మాతృభూమి కోసం కన్నబిడ్డలను త్యాగం చేసిన వీరమాత

author img

By

Published : May 8, 2022, 8:41 AM IST

Azadi Ka Amrith Mahotsav Malamathi:

దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబమెక్కిన వారిని సమరయోధులన్నాం.. మరి కన్నబిడ్డ ఉరితాడు ముద్దాడే ముందు కన్నీళ్లు పెట్టుకుంటే ధైర్యంగా నిలబడి వారించిన ఆ తల్లినేమని పిలవాలి? పేగుబంధం తాడుకు వేలాడబోతుంటే.. కన్నీటిని కనురెప్పల చెలియలి కట్ట దాటనివ్వని కల్లోల సముద్రాన్ని ఏమనాలి? స్వాతంత్య్రోద్యమంలో విప్లవవీరుల పేర్లు చాలానే చెప్పవచ్చు! ఆ వీరులకు జన్మనిచ్చిన తల్లులు, వారు పడ్డ కష్టాలను చరిత్ర మరచిపోయింది. మాతృభూమి కోసం కన్నబిడ్డలను త్యాగం చేసిన వీరమాతల జీవితాలు సమర యోధులకేం తక్కువ కాదు.

Azadi Ka Amrith Mahotsav Malamathi: దేశ బానిస సంకెళ్లు తెంచటానికి విప్లవపంథా ఎంచుకొని వీరమరణం పొందిన అనేక మంది వీరుల తల్లులు, కుటుంబాలు తర్వాత బ్రిటిష్‌ సర్కారు చేతుల్లో దారుణ పరిస్థితులను ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో తొలుత గుర్తుకొచ్చేది భగత్‌సింగ్‌కు స్ఫూర్తిదాత అయిన రాంప్రసాద్‌ బిస్మిల్‌ మాతృమూర్తి మూలమతి. దుర్వినియోగం చేయబోననే షరతుపై కొడుకుకు రివాల్వర్‌ కొనటానికి డబ్బులిచ్చింది. విప్లవ పుస్తకాల ప్రచురణకూ ఆర్థికంగా సాయం చేసేది ఆమె. అలా తల్లి సహకారంతో హిందుస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌ఏ) స్థాపించి.. ఆంగ్లేయులపై పోరాటంలో విప్లవవీరులందరినీ ఏకతాటిపై తెచ్చిన బిస్మిల్‌కు కకోరి రైలు దోపిడీ కేసులో ఉరిశిక్ష పడింది. 1927 డిసెంబరులో ఉరి తీయటానికి ముందు గోరఖ్‌పుర్‌ జైలులో కొడుకును కలవటానికి మూలమతికి అనుమతిచ్చారు.

ఆమెతో పాటు బంధువు పేరిట హెచ్‌ఆర్‌ఏ కార్యకర్త శివవర్మ కూడా వెళ్లాడు. తల్లిని చూడగానే బిస్మిల్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆమె మాత్రం ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. 'రామ్‌! నీ కళ్లలో నీళ్లా? దేశం కోసం ఉరికంబమెక్కుతున్నావని మేమంతా గర్వపడుతుంటే నువ్వు ఏడుస్తున్నావా? బయట ప్రజలంతా ‘నీ కొడుకు వీరుడంటూ పొగుడుతుంటే నిజమే అనుకున్నాను. నీ పేరు వింటేనే ఆంగ్లేయుల గుండెలు వణకుతాయని నమ్మాను. కానీ ఇక్కడ నువ్వేమో కన్నీరు పెట్టుకుంటున్నావు! చావును చూసి ఇంతగా భయపడతావని అనుకోలేదు. కన్నీళ్లతో ఉరికంబాన్ని ఎక్కేట్లయితే... ఈ దారినెందుకు ఎంచుకున్నావు?’’ అంటూ చివరి క్షణాల్లోనూ కన్నబిడ్డలో ధైర్యాన్ని, స్వాతంత్య్రాభిలాషనే నూరిపోసింది తల్లి! 'అమ్మా ఇవి చావుకు భయపడి వచ్చిన కన్నీళ్లు కావు. నీ నుంచి దూరంగా వెళుతున్నానన్న బాధతో వచ్చినవి’ అంటూ బదులిచ్చిన బిస్మిల్‌ను భుజంపై చేయి వేసి లాలించిందా మాతృమూర్తి. వెంట వచ్చిన శివను చూపిస్తూ.. 'ఇతను మీ పార్టీ సభ్యుడు. పార్టీకి ఏమైనా సందేశం పంపాల్సి ఉంటే ఆయనకు చెప్పు' అంటూ చివరి క్షణాల్లోనూ కర్తవ్యాన్ని బోధించింది. మరుసటిరోజు ఉదయం.. తన సమక్షంలోనే ఉరితీత! ఉరికంబం ఎక్కడానికి ముందు తనకు పాదాభివందనం చేసిన బిడ్డను చివరిసారిగా ఆశీర్వదించింది మాతృమూర్తి మూలమతి!

