ETV Bharat / bharat

'గోగ్రా హైట్స్​ నుంచి భారత్​, చైనా బలగాల ఉపసంహరణ'

author img

By

Published : Aug 6, 2021, 5:05 PM IST

Updated : Aug 6, 2021, 5:40 PM IST

Corps Commander talks
లద్దాఖ్​లోని కీలక ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణ

సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వెంబడి, తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించుకునే దిశగా మరో అడుగు పడింది. 12వ కోర్‌ కమాండర్‌ స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందం మేరకు గోగ్రా హైట్స్‌ ప్రాంతం నుంచి భారత్‌, చైనా బలగాలను ఉపసంహరించాయి. తమ తమ శాశ్వత స్థావరాలకు సైనికులను తరలించి గత ఏడాది మే ముందు నాటి పరిస్థితిని అక్కడ నెలకొల్పాయి. ఆగస్టు 4,5వ తేదీల్లో ఈ ప్రక్రియ పూర్తైనట్లు భారత సైన్యం వెల్లడించింది.

తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద భారత్‌, చైనా మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్ఠంభనను పరిష్కరించుకునే దిశగా మరో అడుగు పడింది. ఇప్పటికే పాంగాంగ్‌ సరస్సు ప్రాంతంలో ఎదురెదురుగా నిలిచిన బలగాలను ఉపసంహరించుకున్న ఇరు దేశాలు గోగ్రా ప్రాంతం వద్ద కూడా అదే బాటలో పయనించాయి. చైనా భూభాగంలో ఉన్న మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద గత శనివారం ఇరు దేశాల కోర్‌ కమాండర్ల మధ్య 12వ విడత చర్చలు జరిగాయి. దాదాపు 9 గంటల పాటు సాగిన ఈ భేటీలో గోగ్రా హైట్స్‌ నుంచి బలగాలను వెనక్కి మళ్లించేందుకు ఇరు దేశాలు పరస్పర అంగీకారం తెలిపాయి. ఈ ఒప్పందం మేరకు గోగ్రా ప్రాంతంలో భారత్‌, చైనా తమ బలగాలను ఉపసంహరించి తమ తమ శాశ్వత స్థావరాలకు చేరుకున్నాయి. సైనిక ప్రతిష్ఠంభన నెలకొన్న ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలను కూలగొట్టాయి.

గత ఏడాది మే నుంచి గోగ్రా ప్రాంతంలో భారత్‌-చైనా సైన్యాలు ఎదురెదురుగా ఉన్నాయి. ఒప్పందం మేరకు ఇరు దేశాలు దశల వారీగా బలగాల ఉపసంహరణ ప్రక్రియ చేపట్టాయి. అక్కడ నిర్మించిన తాత్కాలిక నిర్మాణాలను తొలగించాయి. గత ఏడాది మే నెలకు ముందు అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో మళ్లీ అలాంటి స్థితిని నెలకొల్పాయి. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చరాదని ఇరుపక్షాలు నిర్ణయించాయి. తాజా చర్యలతో మరొక ప్రాంతంలో ఉద్రిక్తతలు చల్లారినట్లు అయ్యింది. పశ్చిమ సెక్టార్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రతిష్టంభన తొలగించే దిశగా సంప్రదింపులు కొనసాగించాలని భారత్‌-చైనా నిర్ణయం తీసుకున్నాయి. పశ్చిమ సెక్టార్‌లోని వాస్తవాధీన రేఖ వద్ద దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు, శాంతి, సామరస్యాలు నెలకొల్పేందుకు భారత సైన్యం, ఐటీబీపీ కట్టుబడి ఉందని భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది.

అయితే ఘర్షణకు కేంద్ర బిందువుగా ఉన్న హాట్‌స్ప్రింగ్స్‌ ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణపై భారత్‌, చైనా మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం.

తూర్పు లద్దాఖ్‌లో గత ఏడాది మే నెల నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగి, వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు పక్షాలూ భారీగా సైన్యాలను మోహరించాయి. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్‌, చైనా మధ్య పలుమార్లు సైనిక, దౌత్య పరమైన చర్చలు జరిగాయి. వీటికి అనుగుణంగా పాంగాంగ్‌ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. తాజాగా గోగ్రా వద్ద కూడా ఆ ప్రక్రియ పూర్తైంది.

ఇదీ చూడండి: భారత్‌-చైనా మధ్య 12వ విడత చర్చలు షురూ

Last Updated :Aug 6, 2021, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.