ETV Bharat / bharat

'దళపతి' విజయ్​ పొలిటికల్ ఎంట్రీ! ఎన్నికలపై ఫ్యాన్స్​తో చర్చ.. త్వరలోనే పాదయాత్ర!!

author img

By

Published : Jul 12, 2023, 2:21 PM IST

Actor Vijay Political Entry : తమిళ స్టార్ హీరో విజయ్​ రాజకీయ రంగప్రవేశం చేయనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాలతో సమావేశం, టెన్త్​, ఇంటర్​ టాపర్ల అభినందన సభ.. ఇలా వివిధ రకాల కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు విజయ్.

actor vijay political entry
actor vijay political entry

Actor Vijay Political Entry : సినిమా నటులు.. రాజకీయ నాయకులుగా మారడం కొత్తేమీ కాదు. తమిళనాడులో అయితే.. ఇది చాలా సర్వ సాధారణ విషయం. ఆనాడు కరుణానిధి, ఎంజీఆర్​, జయలలిత నుంచి మొదలుకుంటే నేటి కమల్​ హాసన్​ వరకు అనేక మంది నటులు.. రంగుల ప్రపంచాన్ని పక్కన పెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ నేపథ్యంలోనే వీరిని అనుసరిస్తూ మరో నటుడు, తమిళ స్టార్ హీరో 'దళపతి' విజయ్​ కూడా రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈమధ్య కాలంలో ఆయన చేసే కార్యక్రమాలు కూడా వీటికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవలె తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా టెన్త్‌, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలతో పాటు అభిమానులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం ఖాయమనే అనిపిస్తోందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ఇటీవల హీరో విజయ్​ తన అభిమాన సంఘం 'విజయ్‌ మక్కళ్ ఇయక్కం' (VMI) సభ్యులతో తరచూ భేటీ అవుతున్నారు. తాజాగా మంగళవారం కూడా వారితో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన సభ్యులతో పనైయూర్​లోని ఫామ్​హౌస్​లో సమావేశమయ్యారు. 2026లో జరిగే ఎన్నికలకు ఎలా సన్నద్ధం అవ్వాలన్న అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న విజయ్​.. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తోంది. ఇందుకోసం రెండు సంవత్సరాలు సినిమాలకు విరామం ప్రకటించి.. పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

actor vijay political entry
సమావేశానికి వస్తున్న నటుడు విజయ్​

పాదయాత్రకు సన్నద్ధత!
మరోవైపు కొన్ని రోజుల్లో పాదయాత్ర కూడా చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన నటించిన తాజా చిత్రం 'లియో' విడుదల కంటే ముందే తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. లియో చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈలోపు విజయ్‌ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.

ఆ వ్యాఖ్యలు ఎంట్రీ కోసమేనా!
అంతకుముందు విద్యార్థులతో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన విజయ్​.. ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది వ్యక్తులు డబ్బు తీసుకుని ఎన్నికల్లో ఓటు వేయడాన్ని విజయ్ తీవ్రంగా తప్పుబట్టారు. డబ్బు తీసుకుని ఓటు వేయడం చాలా తప్పని.. ఈ విషయాన్ని విద్యార్థులే తమ తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. " భవిష్యత్తు ఓటర్లు మీరే.. భవిష్యత్తు నాయకులను ఎన్నుకోవాల్సిందీ మీరే. ఈ రోజుల్లో సమాజం ఎలా మారిందంటే.. డబ్బు ఇచ్చినవాళ్లకే కొంతమంది ఓట్లు వేస్తున్నారు. ఒక వ్యక్తి ఓటు కోసం అధిక మొత్తంలో డబ్బు ఇస్తున్నారంటే.. గతంలో వారు ఎంత డబ్బు సంపాదించారో అర్థం చేసుకోండి. కాబట్టి, డబ్బు తీసుకుని ఓటు వేయొద్దని విద్యార్థులందరూ వారి తల్లిదండ్రులకు చెప్పండి. అలా జరిగితే అందరికీ ఉన్నత విద్య అందుతుంది. ఇక, ప్రస్తుతం ఉన్న యుగంలో సోషల్‌ మీడియా వేదికగా కొంతమంది ఫేక్‌న్యూస్‌లు సృష్టిస్తుంటారు. వాటి వెనుక కొన్ని అజెండాలు కూడా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవడం కోసం పెరియార్‌, అంబేడ్కర్‌ వంటి గొప్ప నాయకుల పుస్తకాలు చదవాలి" అని విజయ్‌ చెప్పారు.

ఇవీ చదవండి : 11 ఏళ్ల తర్వాత మరోసారి శంకర్-విజయ్.. 'పాలిటిక్స్'​ కన్ఫామేనా?

పాలిటిక్స్​పై దళపతి విజయ్ కీలక వ్యాఖ్యలు.. ఆ స్టూడెంట్​కు గిఫ్ట్​గా గోల్డెన్​ నెక్లెస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.