ETV Bharat / bharat

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడి ఫొటోలు.. ప్రధానిని కోరిన దిల్లీ సీఎం

author img

By

Published : Oct 26, 2022, 1:57 PM IST

aravind kejriwal on indian currency
కొత్త కరెన్సీ నోట్లపై దేవుడు ఫొటోలు

కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశుడు ఫొటోలు చేర్చాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అలా దేవుడి చిత్రాలు ముద్రించినప్పుడే.. దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై భాజపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

దేశంలో కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై ఒకవైపు గాంధీ బొమ్మ మరో వైపు.. దేవుడి చిత్రాలు ఉంచాలని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్​ ప్రధానిని కోరారు. ఈ విషయంపై తాను ఒకటి లేదా రెండు రోజుల్లో మోదీకు లేఖ రాస్తానని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని.. దేశం అభివృద్ధి చెందాలంటే దేవుడి చిత్రాలను కరెన్సీపై ముంద్రించాలని అన్నారు కేజ్రీవాల్.

"మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. దేవతల ఆశీర్వాదం లేకపోతే ప్రయత్నాలు ఫలించవు. మన కరెన్సీపై గణేశుడు, లక్ష్మీదేవి ఫొటోలు ఉండాలని నేను ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. కరెన్సీపై దేవుడు చిత్రాలు ఉంటే.. మన దేశం అభివృద్ధి మార్గంలో చెందడంలో ఉపయోగపడుతుంది. దీనిపై ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రధానమంత్రికి లేఖ రాస్తాను" అని అన్నారు కేజ్రీవాల్. "ముస్లిం దేశంమైన ఇండోనేషియా తమ కరెన్సీపై.. గణేశుడు ఫొటోని ముద్రించింది. మనం ఎందుకు చేయలేము?.. ఇకపై కొత్తగా ప్రింట్​ చేసే నోట్లపై గణేశుడు ఫొటో ముద్రించాలి" అని కోరారు. భారత ఆర్థిక వ్యవస్థ సరైన స్థితిలో లేదని విచారం వ్యక్తం చేశారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల.. దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు. "భారతదేశం సంపన్న దేశంగా ఉండాలని, ఇక్కడి ప్రతీ కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉండాలని మనందరం కోరుకుంటున్నాం. దేశంలో పెద్ద ఎత్తున పాఠశాలలు, ఆస్పత్రులు తెరవాలి" అని అన్నారు.

దిల్లీలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ పూర్తి సిద్ధంగా ఉందని తెలిపారు కేజ్రీవాల్. దేశ రాజధానిలోని ప్రజలు భాజపాను తిరస్కరిస్తారని జోస్యం చెప్పారు. గత 27 ఏళ్లగా గుజరాత్​లో అధికారంలో ఉన్న భాజపా అక్కడ చేసిన ఒక్క మంచి చెప్పాలని డిమాండ్ చేశారు.
అయితే కరెన్సీ నోట్ల విషయంలో కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యాలను భాజపా నేతలు తప్పుబట్టారు. గుజరాత్ ఎన్నికల్లో.. పరువు కాపాడుకునేందుకే కొత్త ఎత్తుగడలు వేస్తున్నారని భాజపా ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.