ETV Bharat / bharat

రైతుల 'రణతంత్ర' పరేడ్.. సాగిందిలా..

author img

By

Published : Jan 26, 2021, 10:46 PM IST

Updated : Jan 26, 2021, 11:02 PM IST

గణతంత్ర ట్రాక్టర్ ర్యాలీ పేరిట దిల్లీలో రైతులు చేపట్టిన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగింది. కొందరు రైతులు పోలీసులు అనుమతిచ్చిన మార్గంలో కాకుండా చారిత్రక ఎర్రకోటకు వెళ్లి బురుజుపై జెండాలను ఎగరవేశారు. ఈ క్రమంలో ఘర్షణకు దిగడంతో పోలీసులు బాష్ప వాయుగోళాలు ప్రయోగించి లాఠీఛార్జి చేశారు. ఆందోళనకారులు పోలీసు వాహనాలు, ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారు. నంగ్లోయి ప్రాంతంలో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

A Timeline: How Kisan Gantantra parade turned violent in Delhi
రైతుల 'రణతంత్ర' పరేడ్.. సాగిందిలా..

కిసాన్ గణతంత్ర పరేడ్ పేరిట దిల్లీలో రైతులు చేపట్టిన ప్రదర్శన హింసకు దారితీసింది. కొందరు రైతులు అనుమతించిన మార్గంలో కాకుండా రాజ్​పథ్​కు వెళ్లేందుకు ప్రయత్నం చేయడం వల్ల వివిధ ప్రాంతాల్లో పోలీసులు, కర్షకులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. చారిత్రక ఎర్రకోటలోకి ప్రవేశించిన కొందరు నిరసనకారులు సిక్కు ఆధ్యాత్మిక జెండాలను కోట బురుజులపై ఎగరవేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు కొన్ని చోట్ల పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయుగోళాలు ప్రయోగించగా, కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులే పోలీసులు, వారి వాహనాలపై దాడిచేశారు.

A Timeline: How Kisan Gantantra parade turned violent in Delhi
ఇలా ప్రారంభమైంది...

రెండు నెలలకుపైగా దిల్లీ సరిహద్దుల్లో సాగుచట్టాలకు వ్యతిరేకంగా శాంతియుత ఆందోళన చేస్తున్న రైతు సంఘాలు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీతో హస్తిన రణరంగాన్ని తలపించింది. కిసాన్ గణతంత్ర పరేడ్ ట్రాక్టర్ల ర్యాలీ శాంతియుతంగా మొదలై హింసాత్మకంగా మారింది. త్రివర్ణపతాకాలు, రైతుసంఘాల జెండాలతో ట్రాక్టర్లను అలంకరించిన రైతులు సింఘు, ఘాజీపుర్, టిక్రీ సరిహద్దుల నుంచి దిల్లీ దిశగా నిర్ణీత సమయం కంటే ముందే ర్యాలీని కదిలించారు. పలు ప్రాంతాల్లో స్థానికులు అన్నదాతలపై పూలవర్షం కురిపించారు. అయితే కొంత సేపటికే పరిస్థితి మారిపోయింది. గణతంత్ర వేడుకలు ముగియకుండానే ట్రాక్టర్ల ర్యాలీని ప్రారంభించడంతో పలుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు.

రూటు మారింది.. హింస చెలరేగింది..

అనుమతి ఇచ్చిన మార్గంలో కాకుండా కొంతమంది రైతులు వేరే మార్గంలోకి వెళ్లడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్షర్‌ధామ్ వద్ద రైతులపై లాఠీఛార్జి చేసిన పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. సంజయ్ గాంధీ ట్రాన్స్‌పోర్ట్ నగర్‌లో పోలీసులు తెచ్చిన వాటర్ కెనాన్ వాహనంపైకి ఎక్కిన నిరసనకారులు కర్రలతో దాడి చేశారు. కర్నల్‌ బైపాస్‌ వద్ద ర్యాలీని అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఆందోళనకారులు కర్రలతో తొలిగించారు. ముకర్బాచౌక్‌ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగిన నిరసనకారులు పోలీస్‌ వాహనంపైకి ఎక్కి అద్దాలు ధ్వంసంచేశారు. నంగ్లోయి ప్రాంతంలో పరిస్థితి యుద్ధవాతావరణాన్ని తలపించింది. నిరసనకారులను అడ్డుకునేందుకు తొలుత పోలీసులు రహదారిపై బైఠాయించారు.

