న్యాయానికి తెలుగు దివిటీ, అందరినీ ఆకట్టుకున్న సీజేఐ పనితీరు

author img

By

Published : Aug 25, 2022, 7:26 AM IST

nv ramana

భారత న్యాయ వ్యవస్థలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో తెలుగు తేజంగా చరిత్ర పుటల్లో స్థానం దక్కించుకున్న జస్టిస్‌ ఎన్​వీ రమణ, తనపై ప్రజల అంచనాలను అందుకునేందుకు అహర్నిశలు శ్రమించారు. న్యాయ వ్యవస్థను వేధిస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన మార్గాలూ సూచించారు. తన పరిధిలోని అంశాలను వేగంగా పరిష్కరించి చూపి భావి సీజేఐలకు మార్గదర్శిగా మారిన ఆయన ఆగస్టు 26న పదవీవిరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఆయన చేసిన విశేష కృషిపై ప్రత్యేక కథనం.

అచ్చ తెలుగు రూపం.. హుందాతనానికి ప్రతిరూపం..
మాటల్లో స్పష్టత.. చేతల్లో కచ్చితత్వం..
ప్రజాహిత కాంక్ష.. సత్వర న్యాయ ఆకాంక్ష..
వాస్తవికవాది.. మధ్యవర్తిత్వ అభిలాషి..

CJI NV Ramana: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ గురించి తలచుకున్న వెంటనే గుర్తుకొచ్చే కొన్ని లక్షణాలివి. 48వ సీజేఐగా గత ఏడాది ఏప్రిల్‌ 24న బాధ్యతలు చేపట్టిన ఆయన.. 16 నెలల పదవీకాలంలో జనహితమే ధ్యేయంగా పలు కీలక తీర్పులు, ఉత్తర్వులు వెలువరించారు. న్యాయ వ్యవస్థలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించారు. ప్రజలకు న్యాయం వేగంగా అందేలా న్యాయమూర్తుల నియామకాలను జోరుగా చేపట్టారు. సీజేఐగా ఆయన పదవీకాలం శుక్రవారంతో ముగియనుంది.

సంస్కరణలకు నడుం బిగించి..
"అమెరికా సుప్రీంకోర్టులోని 9 మంది న్యాయమూర్తులు ఏటా సగటున 81 కేసులను పరిష్కరిస్తుంటే.. భారత్‌లో న్యాయమూర్తులు ఏటా సగటున 2,600 కేసుల్లో తీర్పు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన జడ్జీలు ఇక్కడి పనితీరును చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి ఒత్తిడి వాతావరణంలో ఎలా పనిచేస్తున్నారని అడుగుతున్నారు. మా శక్తివంచన లేకుండా పనిచేస్తున్నాం కాబట్టే ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంచుతున్నారు. న్యాయమూర్తుల సంఖ్య పెంపు గురించి ఎన్నిచోట్ల ఎంతమంది మాట్లాడినా.. పురోగతి శూన్యం"

2016 ఏప్రిల్‌ 24న విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో అప్పటి సీజేఐ జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకుర్‌ చేసిన వ్యాఖ్యలివి. న్యాయమూర్తులపై పనిభారం ఎంతగా ఉందో వివరిస్తూ నాటి సమావేశంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు, సహచర న్యాయమూర్తుల ముందే ఆయన కన్నీరుపెట్టుకోవడం సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆ సమావేశంలో పాల్గొన్న జస్టిస్‌ రమణ.. జస్టిస్‌ ఠాకుర్‌ ఆవేదనను కళ్లారా చూశారు. కక్షిదారులకు సకాలంలో న్యాయం అందకపోవడానికి, న్యాయమూర్తులపై పనిభారం విపరీతంగా పెరిగిపోతుండటానికి.. ఖాళీలు, మౌలికవసతుల కొరతే ప్రధాన కారణమని ఆయనకు ముందునుంచీ తెలుసు. అందుకే తాను సీజేఐ పీఠమెక్కాక ఆ రెండు అంశాలపై బాగా దృష్టిసారించారు. వ్యవస్థను సంస్కరించేందుకు నడుం బిగించారు.

