్తోంది. గాల్వన్‌ లోయలోని దర్బాక్‌-షాయోక్‌ నుంచి దౌలత్‌ బేగ్‌ ఓల్డీ దాకా రోడ్డును నిర్మించింది. ఇది చైనాకు ఆక్రోశం తెప్పించింది. అందుకే గాల్వన్‌ నాలా వద్ద సైనిక పోస్టులు, వంతెనల్ని ధ్వంసం చేసింది. భారత సైన్యంతో ఘర్షణకు దిగింది.
  • లద్దాఖ్‌ను ఇటీవల మోదీ సర్కారు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. లద్దాఖ్‌లోని కొంత భూభాగం తమదేనంటున్న చైనా- భారత ప్రభుత్వ చర్యను ఖండించింది. ఇది తమ సార్వభౌమత్వానికి ఆటంకం కలిగించేదిలా ఉందంటూ భద్రతామండలిలో ఫిర్యాదుచేసింది.
  • కరోనా వైరస్‌ వ్యాప్తిలో చైనా కుట్ర ఉందని కొన్ని ప్రపంచదేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో చైనాను ఏకాకిని చేయడానికి అమెరికా భారతదేశ సాయం తీసుకుంటోంది. ప్రపంచ దేశాలతో చేతులు కలపొద్దని భారత్‌కు హెచ్చరిక పంపడానికే చైనా ఇలా సరిహద్దులో కాలు దువ్వుతోంది.
  • పనిలో పనిగా నేపాల్‌నూ భారత్‌పైకి ఎగదోస్తోంది. కాలాపానీని నేపాల్‌ తన మ్యాపుల్లో చూపించడం వెనుక చైనా ప్రోద్బలం ఉంది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.