A Timeline: How Kisan Gantantra parade turned violent in Delhi
కర్రలతో వీరంగం..
A Timeline: How Kisan Gantantra parade turned violent in Delhi
గాయాలపాలైన పోలీసులు

ఆందోళనకారులు పదేపదే ముందుకువెళ్లేందుకు యత్నించగా నంగ్లోయి వద్ద లాఠీఛార్జ్ చేశారు. భాష్పవాయుగోళాలు ప్రయోగించి చెదరగొట్టారు. మరోవైపు అనుమతి ఇచ్చిన మార్గంలో కాకుండా రాజ్‌పథ్‌వైపు వెళ్లేందుకు కొందరు ఐటీవోలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద బారీకేడ్లను తొలగించేందుకు చేసిన యత్నం హింసాత్మకంగా మారింది. అడ్డుకునేందుకు డీటీసీ బస్సును అడ్డుపెట్టగా బస్సు, పోలీసు వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పోలీసులపై దాడికి యత్నించారు. వారిని నియంత్రించే క్రమంలో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.లాఠీఛార్జ్ చేశారు.

రైతు మృతి.. ఎర్రకోటపై జెండా

ఈ క్రమంలోనే ఓ రైతు చనిపోగా ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయాడని పోలీసులు తెలిపారు. పోలీస్ బుల్లెట్ వల్లేనని నిరసనకారులు ఆరోపించారు. ఐటీఓ నుంచి రాజ్‌పథ్‌కు వెళ్లడం సాధ్యం కాకపోవడంతో కొందరు నిరసనకారులు ఎర్రకోటలో ప్రవేశించారు. నిహంగాలుగా పిలిచే కొంతమంది సిక్కులు ట్రాక్టర్లతో పాటు ఎర్రకోటలోకి ప్రవేశించి కోట గుమ్మటాలపై సిక్కుల త్యాగాలకు ప్రతీకగా భావించే జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి త్రివర్ణపతాకం ఎగరవేసే చోట జెండాను ఎగరేశారు. మరికొంతమంది రైతు సంఘాల జెండాలను ప్రదర్శించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎర్రకోట నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. అతికష్టంపై ఆందోళనకారులను ఎర్రకోట నుంచి పోలీసులు ఖాళీ చేయించారు. రైతు సంఘాల నేతల పిలుపుతో కొత్త సాగుచట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెండు నెలల నుంచి ఆందోళన చేస్తున్న ప్రాంతాలకు తిరుగుపయనమయ్యారు.

A Timeline: How Kisan Gantantra parade turned violent in Delhi
ఎర్రకోటపై ఎగిరిన ఆ మత జెండా

'షా' సమీక్ష.. ఇంటర్​నెట్​ సేవలు బంద్​..

రైతుల గణతంత్ర ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన వేళ హోంమంత్రి అమిత్ షాకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి దిల్లీలో పరిణామాలను వివరించారు. దిల్లీలో శాంతి భద్రతల పునరుద్ధరణకు చేపట్టిన చర్యలను తెలిపారు. అన్ని అంశాలు తెలుసుకున్న మంత్రి అదనపు బలగాలు మోహరించాలని ఆదేశించారు. అంతకుముందే పుకార్లు వ్యాప్తి కాకుండా కేంద్ర హోంశాఖ ఇంటర్​నెట్​ సేవలపై ఆంక్షలు విధించింది. సింఘు, ఘజియాబాద్, టిక్రి, ముకర్బా చౌక్, నగ్లోయి తదితర ప్రాంతాల్లో టెలికం, అంతర్జాల సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకూ ఆంక్షలు విధించారు.

