ETV Bharat / bharat

నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు

author img

By

Published : Jul 6, 2020, 5:50 AM IST

నాలుగేళ్ల బాల్యంలో స్పానిష్​ ఫ్లూ మహమ్మారిని ఎదుర్కొన్న వ్యక్తి.. ఇప్పుడు 106ఏళ్ల వృద్ధ వయస్సులో కరోనా వైరస్​ను జయించాడు. తన 70 ఏళ్ల కుమారుడి కంటే వేగంగా వ్యాధి నుంచి కోలుకున్నాడు. ఆయన మనో నిబ్బరం ముందు కరోనా కూడా ఓటమి పాలైంది.

106-year-old Delhi man who was child during Spanish Flu survives COVID-19
నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు

అది 1918 సంవత్సరం. అప్పుడాయన వయసు నాలుగేళ్లు, స్పానిష్‌ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నప్పటికీ దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నాడని సమాచారం. ఇప్పుడాయన వయస్సు 106 సంవత్సరాలు. మళ్లీ 102 ఏళ్ల తర్వాత కరోనా రూపంలో మరో మహమ్మారిని ఎదుర్కోవలసి వచ్చింది. అయితేనేం, ఏ మాత్రం భయపడలేదు. ఆయన మనోనిబ్బరం ముందు కరోనా కూడా ఓటమిపాలైంది.

దిల్లీ వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు కరోనా వైరస్‌ సోకింది. వారందరినీ రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్‌)లో ఉంచి చికిత్స చేస్తున్నారు. తాజాగా ఆ కుటుంబంలో 106 ఏళ్ల వృద్ధుడు కరోనా నుంచి కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. అంత పెద్ద వయస్సులోనూ ఆ వృద్ధుడు తన 70 ఏళ్ల కుమారుడి కన్నా వేగంగా కరోనా బారి నుంచి కోలుకోవడం విశేషం. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం 1918-19 మధ్య స్పానిష్‌ ఫ్లూ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రస్తుతం ఈయన వైరస్‌ బారి నుంచి కోలుకోవడం పట్ల ఆస్పత్రి వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు. 'ఆయన స్పానిష్‌ ఫ్లూ బారిన పడ్డారో లేదో తెలియదు. దానికి సంబంధించిన సమాచారం ఏదీ మన వద్ద లేదు. అప్పట్లో దిల్లీలో కొన్ని ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి. కానీ 106 ఏళ్ల వయస్సున్న వ్యక్తి కరోనా నుంచి కోలుకోవడం ఎంతో గొప్ప విషయం' అని ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్‌ వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి: అర్ధరాత్రి అతిథిగా వచ్చిన మొసలి.. పరుగులు తీసిన జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.