ETV Bharat / bharat

వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు 'సర్దార్' బిరుదు ఎలా వచ్చిందంటే?

author img

By

Published : Nov 18, 2021, 6:53 AM IST

aazadi
ఆజాదీ కా అమృత్

భారత స్వాతంత్య్రోద్యమంలోని కీలక ఘట్టాల్లో తప్పక వినిపించే పేరు 'బర్దోలి'. ప్రలోభాలకు లొంగకుండా రైతులంతా కలసికట్టుగా బ్రిటిష్‌ ప్రభుత్వ మెడలు వంచిన ఘనత.. వల్లభ్‌భాయ్‌ పటేల్‌ను సర్దార్‌గా మార్చిన చరిత.. బర్దోలి సత్యాగ్రహానిది!

గుజరాత్‌ సూరత్‌ జిల్లాలోని ఓ తాలూకా బర్దోలి. 1928లో... అప్పటి ముంబయి ప్రభుత్వం బర్దోలి సమీపంలోని భూమిశిస్తును అనూహ్యంగా 30శాతం పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తపతి నది పరీవాహక ప్రాంతంలో రైలు మార్గం రావటంతో.. ఇక్కడి రైతుల పరిస్థితి మెరుగైందని.. భూమి విలువ పెరిగిందని ఓ ఆంగ్ల అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా శిస్తు పెంచారు. కానీ వాస్తవానికి రైతుల పరిస్థితి మారిందేమీ లేదు. పెంచిన శిస్తు తగ్గించాలని అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. పైగా గడువులోపు శిస్తు కట్టకుంటే రైతుల భూముల్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది.

రైతు ఉద్యమం..

దీంతో.. అప్పటికే ఖేడాలో రైతుల పక్షాన పోరాడిన వల్లభ్‌భాయ్‌ పటేల్‌ను రైతులు సంప్రదించారు. తమకు మద్దతుగా సత్యాగ్రహం చేయాలని కోరారు. "మీకు మద్దతివ్వటానికి కాంగ్రెస్‌ సిద్ధం. కానీ ఉద్యమానికి దిగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు. నేను కాదు.. మీరు బలంగా ఉంటేనే న్యాయం జరుగుతుంది. విఫలమైతే మాత్రం పరిణామాలు దారుణంగా ఉంటాయి. విజయం సాధిస్తే.. అది దేశ స్వరాజ్యానికి పునాది రాయిగా నిలుస్తుంది" అంటూ పటేల్‌ వారికి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. తద్వారా రైతులే నేతృత్వం వహించేలా.. అంతా బాధ్యతగా భాగస్వాములయ్యేలా ఏర్పాటు చేశారాయన.

వార్తలకెక్కిన బర్దోలి..

1928 ఫిబ్రవరి 15కల్లా శిస్తు చెల్లింపు గడువు ముగిసింది. రైతులు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం వినలేదు. సత్యాగ్రహం మొదలైంది. బ్రిటిష్‌ ప్రభుత్వం తనకలవాటైన ‘విభజించు పాలించు’ సూత్రం ప్రయోగించింది. కొన్నివర్గాల వారిని, సంపన్న రైతులను బెదిరించింది. దీంతో వారిలో కొంతమంది శిస్తు కట్టారు. కట్టనివారి భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం మొదలెట్టింది. ఈ దశలో పటేల్‌ వారిలో ధైర్యాన్ని నూరిపోశారు. "రైతులు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. భూమిపుత్రులుగా రాళ్లురప్పలు, కొండలు, గుట్టలు, వానలు, వరదలు.. అడవి జంతువులు.. మీ ఎదురీతలో ఎన్నో కష్టాలు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ, చలికి వణుకుతూ.. గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేనేలేదు" అంటూ ఆయన పలికిన ధైర్యవచనాలు రైతుల గుండెల్లోకి దూసుకుపోయాయి. సామాన్యులెవరూ వెనక్కి తగ్గలేదు. దాదాపు 137 గ్రామాల రైతులు దృఢంగా నిలిచారు. వీరికి కూలీలు, సామాన్యుల నుంచీ మద్దతు లభించింది. కొంతమంది ప్రభుత్వ సిబ్బంది కూడా రైతులకు మద్దతుగా ఉద్యోగాలకు రాజీనామా చేసి సత్యాగ్రహంలో చేరటం విశేషం. పొలాల్లో పనులు ఆగిపోయాయి. అధికారులు ఊళ్లలోకి రాలేని పరిస్థితి. దేశవ్యాప్తంగా బర్దోలి వార్తల్లో నిలిచింది.

ఐకమత్యమే మహాబలం..

ఒత్తిడికి తలొగ్గిన బ్రిటిష్‌ ప్రభుత్వం గవర్నర్‌ కౌన్సిల్‌ సభ్యుడు చున్నీలాల్‌ మెహతాను రాయబారానికి పంపింది. చర్చల తర్వాత.. శిస్తును 30 నుంచి 5.7శాతానికి తగ్గించాలని, స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని తిరిగివ్వాలని, రాజీనామా చేసిన సిబ్బందిని మళ్లీ కొలువుల్లోకి తీసుకోవాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం సరేనంది. కానీ భూమిని తిరిగి ఇవ్వటానికి నిరాకరిస్తూ మెలిక పెట్టింది. దీంతో.. ముంబయికి చెందిన కొంతమంది సంపన్నులు రంగంలోకి దిగి తాము కొనుగోలు చేసి రైతులకు ఇవ్వటంతో సమస్య సద్దుమణిగింది. రైతుకూలీ, పేదరైతుల సమస్యలను పూర్తిగా పరిష్కరించకున్నా.. ప్రజల భాగస్వామ్యంతో కలసికట్టుగా నిలిస్తే విజయం సాధించగలమనే ధీమానిచ్చింది బర్దోలి సత్యాగ్రహం. తమను భాగస్వాములుగానే కాకుండా సారథులుగా చేసి ఉద్యమం నడిపిన పటేల్‌కు ఆప్యాయంగా 'సర్దార్‌' బిరుదునిచ్చారు రైతులు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.