కన్నబిడ్డ ఉరికంబమెక్కినా ఆమెలో స్వాతంత్య్ర తపన తగ్గలేదు. బిస్మిల్‌ చనిపోయిన కొద్దిరోజులకు జరిగిన బహిరంగ సభలో తన రెండో కొడుకును కూడా స్వాతంత్య్ర సమరానికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారా ధీర. కానీ పరిస్థితులు కలసి రాలేదు. ఆంగ్లేయ సర్కారు ఆంక్షలు, అనుమానాల నేపథ్యంలో చుట్టుపక్కలవారు, బంధువులు కూడా పలకరించటానికి భయపడటంతో కుటుంబం ఒంటరైంది. పేదరికం చుట్టుముట్టింది. షాజహాన్‌పుర్‌లోని ఇంటిని అమ్ముకొని దుర్భరజీవితం గడపాల్సి వచ్చింది. చిన్నకొడుకు టీబీ సోకి.. వైద్యం చేయించలేని దుస్థితిలో మరణించాడు. భర్త కన్నుమూస్తే దహన సంస్కారానికి కూడా డబ్బుల్లేని పరిస్థితి. బిస్మిల్‌ స్నేహితులు చందాలు వేసుకొని ఆ పని కానిచ్చారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ప్రభుత్వం స్పందించలేదు. 1956లో గజగజలాడే చలిలో ఆ వీరమాత తన ముద్దుబిడ్డ దగ్గరకు చేరుకుంది.

బిస్మిల్‌తో పాటే ఉరికంబమెక్కిన రోషన్‌సింగ్‌ తల్లి కౌసల్యాదేవిదీ అదే పరిస్థితి. వీరి కుటుంబాన్నైతే ఆంగ్లేయ పోలీసులు వెంటాడి మరీ వేధించారు. రోషన్‌ సోదరీమణులకు పెళ్లికాకుండా అడ్డుకున్నారు. ఎవరైనా సంబంధం చూడటానికి వస్తే.. వారిపైనా రాజద్రోహ నేరం మోపుతామంటూ బెదిరించేవారు. ఈ సమయంలో కౌసల్యాదేవికి జర్నలిస్టు సమరయోధుడు గణేశ్‌ శంకర్‌ విద్యార్థి ఆర్థికంగా అండగా నిలిచారు.
చంద్రశేఖర్‌ ఆజాద్‌ తల్లి జాగ్రాణి దేవిదైతే తిండి కూడా దొరకని దుస్థితి. ఈ విషయం తెలిసి అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆమెకు రూ.500 పంపించారు. చివరకు.. ఆజాద్‌ స్నేహితుడు సదాశివ్‌ మాల్కాపుర్కర్‌ ఆమెను కన్నతల్లిలా ఆదుకున్నారు.

ఇదీ చదవండి: గాంధీజీ, ఠాగూర్​ల మధ్య చిచ్చుపెట్టిన చరఖా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.