ETV Bharat / bharat

కరోనా కట్టడికి కేంద్రం చర్యలు- దిల్లీకి అదనపు వైద్యులు

author img

By

Published : Nov 16, 2020, 1:52 PM IST

దిల్లీలో కరోనా కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. అదనపు వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని రాజధానికి తరలిస్తోంది. మరోవైపు, దిల్లీలో కరోనా మూడో వేవ్ తీవ్ర స్థాయిని దాటిపోయిందని దిల్లీ వైద్య శాఖ మంత్రి పేర్కొన్నారు. అయితే మరోసారి లాక్​డౌన్ విధించేది లేదని స్పష్టం చేశారు.

paramedics heading to Delhi
దిల్లీకి అదనపు వైద్యులు

దిల్లీలో కరోనా నియంత్రణకు కేంద్రం చర్యలు ముమ్మరం చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 75 మంది వైద్యులు, 350 మంది పారామెడికల్ సిబ్బందిని దిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల పాటు వీరు దిల్లీలోనే ఉండనున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వైద్య నిపుణులను సత్వరమే సిద్ధం చేయాలని వివిధ పారామిలిటరీ దళాలు అంతర్గతంగా ఉత్తర్వులు జారీ చేశాయి. దిల్లీలో విధులు నిర్వర్తించేందుకు అందుబాటులో ఉన్న అదనపు వైద్యులను రిలీవ్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

"మొత్తం 75మంది వైద్యులు కొద్దిరోజుల కోసం ఇక్కడికి రానున్నారు. సిబ్బంది పేర్లు ఖరారయ్యాయి. రాజధానిలో ఉన్న వివిధ ఆస్పత్రులకు వారిని పంపింస్తాం. సర్దార్ పటేల్ కొవిడ్ ఆస్పత్రికి సైతం తరలిస్తాం."

-ప్రభుత్వ అధికారి

ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఛర్తార్​పుర్​లోని కొవిడ్ ఆస్పత్రికి 15 మంది వైద్యులు, 70 మంది పారామెడికల్ సిబ్బందిని పంపించనున్నట్లు తెలుస్తోంది. సశస్త్ర సీమాబల్ నుంచి 15మంది వైద్యులు, 70మంది పారామెడికల్ సిబ్బంది రానున్నారు. కశ్మీర్, లద్దాఖ్ వంటి ప్రాంతాల నుంచి వైద్యులను తీసుకురాకుండా ఉండేందుకే ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

మూడో వేవ్​ తీవ్ర స్థాయి

మరోవైపు రాజధానిలో కరోనా వ్యాప్తిపై దిల్లీ వైద్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో కొవిడ్ మూడో దశ వ్యాప్తి తీవ్ర స్థాయిని మించిపోయిందని తెలిపారు. అయితే వైరస్ నియంత్రణకు లాక్​డౌన్ విధించేది లేదని స్పష్టం చేశారు. లాక్​డౌన్​తో పోలిస్తే మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు వహించడమే ఉత్తమమైన మార్గమని పేర్కొన్నారు.

దిల్లీలో ప్రస్తుతం 39,990 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 4,37,801కి చేరింది. ఇప్పటివరకు 7,614 మంది మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.