ETV Bharat / bharat

భారత్​- చైనా మధ్య సైనిక చర్చలు మళ్లీ జరిగేనా?

author img

By

Published : Jun 18, 2020, 8:26 AM IST

ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్‌, చైనా మేజర్​ జనరల్​ స్థాయి అధికారుల మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. గాల్వన్‌ ఘర్షణ నేపథ్యంలో గంభీరంగా సాగిన ఈ భేటీలో బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా ఇరు దేశాల మధ్య సైనిక చర్చలపై సందిగ్ధం ఏర్పడింది. దీనిపై సైనిక వర్గాలు ఏమంటున్నాయి?

india china military talks
భారత్​- చైనా

గాల్వన్​ లోయ ప్రాంతంలో భారత్​- చైనా మధ్య మేజర్​ జనరల్​ స్థాయి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. భీకర ఘర్షణ చోటుచేసుకున్న గస్తీ పాయింట్- 14​ వద్ద జరిగిన ఈ సమావేశం గంభీరంగా సాగినట్లు తెలుస్తోంది.

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడమే లక్ష్యంగా భారత్‌, చైనా సైనికాధికారుల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో పలుచోట్ల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడంపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు చర్చలపై సందిగ్ధం ఏర్పడింది.

ఇరుదేశాలు ఆవేశంగా ఉన్న కారణంగా సైనిక స్థాయి చర్చలు సాధ్యం కాకపోవచ్చని వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని రెండుదేశాలు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో సైనిక వర్గాలు ఏమంటున్నాయో చూద్దాం.

చర్చలు సాధ్యమేనా?

సైనిక చర్చలు ఇక సాధ్యం కావన్న వార్తలను 'ఈటీవీ భారత్'​తో మాట్లాడిన ఓ సైనికాధికారి ఖండించారు. మరిన్ని చర్చల కోసం మళ్లీ భేటీ అవ్వాలని ఇరుదేశాల అధికారులు నిర్ణయించారని తెలిపారు.

"సమావేశం చాలా గంభీరంగా జరిగింది. ఇరు దేశాల సైనికుల మధ్య ఏం జరిగిందో తెలుసుకునేందుకు కొంత సమయం పడుతుంది. ఈ చర్చల్లో పరిష్కారం లభించలేదు. కానీ మరిన్ని చర్చలు అవసరమని రెండు వైపులా అంగీకరించటం సానుకూల అంశం. మరోసారి భేటీ అయ్యేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. అందువల్ల సైనిక స్థాయిలో మరిన్ని చర్చలు జరుగుతాయి."

- సైనికాధికారి

ఇటీవల చైనాతో జరిగిన సైనిక స్థాయి చర్చల్లో అమరులైన కల్నల్​ సంతోష్​ బాబు కూడా భాగంగా ఉన్నారు. సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఆయనతోపాటు మరో 19 మంది మరణించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఘర్షణలో మరణించిన 20 మంది సైనికులకు లేహ్​లో గౌరవవందనం సమర్పించారు అధికారులు. గురువారం సైనికుల భౌతికకాయాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

(రిపోర్ట్- సంజయ్​ బారువా)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.