ETV Bharat / bharat

ఎముకలు కొరికే చలిలోనూ యుద్ధానికి సంసిద్ధం!

author img

By

Published : Sep 16, 2020, 5:47 AM IST

Updated : Sep 16, 2020, 10:31 AM IST

లద్దాఖ్​లో ఉద్రిక్తతల వేళ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్​ సిద్ధమవుతోంది. చలికాలంలోనూ సైనిక స్థావరాలు కొనసాగించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆహారం, దుస్తులు, ఇంధనం సరఫరా చేస్తోంది. వాయుసేన సైతం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సామాగ్రి చేరవేసేందుకు చిన్నపాటి ఎయిర్​బేస్ ఏర్పాటుకు పనులు ప్రారంభించింది.

Amid tensions at LAC, Army prepares for long winter in Ladakh
ఎముకలు కొరికే చలిలోనూ యుద్ధానికి సంసిద్ధం!

తూర్పు లద్దాఖ్​లోని భారత్-చైనా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో... ఎలాంటి పరిస్థితినైనా దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఎముకలను కొరికే చలిని సైతం తట్టుకుని సైనికులు దేశానికి రక్షణ కల్పించేలా ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. శీతాకాలానికి అవసరమైన ఆహారం, దుస్తులు, ఇంధనం హీటర్లు, టెంట్లు, యుద్ధ సామగ్రిని సైనిక స్థావరాలకు చేరవేస్తోంది.

లద్దాఖ్ ప్రాంతంలో చలికాలం జీరో, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. నెలల తరబడి మిగతా ప్రపంచంతో ఈ ప్రాంతానికి అంతగా సంబంధాలు ఉండవు. అయితే, ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు సమసిపోయేలా కనిపించడం లేదు. దీంతో చలికాలంలోనూ సరిహద్దుల్లో సైనిక స్థావరాలను కొనసాగించేందుకు ఉభయ దేశాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందుకు అవసరమైన సరంజామాను ఇప్పటికే తాము సమకూర్చుకున్నామని.. చేరవలసిన ప్రాంతాలకు వాటిని చేర్చామని భారత 'ఫైర్ అండ్ ప్యూరీ కోర్' ఉన్నతాధికారి మేజర్ జనరల్ అర్వింద్ కపూర్ చెప్పారు.

"లద్దాఖ్ ప్రాంతం... మనాలి-లేహ్, జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారులతో అనుసంధానమై ఉంటుంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాదిలో సుమారు 180 రోజుల పాటు ఇవి మూసే ఉండేవి ఇప్పుడైతే 120 రోజులు మాత్రమే మూతపడుతున్నాయి. అటల్ టన్నెల్‌ను త్వరలోనే ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇది కూడా అందుబాటులోకి వస్తే లద్దాఖ్ నుంచి ఇతర ప్రాంతాలకు ఏడాది పొడవునా రాకపోకలు కొనసాగుతాయి."

-మేజర్ జనరల్ అర్వింద్ కపూర్, ఉన్నతాధికారి

ఎయిర్ బేస్ ఏర్పాటుకు వాయుసేన కసరత్తు

హిమాలయ ప్రాంతంలోని సైనికులకు ఎప్పటిక ప్పుడు సామగ్రిని చేరవేసేందుకు భారత వాయు సేన సిద్ధమవుతోంది. లద్దాఖ్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వెంబడి చిన్నపాటి ఎయిర్ బేస్(అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్-ఏఎల్​జీ) ఏర్పాటుకు చర్యలు ఆరంభించింది. సెంట్రల్ ఎయిర్ కమాండకు చెందిన ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఎయిర్ మారల్ రాజేశ్ కుమార్ గత శుక్రవారం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్​తో సమావేశమయ్యారు. ఎల్ఏజీ, సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్ రాడార్ ఏర్పాట్ల గురించి ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయమై వైమానికదళ వర్గాలు 'ఈటీవీ భారత్'తో మాట్లాడాయి. "సరిహద్దుల్లో వైమానిక దళ నెట్​వర్క్​ను నిత్యం బలో పేతం చేస్తూనే ఉంటాం. బృహత్తర ప్రణాళికలో ఇదో భాగం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఈ చర్యలు చేపడుతున్నట్టు భావించాల్సిన అవసరం లేదు" అని పేర్కొన్నాయి.

చైనా నాలుగు బేస్​లు

సాధారణంగా సి 17 గ్లోబ్ మాస్టర్, సి-130 జే సూపర్ హెర్క్యూల్స్ వంటి సైనిక, సామగ్రి రవాణా విమానాలు రాకపోకలు సాగించేందుకు ఏఎల్​జీలను వినియోగిస్తారు. అక్కడి నుంచి సామగ్రిని హెలికాఫ్టర్ల ద్వారా సైనిక స్థావరాలకు చేరవేస్తారు. అవసరమైతే ఈ ఎయిర్ బేస్​ల నుంచి యుద్ధ విమానాలను కూడా ప్రయోగిస్తారు. చైనా సరిహద్దులకు చేరువలో భారత్ ఇప్పటికే 17 ఏఎల్​జీలను ఏర్పాటు చేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్​లో 10, లద్దాఖ్​లో, ఉత్తరాఖండ్​లో ఒకటి చొప్పున ఏఎల్​జీలు ఉన్నాయి. మరోవైపు చైనాకు చెందిన పీఎల్​ఏ ఎయిర్​ఫోర్స్ (పీఎల్ఏఏఎఫ్) కూడా భారత్ లక్ష్యంగా నాలుగు ఎయిర్ బేస్లను ఏర్పాటు చేసుకుంది.

Last Updated :Sep 16, 2020, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.