ETV Bharat / bharat

అమెరికా, ఆస్తులు వదిలి జాతీయోద్యమంలో ఆపిల్ మ్యాన్​

author img

By

Published : Sep 6, 2021, 7:20 AM IST

శామ్యూల్‌ స్టోక్స్‌ ఉరఫ్‌ సత్యానంద స్టోక్స్‌
శామ్యూల్‌ స్టోక్స్‌ ఉరఫ్‌ సత్యానంద స్టోక్స్‌

చాలామంది విదేశీయులూ భారత స్వాతంత్య్రోద్యమానికి పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతిచ్చారు. కానీ ఓ సంపన్నుడైన అమెరికన్‌ ఇక్కడికి వచ్చి.. పరిస్థితులను చూశాక అమెరికానూ, తన ఆస్తిపాస్తులనూ వదులుకొని.. చివరకు జాతీయోద్యమంలో అరెస్టయ్యారు కూడా! ఆయనే యాపిల్‌ మ్యాన్‌ శామ్యూల్‌ స్టోక్స్‌ ఉరఫ్‌ సత్యానంద స్టోక్స్‌! జాతీయోద్యమంలో అరెస్టయిన ఏకైక అమెరికన్‌ ఆయనే!

భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన బ్రిటీష్ వారిని తరిమికొట్టే మహాక్రతువులో అనేకమంది తమ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిలో విదేశీయులూ అనేకమంది ఉన్నారు. యాపిల్‌ మ్యాన్‌ స్టోక్స్‌ అనే అమెరికా వాసి భారత జాతీయోద్యమంలో పాల్గొని తనవంతు సహకారాన్ని అందించారు. శామ్యూల్‌ స్టోక్స్‌ అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన సంప్రదాయ క్రిస్టియన్‌ కుటుంబంలో పుట్టారు. వారికి లిఫ్ట్‌ల తయారీ వ్యాపారం ఉండేది. బాగా సంపన్న కుటుంబం. స్టోక్స్‌ మాత్రం వ్యాపారం వైపు కాకుండా దాతృత్వంవైపు మళ్లారు. ఫలితంగా మిషనరీ యాత్రలో భాగంగా 22 ఏళ్ల వయసులో శిమ్లా సమీపంలో కుష్ఠురోగులకు సేవ చేయటానికి భారత్‌కు వచ్చారు.

కానీ.. కుష్ఠురోగులు, స్థానిక ప్రజలు ఆయనతో అంతగా మమేకం కాలేకపోయారు. కారణం తన అమెరికన్‌ వేషధారణ, భాష.. అని గుర్తించిన స్టోక్స్‌ క్రమంగా భారతీయ దుస్తుల్లోకి మారి స్థానిక భాష నేర్చుకోవటం ఆరంభించారు. తద్వారా వారికి దగ్గరయ్యారు. ఇక్కడే పుట్టి పెరిగిన ఆంగ్లో ఇండియన్‌ ఆగ్నెస్‌ను పెళ్లాడి, హిమాచల్‌లోనే భూమి కొనుక్కొని స్థిరపడ్డారు. 1916లో అమెరికా వెళ్లి వచ్చిన ఆయన అక్కడి లూసియానా రాష్ట్రంలోని యాపిల్‌ పండ్ల పంటకు హిమాచల్‌ వాతావరణం కూడా అనువైందని భావించి.. ఆ మొక్కలను దిగుమతి చేయించారు. తన ఇంటిలోనే ప్రయోగాత్మకంగా వేసి చూశారు. అది విజయవంతం కావటంతో ప్రజలందరినీ యాపిల్‌ పండ్ల పంట వైపు ప్రోత్సహించారు. అలా హిమాచల్‌ప్రదేశ్‌కు యాపిల్‌ను పరిచయం చేసిన ఘనత స్టోక్స్‌దే! తనకున్న పరిచయాలతో దిల్లీకి వాటిని ఎగుమతి చేయించి.. స్థానికులకు మంచి లాభాలు తెచ్చి పెట్టారు. పూర్తిగా భారత్‌లో మమేకమైన స్టోక్స్‌ జాతీయోద్యమంలోకి కూడా ప్రవేశించారు. గాంధీజీ పిలుపందుకొని ప్రజల కోసం నిలబడ్డారు.

అప్పట్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో వెట్టిచాకిరీ ఎక్కువగా ఉండేది. తెల్లవారు వచ్చినప్పుడు స్థానిక రైతులు తమ పనులు వదులుకొని నెలల తరబడి వారికి ఉచితంగా సేవలు చేయాల్సి వచ్చేది. దీనికి వ్యతిరేకంగా స్టోక్స్‌ పోరాటం చేశారు. పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ వెట్టికూలీ పద్ధతిని రద్దు చేసింది. జలియన్‌వాలాబాగ్‌ దుర్ఘటన తర్వాత కదలిపోయిన స్టోక్స్‌.. 1921లో వేల్స్‌ చక్రవర్తి భారత్‌ రాకను నిరసిస్తూ ఆందోళన చేశారు. దీంతో ఆయనపై బ్రిటిష్‌ ప్రభుత్వం రాజద్రోహం నేరం మోపి వాఘా వద్ద అరెస్టు చేసింది.

లాహోర్‌ జైలులో ఆరు నెలలు ఉంచింది. అలా జాతీయోద్యమంలో అరెస్టయిన తొలి అమెరికన్‌ ఆయనే! అనంతరం శామ్యూల్‌ స్టోక్స్‌ హిందూమతం స్వీకరించి సత్యానంద స్టోక్స్‌గా మారారు. తన పిల్లలను కూడా ఆంగ్లో ఇండియన్లుగా కాకుండా హిందువులుగానే పెంచారు. భారత స్వాతంత్య్రం కోసం ఎంతో తపించిన స్టోక్స్‌, ఆ బంగారు క్షణాలు చూడకుండానే.. 1946 మే 14న అనారోగ్యంతో మరణించారు. ఆయన సేవలు చాలామందికి తెలియకున్నా.. హిమాచల్‌ ప్రదేశ్‌ మాత్రం ఇప్పటికీ 'యాపిల్‌ మ్యాన్‌'గా గుర్తుంచుకుంది!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.