ETV Bharat / bharat

ఆరావళి ఆదివాసీలపై ఆంగ్లేయుల ఊచకోత

author img

By

Published : Jun 20, 2022, 8:38 AM IST

mangarh hill massacre: వాళ్లేమీ రాజ్యం కోరలేదు. స్వరాజ్యం అంతకన్నా కావాలనలేదు. పన్నుల భారం తగ్గించమన్నారు.. 'బాంచెన్‌ దొర' బానిసత్వం వద్దన్నారు. ఆ మాత్రానికే ఆంగ్లేయ ఫిరంగులు గర్జించాయ్‌. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 1500 మంది ఆదివాసీలను పొట్టనబెట్టుకున్నాయి. ఆరావళి పర్వత శ్రేణుల్లో ఆంగ్లేయులు సృష్టించిన ఉత్పాతమిది. జలియన్‌వాలాబాగ్‌ కంటే ఆరేళ్ల ముందు జరిగినా చరిత్రకెక్కని అరాచకమిది.

mangarh hill massacre
mangarh hill massacre

mangarh hill massacre: ఆంగ్లేయుల దారుణ మారణకాండ అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది కనీసం వెయ్యిమందిని పొట్టనబెట్టుకున్న 1919 జలియన్‌వాలాబాగ్‌ దుర్ఘటనే! కానీ, దీనికంటే ఆరేళ్ల ముందే ఆరావళి పర్వతశ్రేణుల్లో ఆదివాసీల రక్తం ఏరులై ప్రవహించింది. 1913 నవంబరు 17న మన్‌గఢ్‌లో తెల్లవారి విచక్షణా రహిత తూటాలకు 1500 మందికిపైగా నేలకొరిగారనే సంగతి చరిత్రకెక్కని చేదు నిజం.

మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల్లో నివసించే ఆదివాసీ జాతి భిల్లులు అడవి మీద ఆధారపడి బతికేవారు. చాలామటుకు వారు ఆయా రాష్ట్రాల్లోని సంస్థానాధీశులు, భూస్వాముల వద్ద ఊడిగం చేసేవారు. తరతరాల పాటు జీవితాలు వెట్టిలోనే గడిచిపోయేవి. ఎప్పుడైనా ఏదైనా వారికి చెల్లించినా అది చాలా స్వల్పం. 1899-1900లో వచ్చిన క్షామం ఆరులక్షల మందిని బలికొంది. భిల్లులపైనా దీనిప్రభావం దారుణంగా పడింది. ముఖ్యంగా బన్‌స్వారా, సంత్రామ్‌పుర్‌, దుంగార్పుర్‌ సంస్థానాల్లో తిండికి దొరకని పరిస్థితిలో చాలామంది దోపిడీ దొంగలుగా మారారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్‌లోని దుంగార్పుర్‌ బంజారా కుటుంబానికి చెందిన గోవింద్గ్‌ిరి అనే సంస్కర్త భిల్లులను దారిన పెట్టడానికి 1908లో భగత్‌ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆర్థిక దోపిడీకి కరవుకాటకాలు తోడవటంతో భిల్లులు దెబ్బతింటున్నారని భావించిన ఆయన శాకాహారానికి కట్టుబడి, మద్యానికి దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించారు. వీటికి తోడుగా.. వెట్టిచాకిరీని వ్యతిరేకిస్తూ, చేస్తున్న పనికి సరైన జీతం ఇవ్వాలని, హక్కుల కోసం పోరాడాలని గోవింద్‌గిరి భిల్లులకు ఉద్బోధించారు. ఇది సంస్థానాధీశులకు, ఆంగ్లేయులకు కంటగింపుగా మారింది. ఆంగ్లేయులు-సంస్థానాధీశులకు, భిల్లులకు మధ్య చర్చలు జరిగాయి. ఏడాదికి రూ.1.25 (రూపాయి 25 పైసలు) కూలీ చెల్లించటానికి ఆంగ్లేయులు ప్రతిపాదించగా భిల్లులు తిరస్కరించారు.

కార్తికమాసంలో భిల్లులంతా కలసి తమ సంప్రదాయం ప్రకారం.. మన్‌గఢ్‌లో అగ్నిదేవుడికి హోమం చేయాలని నిర్ణయించారు. బన్‌స్వారా, సంత్రామ్‌పుర్‌ సంస్థానాల మధ్య ఉండే దట్టమైన అడవిలో ఉండే పర్వత ప్రాంతం మనగఢ్‌. అన్ని ప్రాంతాల నుంచి భిల్లులు అక్టోబరు నుంచే ఇక్కడకు చేరుకోవటం మొదలెట్టారు. హోమ సమయానికల్లా దాదాపు లక్షన్నర మందితో మన్‌గఢ్‌ కిటకిటలాడింది. ఈ జనసమూహాన్ని చూసి సంస్థానాధీశులతోపాటు, ఆంగ్లేయ సర్కారూ భయపడింది. భిల్లులు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని భావించిన బ్రిటిష్‌ ప్రభుత్వం.. కర్నల్‌ షెర్టన్‌ సారథ్యంలో భారీగా సాయుధ బలగాలతో మన్‌గఢ్‌ను అన్ని వైపుల నుంచీ చుట్టుముట్టింది. భిల్లులను తక్షణమే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలంటూ ఆదేశాలు జారీచేసింది. హోమాన్ని మధ్యలో ఆపేయటం కుదరదన్నారు భిల్లులు. వెంటనే ఆంగ్లేయ సేనలు నిర్దాక్షిణ్యంగా నలుదిక్కుల నుంచీ కాల్పులు ప్రారంభించాయి. అంతేగాకుండా.. గాడిదలపై ఆటోమేటిక్‌ తుపాకులను కట్టి కొండపైకి వదిలేశారు. సంప్రదాయ హోమంలో పాల్గొనాలని వచ్చిన భిల్లులు అకారణంగా ఆంగ్లేయుల మారణహోమానికి బలయ్యారు. ఒక్కరోజులోనే 1500 మందికిపైగా మరణించారు. మన్‌గఢ్‌ శవాల గుట్టలా మారింది. గోవింద్‌గిరి సహా చాలామందిని ఆంగ్లేయ సర్కారు అరెస్టు చేసి.. రాజద్రోహ నేరంపై యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1919లో సత్ప్రవర్తన కారణంగా ఆయన్ను విడుదల చేసినా.. భిల్లులుండే ప్రాంతాల్లో అడుగుపెట్టకుండా నిషేధించారు. చివరకు ఆయన 1931లో గుజరాత్‌లోని లింబ్డి వద్ద మరణించారు. ఆంగ్లేయులపై ఆయన పోరాటానికి సంస్మరణగా గుజరాత్‌ ప్రభుత్వం గోధ్రాలో గోవింద్‌గురు విశ్వవిద్యాలయం స్థాపించింది. 1913లో జరిగిన దారుణ మారణకాండ భిల్లులను ఎంతో బాధించింది. ఎంతగా అంటే.. స్వాతంత్య్రం వచ్చాక కూడా చాలాకాలం పాటు మన్‌గఢ్‌ వైపు వెళ్లటానికి ఎవ్వరూ ఇష్టపడనంతగా! ఆంగ్లేయ పాలనలో చోటు చేసుకున్న అత్యంత కిరాతక మారణకాండ.. అడవిలో ఆదివాసీలపై జరిగిన ఈ మన్‌గఢ్‌ ఊచకోత!

ఇదీ చదవండి: బెర్లిన్‌ గోడ స్మారకాన్ని సందర్శించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.