ETV Bharat / bharat

అమర్‌నాథ్‌ వరద బీభత్సం.. 15 మంది మృతి.. 40 మంది గల్లంతు

author img

By

Published : Jul 9, 2022, 6:12 AM IST

Updated : Jul 9, 2022, 9:09 AM IST

అమర్​నాథ్​ క్షేత్రానికి సమీపంలో వరద బీభత్సం సృష్టించింది. యాత్రికులకు ఆహారం అందించేందుకు ఏర్పాటుచేసిన 3 వంటశాలలు, 25 గుడారాలు కూడా ధ్వంసమయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది యాత్రికులేనని తెలుస్తోంది. ఈ విపత్తులో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. 40 మందికిపైగా గల్లంతయ్యారు.

అమర్​నాథ్
అమర్​నాథ్

దక్షిణ కశ్మీర్‌ హిమాలయాల్లోని అమర్‌నాథ్‌ క్షేత్రానికి సమీపంలో శుక్రవారం అకస్మాత్తుగా వరద బీభత్సం సృష్టించింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో వరద పోటెత్తింది. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15కు చేరింది. మరో 40 మందిదాకా గల్లంతైనట్లు క్షేత్రస్థాయి అధికారి ఒకరు తెలిపారు. కొండల పైనుంచి భారీఎత్తున వర్షపు నీరు ముంచెత్తింది. కొండలపైనుంచి పెద్ద ఎత్తున రాళ్లు, బురద కొట్టుకొచ్చాయి. ప్రవాహ ఉద్ధృతికి అమర్‌నాథ్‌ క్షేత్రానికి సమీపంలోని బేస్‌ క్యాంప్‌ దెబ్బతింది. యాత్రికులకు ఆహారం అందించేందుకు ఏర్పాటుచేసిన 3 వంటశాలలు, 25 గుడారాలు కూడా ధ్వంసమయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది యాత్రికులేనని తెలుస్తోంది. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు, కేంద్ర బలగాలు, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు వ్యక్తులను కాపాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.

.

ఆకస్మిక విపత్తు పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమ్మూ-కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో మాట్లాడి ప్రధాని మోదీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, వరద తాకిడికి గురైన వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అమర్‌నాథ్‌ యాత్ర త్వరలోనే తిరిగి ప్రారంభమవుతుందన్న ఆశాభావాన్ని రాష్ట్రపతి వ్యక్తంచేశారు. కాగా తక్షణ సహాయక చర్యలకు కేంద్ర బలగాలు, జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగానికి హోంమంత్రి అమిత్‌ షా ఆదేశాలిచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు, సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సిన్హా చెప్పారు. కుటుంబ సభ్యులతో అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన గోషామహల్‌ ఎమ్మెల్యే, తెలంగాణ భాజపా శాసనసభాపక్ష నేత రాజాసింగ్‌లోథ్‌ విపత్తు ప్రాంతం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సహాయక చర్యలు పూర్తయిన అనంతరం యాత్ర పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత 43 రోజుల అమర్‌నాథ్‌ యాత్ర జూన్‌ 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే.

తాజా విపత్తు నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగం ప్రత్యేక సహాయక కేంద్రాన్ని (హెల్ప్‌లైన్‌) ఏర్పాటు చేసింది. శ్రీ అమర్‌నాథ్‌ క్షేత్రం బోర్డుతో కలిసి విపత్తుకు సంబంధించి సమాచారాన్ని అందించేందుకు 4 ఫోన్‌ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వివరాలు: 011-23438252, 011-23438253 (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), 0194-2496240 (కశ్మీర్‌ డివిజన్‌ హెల్ప్‌లైన్‌), 0194-2313149 (బోర్డు)

.

ఉత్తరాఖండ్‌లో 9 మంది దుర్మరణం

నైనీతాల్‌: ఉత్తరాఖండ్‌లో వరద ఉద్ధృతికి ఓ కారు కొట్టుకుపోయిన ప్రమాదంలో శుక్రవారం 9 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఆరుగురు మహిళలున్నారు. నైనీతాల్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ధేలా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పర్యాటకులతో కూడిన కారు ఉదయం పంజాబ్‌కు తిరిగి వెళుతున్న సమయంలో రాంనగర్‌ ప్రాంతంలో నదిపై ఉన్న వంతెన వద్ద నీటిలో కొట్టుకుపోయింది. మృతులు దిల్లీ, పంజాబ్‌, పాటియాలా, రామ్‌నగర్‌లకు చెందినవారుగా గుర్తించారు.

.

ఇదీ చూడండి: భారత్​పై 'సైబర్​ వార్'.. 2,000 వెబ్​సైట్లు హ్యాక్.. నుపుర్ వ్యాఖ్యలే కారణమట!

Last Updated :Jul 9, 2022, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.