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

జోరుగా నియామకాలు
జస్టిస్‌ రమణ సీజేఐ పీఠమెక్కాక ఇప్పటివరకు సుప్రీంకోర్టు కొలీజియం 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు 250 మందికిపైగా హైకోర్టు జడ్జీలను నియమించింది. 15 హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకాన్ని పూర్తిచేసింది. తద్వారా ఖాళీల భర్తీ విషయంలో జస్టిస్‌ రమణ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆయన నేతృత్వంలో కొలీజియం.. ఖాళీల భర్తీలో సామాజిక, లింగ సమతౌల్యతకు పెద్దపీట వేసింది. గతంలో ఎన్నడూలేనంత ఎక్కువగా సర్వోన్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తులకు అవకాశం కల్పించింది. వారిలో ఒకరు 2027లో తొలి మహిళా సీజేఐగా బాధ్యతలు చేపట్టేందుకు బాటలు వేసింది.

జనంతో మమేకం
ఇంతకుముందు పనిచేసిన సీజేఐలతో పోలిస్తే జస్టిస్‌ రమణ సుప్రీంకోర్టు తలుపులను ప్రజలకు మరింత బార్లా తెరిచారు. ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా ప్రజల మనసులను తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. తనకు వచ్చే ఉత్తరాలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని సాధారణ ప్రజలకు చేరువ చేసేందుకు కృషిచేశారు. హక్కులు, రాజ్యాంగం పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తే.. వారే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారన్న నమ్మకంతో ప్రజాచైతన్యానికి ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చారు.

న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షప్రసారం చేయడం, కోర్టుల్లో రోజువారీ విచారణలను పాత్రికేయులకు అందుబాటులో ఉంచడం కోసం ప్రత్యేక యాప్‌ను ఏర్పాటుచేయడం, కొత్తగా నిర్మించిన ఛాంబర్లను న్యాయవాదులకు కేటాయించడం, సుప్రీంకోర్టు ఆడిటోరియాన్ని బార్‌ అసోసియేషన్‌ సభ్యులు వాడుకునేందుకు అవకాశం కల్పించడం.. ఎన్నాళ్లనుంచో పెండింగులో ఉన్న ఈ పనులన్నీ జస్టిస్‌ రమణ చొరవ వల్లే ఫలించాయి. ఈ చర్యల ద్వారా వ్యవస్థను అందరికీ దగ్గర చేసే ప్రయత్నం చేశారాయన.

సాంకేతికతను అందిపుచ్చుకొని..
కరోనా ప్రభావం కారణంగా కోర్టులు భౌతికంగా నడవలేని పరిస్థితులు చాన్నాళ్లు నెలకొన్నప్పటికీ జస్టిస్‌ రమణ నీరుగారిపోలేదు. సాంకేతికతను అందిపుచ్చుకొని వ్యవస్థను ముందుకు నడిపించారు. గత 16 నెలల్లో కేవలం 55 రోజులే కోర్టులు భౌతికంగా నడిచే పరిస్థితులు నెలకొనడం.. గత ఏడాది కాలంలో కేసుల కొండ పెరిగిపోవడానికి కారణమైందని ఆయన ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పేర్కొన్నారు. కేసుల పరిష్కారంపై ప్రజలు ఎక్కువ ఆశలు పెట్టుకోవడం సహజమేనని, దురదృష్టవశాత్తు పరిస్థితులు సహకరించకపోవడంతో వారి ఆశలను పూర్తిస్థాయిలో సాకారం చేయడం సాధ్యం కాలేదని చెప్పారు.

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ
జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

జస్టిస్‌ రమణ సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. మధ్య తరగతివారి కష్టాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే సత్వర న్యాయం అందించడం ద్వారా వారిని ఆదుకోవాలని తపించారు. అందుకోసం మధ్య వర్తిత్వాన్ని ఎంచుకోవాలని పదేపదే చెబుతూ.. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికల వైపు కూడా ప్రజలను మళ్లించే ప్రయత్నం చేశారు.

