ETV Bharat / bharat

వస్తు తయారీ రంగానికి రూ.2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు

author img

By

Published : Nov 12, 2020, 5:15 AM IST

బుధవారం నిర్వహించిన కేబినెట్​ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. వస్తు తయారీ రంగానికి అయిదేళ్లలో రూ. 2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించింది. భారత్​ను స్వావలంబన దేశంగా నిలబెట్టాలన్నదే ఇందులో ప్రధాన ఉద్దేశమన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​. ఈ పథకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు భారత్​కు రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు.

Cabinet approves PLI scheme worth about Rs 2 lakh crore: FM
వస్తు తయారీ రంగానికి రూ.2 లక్షల కోట్ల ప్రోత్సాహకాలు

దేశాన్ని వస్తు తయారీ రంగ కేంద్రంగా మార్చి 'ఆత్మ నిర్భర్​ భారత్​' లక్ష్యాన్ని సాకారం చేసుకోవాలన్న ఉద్దేశంతో పది పారిశ్రామిక రంగాలకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకం కింద అయిదేళ్లలో రూ. 2 లక్షల కోట్లు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్​ సమావేశం నిర్ణయించింది.

ప్రస్తుతానికి రూ. 1.45 లక్షల కోట్ల కేటాయింపులను ప్రకటించినప్పటికీ అయిదేళ్ల నాటికి ఈ మొత్తం రూ. 2 లక్షల కోట్ల వరకు చేరవచ్చని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, ప్రకాశ్​ జావడేకర్​లు వెల్లడించారు. కేబినెట్​ సమావేశానంతరం వారు విలేకర్లతో మాట్లాడారు.

''జీడీపీలో.. తయారీ రంగం వాటా 16శాతం మాత్రమే ఉంది. ప్రపంచ తయారీ రంగ కేంద్రంగా దేశం మారాలంటే ఉత్పత్తి మరింత పెరగాలి. ఇప్పటివరకు ఎగుమతులు, ఉత్పాదకత పెంచడానికి చాలా చర్యలు తీసుకున్నా ఫలితం పెద్దగా రాలేదు. అందుకే కొత్తగా 10 తయారీ రంగాలకు అయిదేళ్లపాటు రూ. 2 లక్షల కోట్ల దాకా ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించాం. దీనివల్ల ఎగుమతులు, ఉద్యోగాలు పెరుగుతాయి. ఇప్పటికే మొబైల్​ ఫోన్లు, వైద్య పరికరాలకు ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. మొబైల్​ ఫోన్ల తయారీ సంస్థలు భారత్​లో ప్లాంటు ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించాయి. ఇప్పుడు 10 రంగాలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా వాటిలో భారత్​ను ప్రపంచ విజేతగా తయారుచేయాలని నిర్ణయించాం. సంస్థలు పెట్టుబడి పెట్టి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత ఈ ప్రోత్సాహకం లభిస్తుంది.''

- ప్రకాశ్​ జావడేకర్​, కేంద్ర మంత్రి

ఉద్యోగ అవకాశాలున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం..

నిర్మలా సీతారామన్​ మాట్లాడుతూ ఉద్యోగాల కల్పనను దృష్టిలో ఉంచుకొని వాటికి అత్యధిక అవకాశం ఉన్న ప్రాజెక్టులకే ప్రోత్సాహకాల్లో ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. భారత్​ను స్వావలంబన దేశంగా నిలబెట్టాలన్నదే ఇందులో ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ పథకం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తయారీదారులు భారత్​కు రావాలని ఆహ్వానిస్తున్నామన్నారు.

''భారత్​ను తయారీ, పెట్టుబడి కేంద్రంగా మార్చాలన్నదే తమ లక్ష్యం. సంబంధిత మంత్రిత్వ శాఖలు తక్షణం దీన్ని మొదలుపెట్టవచ్చు. శాఖల వారీగా అందించే ప్రోత్సాహకాలను సాధికార ఆర్థిక సంఘం పరిశీలిస్తుంది. అంతమంగా వాటికి మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తుంది. ప్రోత్సాహకాల కోసం 10 రంగాల పరిశ్రమలేవైనా దరఖాస్తు చేసుకోవచ్చు. వాటి సంఖ్యపై ఇప్పటి వరకూ ఎలాంటి పరిమితులూ విధించలేదు.''

- నిర్మలా సీతారామన్​, కేంద్ర మంత్రి

రంగాల వారీగా ప్రోత్సాహకం(రూ. కోట్లలో)

  1. అడ్వాన్స్​ కెమిస్ట్రీ సెల్​ బ్యాటరీలు - 18,100
  2. ఎలక్ట్రానిక్​, టెక్నాలజీ ఉత్పత్తులు - 5,000
  3. ఆటోమొబైల్​, ఆటో విడిభాగాలు - 57,042
  4. ఔషధ రంగం - 15,000
  5. టెలికాం, నెట్​వర్కింగ్​ - 12,195
  6. జౌళి ఉత్పత్తులు - 10,683
  7. ఆహార ఉత్పత్తులు - 10,900
  8. సౌర విద్యుత్తు ఘటకాలు - 4, 500
  9. ఏసీలు, ఎల్​ఈడీలు - 6,238
  10. ప్రత్యేక శ్రేణి ఉక్కు - 6,322

ఇప్పటివరకు ప్రైవేటు భాగస్వామ్యంలో చేపట్టే ఆర్థిక, మౌలిక వసతుల ప్రాజెక్టులకే వ్యయ సర్దుబాటు నిధి(వయబిలిటీ గ్యాప్​ ఫండింగ్​) ఇస్తుండగా ఇక మీదట ఆ ప్రయోజనాన్ని సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టులకూ విస్తరించాలని కేబినెట్​ నిర్ణయించింది. మురుగునీటి శుద్ధి, తాగునీటి సరఫరా, ఘనవ్యర్థాల నిర్వహణ, విద్య, వైద్య ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి దీనికింద ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే కేంద్రం తరఫున 30శాతం సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖ లేదా రాష్ట్రం తరఫున మరో 30 శాతం సమకూర్చనున్నట్లు నిర్మల ప్రకటించారు. ప్రైవేటు సంస్థలు 40 శాతం పెట్టుబడి పెడితే సరిపోతుందన్నారు. రెండు రంగాలకూ కలిపి 2024-25 వరకు వయబిలిటీ గ్యాప్​ ఫండింగ్​ కింద రూ. 8100 కోట్లు సమకూర్చనున్నట్లు వెల్లడించారు. నిర్వహణ ఖర్చు 100శాతం తిరిగి వచ్చే ప్రాజెక్టులకు మాత్రమే ఈ ప్రయోజనాలను వర్తింపజేయనున్నట్లు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.