ETV Bharat / bharat

దీదీ దూత X మోదీ పరా: యాప్​లతో ఓట్ల వేట!

author img

By

Published : Feb 16, 2021, 11:47 AM IST

పోటాపోటీ ప్రచారాలతో బంగాల్​ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి అధికార టీఎంసీ, భాజపా. పరివర్తన్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రలు నిర్వహిస్తున్న భాజపాకు పోటీగా.. 'దీదీర్ దూత్​' అస్త్రాన్ని ప్రయోగించింది తృణమూల్ కాంగ్రెస్. ప్రచార వాహనాలతో పాటు మొబైల్ యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భాజపా సైతం 'మోదీపరా' పేరుతో ప్రచార యాప్​ను విడుదల చేసింది.

Battle between 'Didir Doot' and 'Rathyatra' in West Bengal
దీదీర్ దూత్Xపరివర్తన్

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్రంలోని భాజపా పెద్దల మధ్య సాధారణంగానే వాడీవేడి వాతావరణం ఉంటుంది. కేంద్రాన్ని ఎండగట్టాలని దీదీ.. బంగాల్​ పాలనపై మమతను విమర్శించాలని భాజపా నేతలు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక ఆ రాష్ట్రంలోనే ఎన్నికలంటే పరిస్థితులు మరింత వేడెక్కడం ఖాయం. ప్రస్తుతం బంగాల్​లో అదే జరుగుతోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ టీఎంసీ, భాజపా మధ్య రాజకీయ వేడి తారస్థాయికి చేరుకుంటోంది. ఒకరిపై మరొకరి మాటల దాడి పెరిగిపోతోంది. బంగాల్ ప్రజల దృష్టిని ఆకర్షించేలా ప్రచారం సైతం పోటాపోటీగా సాగుతోంది.

ఇదీ చదవండి: బంగాల్​ బరి​: 'సరస్వతీ' మంత్రం పఠిస్తున్న తృణమూల్​!

సైబర్ వార్!

కాలాన్ని బట్టి పరిస్థితులు మారుతాయంటారు. అదే విధంగా రాజకీయ ప్రచారాలు సైతం ఇలాగే కొత్తదారుల్లో వెళ్తున్నాయి. సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నాయి. టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే మెరుగైన ఫలితాలు రావడం తథ్యం. ఇది రాజకీయాలకు అతీతమేమీ కాదు. ఈ నేపథ్యంలో సంప్రదాయ ర్యాలీలు, రోడ్​షోలు, బహిరంగ సభలతో పాటు సాంకేతికతనూ పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నాయి పార్టీలు. ఆన్​లైన్ మార్గాల్లో ప్రచారంలో తలపడుతున్నాయి.

దీదీ దూత X మోదీపరా

'పరివర్తన్ రథయాత్ర' అంటూ రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేస్తున్న కాషాయ దళం.. 'మోదీపరా' పేరుతో మొబైల్ యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా.. ఈ యాప్​ను ఆవిష్కరించారు. అదే సమయంలో భాజపాకు పోటీగా టీఎంసీ సైతం దూకుడు ప్రదర్శిస్తోంది. భాజపా రథయాత్రకు చెక్​పెట్టేలా 'దీదీర్ దూత్​' పేరుతో ప్రచార రథాలను రంగంలోకి దించింది. అదే పేరుతో యాప్​ను లాంచ్ చేసి.. ఆన్​లైన్​లోనూ ప్రచారం చేస్తోంది. ఓట్ల కోసం ప్రధాన పార్టీలు ప్రయోగిస్తున్న పోటాపోటీ ప్రచారాస్త్రాలతో బంగాల్ రాజకీయం రసవత్తర అధ్యాయానికి చేరుకుంది.