జస్టిస్‌ రమణ చొరవతో వెలువడిన కొన్ని కీలక ఉత్తర్వులివీ..

  • దేశాన్ని కుదిపేసిన పెగాసస్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రజల వ్యక్తిగత గోప్యత హక్కును పరిరక్షించాలన్న సంకల్పం ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా కనిపించింది.
  • రాజద్రోహ సెక్షన్‌ను ప్రభుత్వాలు సామాన్యులపై ఇష్టారీతిన ప్రయోగించకుండా గత మే నెలలో సర్వోన్నత న్యాయస్థానంలో మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. 'సెక్షన్‌ 124ఎ’ని కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించేంతవరకూ దానికింద ఎఫ్‌ఆఐర్‌లు నమోదు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనం పాటించాలని అందులో ఆదేశించారు. దానికింద పెట్టిన కేసుల కారణంగా జైళ్లలో మగ్గుతున్నవారు బెయిలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని స్పష్టతనిచ్చారు. సెక్షన్‌ 124ఎ కింద పెండింగ్‌లో ఉన్న విచారణలు, అప్పీళ్లు, నమోదుచేసిన అభియోగాలన్నింటినీ నిలిపివేయడం ద్వారా ప్రజల స్వేచ్ఛకు పట్టం కట్టారు.
  • కోర్టులు బెయిలు మంజూరు చేసినా.. ఆ ఉత్తర్వులు అందలేదన్న కారణంతో ఖైదీల విడుదలలో తాత్సారాన్ని నివారించడానికి 'ఫాస్టర్‌' పేరుతో సురక్షితమైన ఎలక్ట్రానిక్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి దీర్ఘకాల సమస్యకు తెరదించారు.
  • కఠినమైన యూఏపీఏ చట్టం కింద అరెస్టయిన ఓ కేరళ పాత్రికేయుడికి దిల్లీలో వైద్య సేవలు అందించాలని జస్టిస్‌ రమణ ఆదేశించారు. విచారణలో ఉన్నవారికి కూడా జీవించే ప్రాథమిక హక్కు ఉంటుందని స్పష్టం చేశారు.
  • ఝార్ఖండ్‌లో ధన్‌బాధ్‌ అదనపు జిల్లా జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను పట్టపగలు ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటనను సుమోటోగా తీసుకొని సీబీఐ దర్యాప్తునకు సీజేఐ జస్టిస్‌ రమణ ఆదేశించారు. ఆ దారుణానికి పాల్పడినవారికి ఏడాది కంటే తక్కువ సమయంలోనే శిక్ష ఖరారయ్యేలా చేశారు. తద్వారా న్యాయవ్యవస్థలోని వ్యక్తుల్లో ధైర్యం నింపారు.
  • శివసేన చీలిక కేసును రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించి.. న్యాయం చేయడంలో పొరపాట్లను పరిహరించేందుకు ప్రయత్నించారు.
  • కరోనా సమయంలో జస్టిస్‌ రమణ ఓ కేసును సుమోటోగా తీసుకొని ఆక్సిజన్‌ సరఫరా, టీకా ధరల విషయంలో జోక్యం చేసుకున్నారు. ఫలితంగా ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకొని 18 ఏళ్ల వయసు దాటినవారందరికీ ఉచిత వ్యాక్సిన్‌ను ప్రకటించాల్సి వచ్చింది. ఆ సమయంలో కోర్టు జోక్యాన్ని మెచ్చుకుంటూ కేరళకు చెందిన లిడ్వినా జోసెఫ్‌ అనే 5వ తరగతి బాలిక సీజేఐకి లేఖ రాయడం.. ఆయన హయాంలో సామాన్యులపై సుప్రీంకోర్టు పనితీరు చూపిన ప్రభావానికి అద్దంపట్టింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన వైష్ణవి అనే 8వ తరగతి అమ్మాయి తమ ఊరికి బస్సు కోసం సీజేఐ జస్టిస్‌ రమణకు లేఖ రాయడం కూడా ఆయన పనితీరు సామాన్యుల్లోకి వెళ్లిందని చెప్పేందుకు నిదర్శనం.

