ETV Bharat / bharat

SRSP Project 60 Years : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు @ 60 వసంతాలు

author img

By

Published : Jul 26, 2023, 10:08 AM IST

SRSP
SRSP

60 Years of Sriram Sagar Project : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60 వసంతాలు పూర్తి చేసుకుంది. సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తూ విద్యుత్ ఉత్పత్తిచేసే ఆ బహుళార్థసాధక ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఐతే వరద తగ్గడంతో రివర్స్ పంపింగ్ ద్వారా పునరుజ్జీవం వైపు సాగుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 60 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. నేడు ముప్కాల్ పంపు హౌస్ వద్ద వేడుకలు జరుపనున్నారు.

నేటితో ఉత్తర తెలంగాణ వరప్రదాయిని.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 60 వసంతాలు పూర్తి

Sriram Sagar Project Completes 60 Years : ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీడు భీములను సస్యశ్యామలం చేసేందుకు గోదావరిపై నిర్మించిన శ్రీరామ సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగి 60 ఏళ్లు పూర్తవుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి 1963 జులై 26న అప్పటి ప్రధాని పండిట్‌ జవహార్‌లాల్ నెహ్రూ.. పోచంపాడ్ వద్ద శంకుస్థాపన చేసి పునాదిరాయి వేశారు. శంకుస్థాపన సమయంలో... ఇది ఒక ఆధునిక దేవాలయంగా పేర్కొన్నారు. 1978లో ప్రాజెక్టు పూర్తిచేయగా అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ప్రారంభించి కాల్వల ద్వారా నీరు విడుదల చేశారు.

SRSP 60 Years Celebrations Today : సాగునీటి ప్రాజెక్టుగా నిర్మాణం చేయగా... 1983లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీరామారావు... శ్రీరామసాగర్ ప్రాజెక్టు వద్ద విద్యుత్‌ ఉత్పత్తికి అవకాశం ఉన్నందున జలవిద్యుత్‌ ఉత్పాదన కేంద్రం ఏర్పాటుకు... గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 36 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్ధ్యం గల జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం చేపట్టగా... మొదట మూడు టర్బయిన్లు పూర్తి కాగా 1988లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీరామారావు ప్రారంభించారు. ప్రస్తుతం నాలుగు టర్బయిన్ల ద్వారా 36 మెగావాట్ల కరెంట్‌ ఉత్పత్తికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ సాగు, తాగు నీటిని అందించడంతో పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

ఉత్తర తెలంగాణతో పాటు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు కలిపి 18 లక్షల ఎకరాలకు నీరు అందించాలని లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మించారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టులో 1091 అడుగుల వరకు నీరు, అంటే 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంగా నిర్మించారు. అయితే ప్రస్తుతం పూడిక చేరడం వల్ల 90.313 టీఎంసీల నీటినిల్వకు పడిపోయింది. ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని అందించేందుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మి కాల్వలు నిర్మించారు. కాకతీయ కాల్వ ద్వారా జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు, సరస్వతి కాల్వ ద్వారా నిర్మల్‌ జిల్లాలో, లక్ష్మి కాల్వ ద్వారా జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో సాగునీరు అందిస్తున్నారు. ఆ తర్వాత కాలంలో వరద కాల్వ సైతం నిర్మించారు.

నేడు ముప్కాల్ పంపు హౌస్ వద్ద వేడుకలు : ఎస్సారెస్పీ బ్యాక్‌ వాటర్‌ ఎత్తిపోసి సాగుకు నీరు అందించేందుకు పలు ఎత్తిపోతలు నిర్మించారు. ప్రాజెక్టు ద్వారా సాగు నీటికొరత తీరడంతో పాటు తాగునీటి ఇబ్బందిని తీరుస్తుంది. రామగుండం వద్ద గల ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి కోసం నీటిని అందిస్తోంది. ఎస్సారెస్పీ శంకుస్థాపనకు గుర్తుగా 2009లో కాంగ్రెస్ ప్రభుత్వహాయాంలో ప్రాజెక్టుపై జవహార్‌లాల్‌ నెహ్రూ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని అప్పటి లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ, ఉమ్మడిరాష్ట్ర శాసన సభాపతి కేఆర్​ సురేశ్‌రెడ్డి ఆవిష్కరించారు. ప్రాజెక్టు నిర్మాణానికి పునాది పడి 60ఏళ్లు గడుస్తున్న తరుణంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఇంజినీర్లు, ఉద్యోగులు ఏర్పాట్లు చేశారు. నేడు ముప్కాల్ పంపు హౌస్ వద్ద వేడుకలు జరుపనున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.