ETV Bharat / bharat

క్షమించండి.. ఇలా అయినందుకు సిగ్గు పడుతున్నా: సీఎం

author img

By

Published : Jul 10, 2022, 2:03 PM IST

ఆత్మహత్య చేసుకున్న వ్యాపారవేత్త వినీత్ బగారియా కుటుంబాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పరామర్శించారు. వినీత్​ను కాపాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. వినీత్ రెండు రోజుల క్రితం మాఫియా నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లా పోలీసు యంత్రాంగం విఫలమైనందునే ఈ దారుణం జరిగిందని అన్నారు హిమంత బిశ్వ శర్మ.

assam cm apologise
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ క్షమాపణలు

మాఫియా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన వ్యాపారవేత్త, జంతు ప్రేమికుడు వినీత్ బగారియా(32) కుటుంబాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శనివారం పరామర్శించారు. బగారియాను కాపాడలేకపోయినందుకు క్షమాపణలు చెప్పారు. దిబ్రూగఢ్​లోని మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జిల్లా ఎస్​పీని మందలించారు. "ప్రజలకు స్నేహితుల్లా వ్యవహరించాలని పోలీసులకు మా ప్రభుత్వం అనేకసార్లు సూచించింది. దిబ్రూగఢ్​లాంటి ప్రాంతంలోనే పోలీసులు మా అభ్యర్థనను అర్థం చేసుకోలేకపోతే.. ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితి ఏంటి?" అని ప్రశ్నించారు హిమంత బిశ్వ శర్మ.

assam cm apologise
బగారియా కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

వినీత్ బగారియాను కాపాడలేకపోయినందుకు సిగ్గుపడుతున్నా. అమాయకులకు అండగా నిలబడడంలో జిల్లా పోలీసు యంత్రాంగం విఫలమైంది. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎల్లప్పుడూ ప్రజలకు పోలీసులు అండగా ఉండాలి. నేరస్థులతో పోలీసులు రాజీ పడొద్దు.

-అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

వినీత్​ వ్యవహారంలో నేరుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. భైదుల్లా ఖాన్, నిషాంత్ శర్మ అనే ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. కీలక సూత్రదారి సంజయ్ శర్మ కోసం గాలిస్తున్నారు.

రెండు రోజుల క్రితం వినీత్​ బగారియా షని మందిర్​ రోడ్డులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు ఓ వీడియోను తీశాడు. అందులో 'అమ్మా.. నన్ను క్షమించు. ఇక నేను ఈ వేధింపులను తట్టుకోలేను ' అని అన్నాడు.

assam cm apologise
ప్రకృతి ప్రేమికుడు వినీత్ బగారియా కుటుంబ సభ్యులకు అసోం సీఎం పరామర్శ

"నాకు ఒక్కడే కుమారుడు. అతడిని కోల్పోయాను. నా భర్త, కొడుకు ఇద్దరికీ సంజయ్ శర్మ, అతని అనుచరుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశాం. భద్రత కల్పించమని కోరాం. అయితే భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఇప్పుడు చనిపోయిన నా కుమారుడ్ని పోలీసులు తీసుకురాగలరా?".

-వినీత్ బగారియా తల్లి

ఇవీ చదవండి: తీర్పు పేరిట ఉన్మాదం.. ఓ వ్యక్తి సజీవ దహనం.. దోషి అంటూ గ్రామస్థుల 'శిక్ష'!

సర్వశ్రేష్ఠుడు సర్వేపల్లి... విద్యావేత్త.. దౌత్యవేత్త.. రాష్ట్రపతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.