'దీదీర్ దూత్' అంటే దీదీ దూత అని అర్థం. భాజపా చేపట్టిన 'రథయాత్ర'కు పోటీగా ఈ ప్రచార వాహనాలను రంగంలోకి దించింది టీఎంసీ. మమతా బెనర్జీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో దీదీర్ దూత్​లను ప్రవేశపెట్టినట్లు పార్టీ చెబుతోంది. బంగాల్​లోని మొత్తం 23 జిల్లాల్లో ఈ వాహనాలను ప్రచారాల కోసం వినియోగిస్తున్నారు. ఇటీవల దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో ప్రచారం నిర్వహించేటప్పుడు టీఎంసీ ఎంపీ, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఈ వాహనాన్నే ఉపయోగించారు.

ఎవరిది పైచేయి?

'యాప్​ పోరు'లో తమదే ఆధిపత్యమని ఇరు పార్టీలు చెప్పుకుంటున్నాయి. దీదీర్ దూత్ విడుదలైన ఎనిమిది రోజుల్లోనే లక్ష మంది డౌన్​లోడ్ చేసుకున్నారని టీఎంసీ ప్రకటించింది. ఈ యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా దీదీకి చేరవేయవచ్చని పార్టీ చెబుతోంది. ప్రచారానికి సంబంధించిన వివరాలతో పాటు బంగాల్​లో దీదీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రాజెక్టుల సమాచారాన్ని యాప్​లో అందుబాటులో ఉంచింది.

మోదీపరా యాప్, వెబ్​సైట్​​లో కలిపి మొత్తం లక్షా 80 వేల మంది రిజిస్టర్ అయ్యారని భాజపా చెబుతోంది. ప్రతిరోజు 3.5 లక్షల మంది 'మోదీపరా'ను వీక్షిస్తున్నట్లు తెలిపింది. మహిళలు, యువత యాప్​ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో యూజర్లు పెరుగుతున్నారని పేర్కొంది. ప్రధానంగా మోదీ ప్రజాకర్షణ శక్తిని నమ్ముకుని ఈ యాప్​ను రూపొందించినట్లు తెలుస్తోంది.

బంగాల్​లో పరా అంటే పరిసరాలు అని అర్థం. మోదీ చేపట్టిన పనుల గురించి అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసేలా ఈ యాప్​ను బంగాలీ భాషలో రూపొందించినట్లు కాషాయ పార్టీ స్పష్టం చేస్తోంది.

ఇదీ చదవండి: ప్రచార పర్వం: భాజపా రథయాత్ర- ర్యాలీతో టీఎంసీ

ఇప్పటికే భాజపా పరివర్తన్ యాత్ర పేరుతో బంగాల్ వ్యాప్తంగా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మార్పు కోసం ఈ రథయాత్రలు నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. భాజపా అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఈ 'రథాల'లో ప్రయాణిస్తూ ప్రచారం చేస్తున్నారు.

గెలుపే లక్ష్యం

పేర్లు వేరైనా.. ఇరు పార్టీల లక్ష్యం ఒక్కటే. ప్రజలతో దగ్గరి సంబంధాలు కొనసాగించడం, ఓటర్ల నాడిని పసిగట్టి.. వారిని తమకు అనుకూలంగా మలుచుకోవడం. ఎన్నికలకు ముందే సాధ్యమైనంతగా ప్రచారంలో పైచేయి సాధించాలని ఇరుపక్షాలు గట్టిగా భావిస్తున్నాయి. పార్టీ శ్రేణుల్లోనూ అందుకు తగినట్టుగా ఉత్సాహం నింపుతున్నాయి.

ఈ ప్రచార పోటీలో గెలిచేదెవరన్నదే ప్రధాన ప్రశ్న. అన్ని సవాళ్లను అధిగమించి మూడోసారి దీదీ విజేతగా నిలుస్తారా? లేదంటే రథయాత్ర సాయంతో భాజపా సరికొత్త చరిత్ర లిఖిస్తుందా? ఎదురుచూస్తేనే తెలిసేది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.