ETV Bharat / bharat

'కాంటాక్ట్ ట్రేసింగ్'తో నిఫా పనిబట్టే యత్నాల్లో కేరళ

author img

By

Published : Sep 6, 2021, 1:30 PM IST

కేరళలో నిఫా వైరస్(Nipah Virus in kerala) మళ్లీ కలకలం సృష్టిస్తున్న వేళ.. వైరస్​ మూలాలను కనుగొనడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కాంటాక్ట్​ ట్రేసింగ్ ద్వారా నిఫా వైరస్​ వ్యాప్తి కట్టడికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వివిధ శాఖల సమన్వయంతో ముందుకెళ్తోంది.

nipah virus in keala
కేరళలో నిఫా వైరస్​

కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేరళలో నిఫా వైరస్​(Nipah Virus in kerala) వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో.. వైరస్​తో మృతి చెందిన బాలుడికి సన్నిహతంగా మెలిగిన వారిని(Virus contacts) గుర్తించే పనిలో ఆ రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది.​

కాంటాక్ట్​ ట్రేసింగ్​తో పాటు వైరస్​ మూలాలను కనుగొనడమే తమ ప్రధాన కర్తవ్యమని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్​ సోమవారం తెలిపారు. బాలుడితో సన్నిహతంగా మెలిగిన వారిలో.. 20 మందికి అత్యధిక ముప్పు పొంచి ఉండగా.. వారిలో ఏడుగురి నమూనాలను పుణెలో నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీకి పరీక్ష కోసం పంపామని చెప్పారు.

"బాలుడితో సన్నిహతంగా మెలిగిన వారిని గుర్తించడం అత్యంత ప్రధానమైన అంశం. ఇందుకోసం క్షేత్రస్థాయి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. అదే సమయంలో వైరస్ మూలాలను కనుగొనడం అంతే ప్రధానమైన విషయం. మృతి చెందిన బాలుడికే వైరస్​... మొదటిసారి సోకిందా లేదా అతడికి వైరస్​ ఎవరి నుంచి సోకింది? అనే విషయాన్ని కనుగొనాలి. ఆదివారం 188 మందిని గుర్తించాం. అయితే.. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. మేం ప్రతి ఒక్కరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం."

-వీణా జార్జ్​, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి.

వైరస్​ సోకిన తర్వాత బాలుడిని వివిధ ఆస్పత్రులకు అతని తల్లిదండ్రులు తరలించినందున.. అతడితో సన్నిహతంగా మెలిగిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని వీణా జార్జ్​ పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తికి అవకాశం ఉన్న నేపథ్యంలో మృతి చెందిన బాలుడి గ్రామమైన చాతమంగళం ప్రాంతంలో లాక్​డౌన్​ తరహా ఆంక్షలు విధించారు. బాలుడి ఇంటి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిని కంటెయిన్​మెంట్​ జోన్​గా ప్రకటించారు.

సమష్టి కృషితో..

నిఫా వైరస్​ ఎక్కడి నుంచి వ్యాపించిందో తెలుసుకునేందుకు కేరళలోని అన్ని శాఖలు సమష్టిగా కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా... పశుసంవర్ధక శాఖ అధికారులు వివిధ ఇతర శాఖల అధికారులతో కలిసి మృతి చెందిన బాలుడి గ్రామమైన ఛాతమంగళం ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. నిఫాతో మృతి చెందిన బాలుడి ఇంటి వద్దకు వెళ్లి, జబ్బుపడిన మేక నమూనాలను సేకరించనున్నారు. ఈ ప్రాంతంలో గబ్బిలాల సంచారం అధికంగా ఉందని అనుమానిస్తున్నారు.

కేంద్రం బృందం పర్యటన...

మరోవైపు.. నేషనల్​ సెంటర్​ ఫర్ డిసీజ్ కంట్రోల్​కు చెందిన ప్రత్యేక బృందం.. వైరస్​తో మృతి చెందిన బాలుడి ఇంటిని ఆదివారం సందర్శించింది. సదరు బాలుడికి వైరస్​ సోకినట్లు భావిస్తున్న పఝూర్​, మున్నూర్​ ప్రాంతాలను పరిశీలించింది.

మృతి చెందిన బాలుడి ఇంటిని సందర్శించిన అనంతరం.. బాలుడి కుటుంబానికి, చెరువాడి ప్రాంత ప్రజలకు కేంద్ర బృందం ముందుజాగ్రత్త సూచనలు చేసింది. పరిసర ప్రాంతాల నుంచి రాంబూటన్ పండ్లను సేకరించింది. ఈ పండ్లను తినడం ద్వారా బాలుడికి వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నందున వాటిని సేకరించినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: Nipah Virus: మళ్లీ నిఫా కలకలం.. ఆ గబ్బిలాలే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.