ETV Bharat / bharat

ADR report: 363 మంది శాసనకర్తలపై నేరాభియోగాలు..!

author img

By

Published : Aug 24, 2021, 6:58 AM IST

ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8 కింద దేశవ్యాప్తంగా 363 ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదైనట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ (ఏడీఆర్‌) (ADR report) వెల్లడించింది. తొలి మూడు స్థానాల్లో భాజపా, కాంగ్రెస్‌, తృణమూల్‌ ఉన్నట్లు తెలిపింది.

ADR report
ఏడీఆర్‌ రిపోర్టు

దేశవ్యాప్తంగా ఉన్న 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌ 8(1), (2), (3) కింద కోర్టులు నేరాభియోగాలు నమోదు చేసినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) సంస్థ (ADR report) వెల్లడించింది. 2019 నుంచి 2021 వరకు 2,495 మంది సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమర్పించిన ప్రమాణ పత్రాలను పరీక్షించి ఆ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 296 మంది ఎమ్మెల్యేలు, 67 మంది ఎంపీలు ఉన్నారు.

ప్రజాప్రాతినిధ్యచట్టంలోని సెక్షన్‌ 8(1), (2), (3)ల కింద కేసులు ఎదుర్కొంటున్నవారికి శిక్షపడ్డ రోజు నుంచే అనర్హత మొదలవుతుంది. మళ్లీ వారు విడుదలైన రోజు నుంచి ఆరేళ్లపాటు ఆ అనర్హత కొనసాగుతుంది. ఈ సెక్షన్ల కింద ఉన్నవన్నీ తీవ్రమైన, హీనమైన నేరాలే. అన్నీ భారతీయ నేర స్మృతి పరిధిలోకి వచ్చేవే. హత్య, అత్యాచారం, దోపిడీ, కిడ్నాపింగ్‌, మహిళలపై నేరాలు, లంచం, అనుచిత ప్రభావం, కులాలు, మతాలు, జాతి, భాష, ప్రాంతం ప్రాతిపదికన వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడంలాంటి నేరాలు ఈ సెక్షన్ల పరిధిలో ఉంటాయి.

ఈ నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికంగా 83 మంది భాజపా సభ్యులున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్‌ (47), తృణమూల్‌ కాంగ్రెస్‌ (25), వైకాపా (22), బీజేడీ (22)లు ఉన్నాయి. ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీలు అత్యధికంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్నారు. 2020 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల్లో 54 మంది, 2021 కేరళ ఎన్నికల్లో గెలిచిన వారిలో 42 మంది ఎమ్మెల్యేలు ఇదే తరహా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. కేంద్రమంత్రుల్లో నలుగురు, వివిధ రాష్ట్రాల మంత్రుల్లోని 35 మందిపై ఇలాంటి నేరాభియోగాలు నమోదయ్యాయి. ఎంపీలపై నమోదైన కేసులు సగటున 7 ఏళ్లుగా, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులు (ADR report) సగటున ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి.

వైకాపాలో..

ఏపీలో వైకాపా తరఫున ఇలాంటి అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో నలుగురు ఎంపీలు (మిథున్‌రెడ్డి, మార్గాని భరత్‌, బెల్లాన చంద్రశేఖర్‌, ఎంవీవీ సత్యనారాయణ, 18 మంది ఎమ్మెల్యేలు (కోలగట్ల వీరభద్రస్వామి, మేరుగ నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్‌, బొల్లా బ్రహ్మనాయుడు, మేకపాటి గౌతంరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, పాముల పుష్పశ్రీవాణి, కాపు రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి, జక్కంపూడి రాజా, బుర్రా మధుసూదనరావు, సామినేని ఉదయభాను, మేకతోటి సుచరిత) ఉన్నారు. తెదేపాలో ఇద్దరు ఎమ్మెల్యేలు (వాసుపల్లి గణేష్‌ కుమార్‌, కరణం బలరామ కృష్ణమూర్తి) ఉన్నారు. వీరు ప్రస్తుతం వైకాపాతో సన్నిహితంగా ఉంటున్నారు.

తెలంగాణ నుంచి ముగ్గురు..

తెలంగాణ నుంచి ఇలాంటి అభియోగాలు ముగ్గురు ఎంపీలు ఎదుర్కొంటున్నారు. ఇందులో సోయం బాపూరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాలోతు కవిత ఉన్నారు.

ఇదీ చదవండి: CAA Act: 'అందుకే.. పౌరసత్వ సవరణ చట్టం ఉండాలన్నాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.