A Timeline: How Kisan Gantantra parade turned violent in Delhi
బాష్పవాయువు ప్రయోగిస్తున్నపోలీసులు

రహదారుల మూసివేత..

దిల్లీలో నెలకొన్న ఉద్రిక్తల నడుమ పోలీసులు కీలక రహదారులను మూసేశారు. ఎన్‌హెచ్‌- 44, జీటీకే రోడ్, అవుటర్ రింగ్ రోడ్, సిగ్నేచర్ బ్రిడ్జ్ సహా, ఎన్‌హెచ్‌-24, వికాస్ మార్గ్,నిజాముద్దీన్ ఖట్టా, నోయిడాలింక్ రోడ్, అవుటర్ దిల్లీ, పశ్చిమ దిల్లీ సరిహద్దులను మూసివేశారు. నగరంలోని అనేక రహదారుల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. ద్వారకామోర్ నుంచి ఉత్తమ్ నగర్ ఈస్ట్ మెట్రోస్టేషన్ వరకు రాకపోకలు నిలిపేశారు. మెట్రో గ్రేలైన్‌లో ప్రవేశ, నిష్క్రమ ద్వారాలను దిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ మూసేసింది.

మేము కాదు.. మాకు సంబంధం లేదు..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన గణతంత్ర ట్రాక్టర్ ర్యాలీకి భారీగా కదిలి వచ్చిన అన్నదాతలకు కిసాన్ సంయుక్త మోర్చా కృతజ్ఞతలు తెలిపింది. ఇదే సమయంలో ర్యాలీలో భాగంగా చోటుచేసుకున్న ఘటనలు దురదృష్టకరమని వాటిని ఖండిస్తున్నట్లు తెలిపింది. అటువంటి చర్యలకు పాల్పడ్డవారికి రైతుసంఘాల ఆందోళనతో ఏ మాత్రం సంబంధం ఉండబోదని స్పష్టం చేసింది. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించేందుకు తాము చేసిన ప్రయత్నాలను కొన్ని సంఘాలు, వ్యక్తులు అడ్డుతగిలి పోలీసులు సూచించిన మార్గాల్లో కాకుండా వేరే దారుల్లోకి ప్రవేశించి అరాచకం సృష్టించారని రైతుసంఘాలు తెలిపాయి. ఇదంతా సంఘ విద్రోహశక్తుల పనిగా పేర్కొన్న రైతు సంఘాలు వాళ్లే ఈ ర్యాలీలోకి ప్రవేశించకుండా ఉండి ఉంటే ర్యాలీ ప్రశాంతంగా ముగిసేదని చెప్పాయి. శాంతియుతపంథానే తమ శక్తిగా పేర్కొన్న రైతులు ఇలాంటి హింసాత్మక ఘటనలతో ఉద్యమానికి చేటు కలుగుతుందని పేర్కొన్నారు. జాతీయ సమగ్రతకు, సార్వభౌమత్వానికి ప్రతీకలుగా నిలిచే చిహ్నాల పట్ల అగౌరవంగా వ్యవహరించడం తగదన్నారు. ఆయా ఘటనలపై పూర్తిస్థాయి సమాచారం సేకరించి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌కేఎమ్‌ నేతలు చెప్పారు.

శాంతియుతంగా సాగలేదు..

సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన గణతంత్ర ట్రాక్టర్ ర్యాలీ ఎంతమాత్రం శాంతియుతంగా సాగలేదని దిల్లీ పోలీసులు చెప్పారు. ముందుగా అనుమతించిన మార్గంలో కాకుండా కొందరు రైతులు వేరే మార్గంలోకి మళ్లారని చెప్పారు. అంతేకాకుండా పోలీసులపై దాడికి కూడా తెగబడ్డారని చెప్పారు.

ఇదీ చూడండి: దిల్లీ ఐటీఓ వద్ద ఆందోళన ఉద్రిక్తం- రైతు మృతి

Last Updated : Jan 26, 2021, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.