విస్తృతంగా మౌలిక వసతులు
జస్టిస్‌ రమణ న్యాయ వ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు బాగా ప్రాధాన్యమిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో రూ.310 కోట్లతో కొత్త కోర్టు భవన నిర్మాణానికి పునాదిరాయి వేశారు. తెలంగాణలో 32 జిల్లా కోర్టులను ప్రారంభించారు. తిరుపతిలో ఎర్రచందనం కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులకు శ్రీకారం చుట్టారు. విజయవాడలో రూ.100 కోట్లతో నిర్మించిన కొత్త కోర్టు సముదాయాన్ని ప్రారంభించారు. ఝార్ఖండ్‌లో రెండు జిల్లాల్లో సబ్‌డివిజన్‌ కోర్టులను ప్రారంభించారు. ఇవన్నీ మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆయన చేసిన కృషికి కొన్ని ఉదాహరణలే.

తెలుగు రాష్ట్రాలకు సహకారం
జస్టిస్‌ రమణ తెలుగు రాష్ట్రాలకు తనవంతు సహకారం అందిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఆయన ఏర్పాటుచేశారు. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 37కు మించి పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆ సంఖ్య అక్కడే నిలిచిపోయినట్లు ఇటీవల పార్లమెంటులో కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజూ ఇచ్చిన సమాధానం ద్వారా వెల్లడైంది.

సామాన్యుల్లో ధైర్యం నింపాలని..
న్యాయవ్యవస్థను భారతీయీకరించాలన్న వాదనను జస్టిస్‌ రమణ ప్రతి వేదికపై వినిపిస్తూ వచ్చారు. ప్రజలు, న్యాయవ్యవస్థ మధ్య బంధాన్ని బలోపేతం చేయాలన్నది ఆయన ఉద్దేశం. భారతీయ న్యాయవ్యవస్థలో నియమ నిబంధనలను సంస్కరించి, మౌలికవసతులను మెరుగుపరిచి, భాషాపరమైన అడ్డంకులతో సహా అన్ని రకాల అవాంతరాలను తొలగించి, సామాన్యుడు ధైర్యంగా కోర్టును ఆశ్రయించే వ్యవస్థను తీర్చిదిద్దాలని ఆయన కలలు కన్నారు.

జట్టు మనిషి
జస్టిస్‌ రమణ ఏకవ్యక్తిస్వామ్యంలా కాకుండా.. సహచర న్యాయమూర్తులతో కలిసి బృందంగా పనిచేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటుచేసిన ఓ సన్మాన కార్యక్రమంలో కొందరు వక్తలు ఆయన్ను సచిన్‌ తెందుల్కర్‌తో పోల్చినప్పుడు.. ఆ పొగడ్తను జస్టిస్‌ రమణ సున్నితంగా తిరస్కరించారు. తాను బృందానికి నేతృత్వం వహిస్తున్నప్పటికీ.. అందులో ఒక సభ్యుడినేనని పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకాల్లో సాధించిన ఘనత కొలీజియం సభ్యులందరికీ దక్కుతుందని సవినయంగా చెప్పుకొచ్చారు.

ప్రజాహితమే అభిమతం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరి ఘటనపై అందిన లేఖను జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పరిగణనలోకి తీసుకొని.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించారు. తద్వారా సామాన్యుల ప్రాణాలకు సుప్రీంకోర్టు ఇస్తున్న ప్రాధాన్యం గురించి చాటిచెప్పారు.

ఇవీ చదవండి: దేశంలోనే ఎత్తైన ట్విన్ టవర్స్ కూల్చివేతకు రంగం సిద్ధం, 15 సెకన్లలోనే స్మాష్

దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే ఉచితాలపై ఏకాభిప్రాయం కావాలన్న సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.