ETV Bharat / bharat

పాపం కాంగ్రెస్​.. యూపీలో 'సింగిల్​ డిజిట్​'తోనే...

author img

By

Published : Mar 10, 2022, 12:05 PM IST

Updated : Mar 10, 2022, 3:54 PM IST

Assembly elections: మినీ సార్వత్రికంగా మారిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్​ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిందా? ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా ఓటర్లను ఆకర్షించటంలో విఫలమైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓట్ల లెక్కింపులో ఏ ఒక్క రాష్ట్రంలోనూ కాంగ్రెస్​ మెరుగైన పరిస్థితిలో లేకపోవటమే అందుకు కారణం. అయితే, కాంగ్రెస్​ అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి? అందుకు ప్రధాన కారణాలేంటి?

Congress party
సోనియా, రాహుల్​ గాంధీ

Congress in UP: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ సత్తా చూపి అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని చెప్పిన కాంగ్రెస్​ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. కాళ్లకు చక్రాలు కట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగారు. అయినా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా మహిళా ఓటర్లపై దృష్టిసారించినా.. అంచనాలను అందుకోలేకపోయింది హస్తం పార్టీ. రైతు పోరాటాల నుంచి మహిళలపై దాడులు, లఖింపుర్​ ఖేరీ హింస వంటి అంశాలను లేవనెత్తుతూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా మొత్తం 403 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది కాంగ్రెస్​. అదే స్థాయిలో ప్రచారమూ నిర్వహించింది. కానీ, ఓట్ల లెక్కింపులో డీలాపడిపోయింది. సింగిల్​ డిజిట్​కే పరిమితమైంది.

పంజాబ్​లో కాంగ్రెస్​ను ముంచిన అంతర్గత కుమ్ములాట

Congress in Punjab: 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్​లో మొదటి నుంచే నేతల మధ్య విబేధాలు మొదలయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ మధ్య ప్రచ్ఛన యుద్ధమే నడిచింది. కొన్ని సందర్భాల్లో కెప్టెన్​పై బహిరంగంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు సిద్ధూ. అంతర్గత కలహాలు చిలికి చిలికి గాలివానగా మారి కెప్టెన్​ వేరుకుంపటి పెట్టేందుకు దారితీశాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్​ కొంప ముంచినట్లు స్పష్టమవుతోంది.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా చరణ్​జీత్​ సింగ్​ చన్నీని ప్రకటించి.. బలహీన వర్గాల ఓట్లను ఒడిసిపట్టాలన్న కాంగ్రెస్​ వ్యూహం బెడిసికొట్టింది. వెరసి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయే స్థితికి చేరింది కాంగ్రెస్​.

ఉత్తరాఖండ్​లో రెండోస్థానానికే..

Congress in Uttarakhand: ఉత్తరాఖండ్​ ఎన్నికల్లో భాజపాను గద్దె దించి అధికారం చేజిక్కించుకుంటామన్న కాంగ్రెస్​ కల.. కలగానే మిగిలింది. భాజపా జోరుతో మరోమారు ప్రతిపక్షానికే పరిమితమైంది. మొత్తం 70 స్థానాల్లో మెజారిటీకి కావాల్సిన స్థానాల్లో భాజపా దూకుడు ప్రదర్శించగా.. కాంగ్రెస్​ రెండో స్థానంలోనే ఉండిపోయింది.

రాష్ట్రంలో ప్రచార జోరు పెంచినప్పటికీ.. పార్టీలో అంతర్గత కలహాలు, అధిష్ఠానం తీరుపై మాజీ ముఖ్యమంత్రి హరీశ్​ రావత్​ అసంతృప్తి వ్యక్తం చేయటం వంటి అంశాలు కాంగ్రెస్​ను దెబ్బతీసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే.. హరీశ్​ రావత్​ నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్​ బొక్కబోర్లా పడింది.

మణిపుర్​లోనూ..

Congress in Manipur: మణిపుర్​లోనూ కాంగ్రెస్​ చతికిలపడిపోయింది. అధికార భాజపాను ఢీకొట్టటంలో విఫలమై రెండో స్థానానికే పరిమితమైంది. 60 స్థానాల అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన సీట్లను అందుకోలేకపోయింది. మరోమారు భాజపాకే అధికారం దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

గోవాలో నిలిచేనా?

Congress in Goa: ఉత్తర్​ప్రదేశ్​, ఉత్తరాఖండ్​, మణిపుర్​, పంజాబ్​ రాష్ట్రాల్లో చతికిలపడిన కాంగ్రెస్​.. గోవాలో భాజపాతో పోటీపడింది. నువ్వానేనా అన్నట్లు కనిపించింది. అయితే, అధికారం చేపట్టేందుకు కావాల్సిన మెజారిటీ స్థానాలను సాధించటంలో వెనకపడిపోయింది. 2017లో జరిగిన ఎన్నికల్లో త్రుటిలో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్​.. మరోమారు ప్రతిపక్షంలోనే కూర్చొనే అవకాశం ఉంది.

మహారాష్ట్రవాది గోమంతక్​ పార్టీ(ఎంజీపీ) మద్దతుతో అధికార భాజపా హ్యాట్రిక్​ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

దిల్లీలో కాంగ్రెస్​ శ్రేణుల నిరసన..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉంది కాంగ్రెస్​. అధికారంలో ఉన్న పంజాబ్​లో సైతం వెనకబడిపోయింది. దీంతో ఈవీఎం ట్యాంపరింగ్​ ఆరోపణలు చేస్తూ దిల్లీలోని పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు కాంగ్రెస్​ కార్యకర్తలు.

ఇదీ చూడండి: ఉత్తరాఖండ్​, మణిపుర్​లో భాజపా జోరు.. గోవాలో హోరాహోరీ

Last Updated :Mar 10, 2022, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.