ETV Bharat / bharat

'స్వావలంబనే ప్రజలకు అండ- దేశానికి రక్ష'

author img

By

Published : Aug 15, 2020, 12:17 PM IST

90 నిమిషాల పాటు సాగిన ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో 'ఆత్మనిర్భర్​ భారత్​' కేంద్ర బిందువుగా నిలిచింది. భారత్​ స్వావలంబనవైపు పరుగులు తీయాలని.. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించగలిగే శక్తి భారతీయులకు ఉందని ధీమా వ్యక్తంచేశారు మోదీ. దేశాభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకోనున్న చర్యలు, కరోనా టీకా, నేషన్​ల్​ హెల్త్​ మిషన్​పై పలు కీలక విషయాలను వెల్లడించారు మోదీ.

Aatmanirbhar Bharat at centre of Modi's Independence Day speech
ఆత్మ నిర్భరమే ప్రజలకు అండ- దేశానికి రక్ష: మోదీ

కరోనా సంక్షోభంలో దేశాన్ని గట్టెక్కించడానికి ప్రయోగించిన 'ఆత్మనిర్భర్​ భారత్'​ అస్త్రం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కేంద్రబిందువుగా నిలిచింది. 90 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో వివిధ రంగాల్లో జరగనున్న దేశాభివృద్ధిపై కీలక విషయాలను వెల్లడించిన మోదీ.. స్వావలంబనవైపు భారత్​ పరుగులు తీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ సంకల్పాన్ని కరోనా వైరస్​ అడ్డుకోలేదని స్పష్టంచేశారు.

ఆత్మనిర్భర్​ మంత్రం...

ఆత్మనిర్భర్​ భారత్​ అంటే ప్రపంచంతో మరింత మమేకం కావడమని ప్రధాని తెలిపారు. దిగుమతులు తగ్గించుకుని, ముడి సరకు స్థానంలో పూర్తిగా తయారైన వస్తువులను ఎగుమతి చేసే విధంగా దేశం ఎదగాలని.. ఇందుకు ప్రజలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 'మేక్​ ఇన్​ ఇండియా', 'మేక్​ ఫర్​ వరల్డ్​' మంత్రాలను అనుసరిస్తూ దేశం ముందుకు సాగాలని సూచించారు.

ఆత్మనిర్భర్​ భారత్ ఇప్పుడు 130 కోట్ల మంది భారతీయులకు ఓ మంత్రంగా మారిందన్నారు మోదీ. ఇన్ని రోజులు ఓ కలగానే మిగిలిపోయిన ఈ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ ప్రతిజ్ఞగా మారుతోందని తెలిపారు.

ఇదీ చూడండి:- ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

లక్ష సవాళ్లు.. కోటి పరిష్కారాలు...

ఆత్మనిర్భర్​ భారత్ సాధన విషయంలో​ లక్షలాది అనుమానాలు, సవాళ్లున్నప్పటికీ.. వాటన్నింటినీ అధిగమించేందుకు కోటికిపైగా పరిష్కారాలను చూపగల శక్తి భారతీయులకు ఉందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని.

ఈ నేపథ్యంలో వోకల్​ ఫర్​ లోకల్​ను ప్రస్తావించారు ప్రధాని. లోకల్​ కోసం వోకల్​గా మారాల్సిన తురణం ఆసన్నమైందని నొక్కిచెప్పారు. భారత వస్తువులను విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లాలని నిర్దేశించారు.

వ్యవసాయంలోనూ...

వ్యవసాయంలో స్వావలంబన, రైతులు స్వయం సమృద్ధత సాధించడం ఆత్మనిర్భర్​ భారత్​ ప్రాధాన్యం అని తెలిపారు ప్రధాని. రైతులకు ఆధునిక వసతులను కల్పించడం కోసమే లక్ష కోట్ల రూపాయలతో 'వ్యవసాయ మౌలిక వసతుల నిధి'ని ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు.

వ్యాక్సిన్​ వచ్చేది అప్పుడే...

కరోనా సంక్షోభంలో ముందుండి పోరాడుతున్న కరోనా యోధులపై ప్రశంసల వర్షం కురిపించారు మోదీ. ప్రజల సంకల్పంతో వైరస్​నే వైరస్​పై విజయం సాధించవచ్చన్నారు.

ఈ నేపథ్యంలో వ్యాక్సిన్​పై కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. కరోనా టీకా కోసం ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారని.. ఇందుకు తగ్గట్టుగానే శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు పరీక్షల దశలో ఉన్నాయని.. శాస్త్రవేత్తలు ఆమోద ముద్ర వేసిన వెంటనే వాటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ టీకా​ అందేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- ఆగని కరోనా ఉద్ధృతి.. 50 వేలకు చేరువలో మరణాలు

శత్రువులకు గుణపాఠం...

సరిహద్దులో అలజడులు సృష్టించడానికి ప్రయత్నించే పొరుగుదేశాలకు తీవ్ర హెచ్చరికలు చేశారు మోదీ. ఎల్​ఓసీ నుంచి ఎల్​ఏసీ వరకు.. దేశ సార్వభౌమాధికారానికి సవాళ్లు విసిరిన వారికి.. సైన్యం తగిన గుణపాఠం చెప్పిందన్నారు.

"భారత సార్వభౌమాధికారాన్ని గౌరవించడం అత్యంత ముఖ్యమైన విషయం. దీనిని మనం ఎంత తీవ్రంగా పరిగణిస్తామో లద్దాఖ్​లోని మన జవాన్లు ప్రపంచానికి చాటిచెప్పారు. ఎర్రకోట వేదికగా ధైర్యవంతులైన సైనికులకు సెల్యూట్​ చేస్తున్నా. ఉగ్రవాదమైనా, విస్తరణవాదమైనా.. దేశం దృఢ నిశ్చయంతో పోరాడుతుంది."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

Aatmanirbhar Bharat at centre of Modi's Independence Day speech
స్వాతంత్ర్య వేడుకల భద్రత కోసం యాంటీ-డ్రోన్​ వ్యవస్థను ఏర్పాటు చేసింది డీఆర్​డీఓ. మైక్రో డ్రోన్లను మూడు కిలో మీటర్ల దూరంలో గుర్తించి, 1-2.5కిలోమీటర్ల దూరంలో వాటిని నేలమట్టం చేయగలిగే సామర్థ్యం దీని సొంతం.

ఇదీ చూడండి:- చైనా సరిహద్దులో త్రివర్ణ పతాకం రెపరెపలు

హెల్త్​ ఐడీ...

కరోనా సంక్షోభం ఆరోగ్య రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అవసరాన్ని తెలియజెప్పిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ నేపథ్యంలో 'నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్' ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ఒక్కరికి హెల్త్​ ఐడీ జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు.

మరోవైపు రానున్న 1000రోజుల్లో దేశంలోని 6లక్షల గ్రామాలను ఆప్టికల్​ ఫైబర్​తో అనుసంధానం చేయనున్నట్టు ప్రధాని వెల్లడించారు.

గత ఆర్థికసంవత్సరంలో విదేశీ పెట్టుబడులు రికార్డు స్థాయిలో 18శాతం వృద్ధిచెందాయని మోదీ తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.