ETV Bharat / bharat

విద్యార్థి మృతిపై రగడ- 'నీట్​' మినహాయింపు బిల్లుకు సీఎం హామీ!

author img

By

Published : Sep 12, 2021, 10:25 PM IST

suicide
నీట్​ విద్యార్థి మృతి

నీట్​ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందు ఓ విద్యార్థి ఆత్మహత్య(student commits suicide) చేసుకోవటం ఆ రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ క్రమంలో నీట్​ పరీక్ష నుంచి రాష్ట్రాన్ని శాశ్వతంగా మినహాయించే (neet exemption tamil nadu)బిల్లుకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి.

దేశవ్యాప్తంగా ఆదివారం 'నీట్​' పరీక్ష విజయవంతంగా జరిగింది. అయితే.. తమిళనాడులో ఇదే నీట్​పై రాజకీయంగా పెను దుమారం రేగింది. పరీక్షకు కొన్ని గంటల ముందు చెన్నై సమీపంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి(20) ఆత్మహత్య(student commits suicide) చేసుకోవటమే అందుకు కారణం. ఇప్పటికే రెండుసార్లు నీట్​ పరీక్ష రాసిన ఆ విద్యార్థి.. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించకపోతే.. ఎంబీబీఎస్​ చేయాలన్న తన కల కలగానే మిగిలిపోతుందనే మనోవేదనతోనే ఆత్మహత్యకు(neet student died) పాల్పడినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

సేలం జిల్లా మెట్టూర్​కు సమీపంలోని కూజయ్యూర్​ గ్రామానికి చెందిన రైతు శివకుమార్​ రెండో కుమారుడు ధనూష్​. ఎంబీబీఎస్​ చేయాలని ఇప్పటికే రెండుసార్లు నీట్​ రాశాడు. ఆదివారం పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ..ఆదివారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులు సమాచారం అందించారని మెట్టూర్​ రేంజ్​ పోలీసు అధికారి తెలిపారు. నీట్​ పరీక్ష మూడోసారి రాయబోతున్నట్లు చెప్పారు. ధనూష్​ మృతదేహాన్ని పోస్ట్​మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.

విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న క్రమంలో అతని ఇంటి సమీపంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

రాజకీయంగా దుమారం..

విద్యార్థి మృతికి అధికార డీఎంకేదే బాధ్యతగా పేర్కొంది ప్రతిపక్ష ఏఐఏడీఎంకే. అసెంబ్లీ ఎన్నికల వరకు నీట్​ పరీక్ష రద్దు కోసం పోరాడామని, అయితే.. ఈ విషయంపై ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో విజయం సాధించిందని డీఎంకేపై ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి. నీట్​ నుంచి తమిళనాడును మినహాయింపు ఇస్తామని డీఎంకే పెద్ద పెద్ద మాటలు చెప్పిందని.. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఏమీ చేయలేదని పేర్కొన్నారు. మరో విద్యార్థి ప్రాణాలు పోయేందుకు కారణమైందని ఆరోపించారు. రాజకీయ నాయకుల మాటలు విని మోసపోయినందుకే ధనూష్​ ఆత్మహత్య చేసుకున్నాడని, విద్యార్థులు ఎవరూ ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. తమిళనాడులో నీట్​ పరీక్ష ఉంటుందా? లేదా అనేది సరైన సమయంలో నిర్ణయం తీసుకుని ఉంటే.. విద్యార్థి ప్రాణాలు దక్కేవన్నారు. విద్యార్థి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

పీఎంకే వ్యవస్థాపక నేత ఎస్​ రామదాస్​ సైతం నీట్​ను తప్పుపట్టారు. సామాజిక న్యాయానికి నీట్​ విరుద్ధంగా ఉందన్నారు. తక్షణమే రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. అయితే.. దీనికి ఆత్మహత్య పరిష్కారం కాదని సూచించారు.

కేంద్రంపై డీఎంకే ఆరోపణలు..

ఈ క్రమంలో కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని డీఎంకే ఆరోపణలు చేసింది. విద్యార్థి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్​. పట్టణ, గ్రామా ప్రాంతాల్లోని నిరుపేద విద్యార్థులపై నీట్​ పరీక్ష ప్రతికూల ప్రభావాలు కూడా ఆత్మహత్యలకు కారణమని పేర్కొన్నారు.

"నీట్​ విషయంలో కేంద్ర మొండి వైఖరి అవలంబిస్తోంది. నీట్​ పరీక్ష పరిధి నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించేలా(neet exemption tamil nadu) అసెంబ్లీలో సెప్టెంబర్​ 13న బిల్​ ఆమోదింపజేస్తాం. విద్యార్థులకు నీట్​ ద్వారా ఎదురయ్యే ఇబ్బందులను కేంద్రం అర్థం చేసుకోలేకపోతోంది. తన అలసత్వం, మొండి వైఖరిని కొనసాగించటమే విద్యార్థులు ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. నీట్​కు వ్యతిరేకంగా మా న్యాయపోరాటం రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టాకే మొదలైంది. నీట్​ పరీక్షను కేంద్రం రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలకు సైతం మద్దతు పలుకుతాం. తప్పక విజయం సాధిస్తాం. విద్యార్థులు క్షణికావేశంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకొవద్దు."

- ఎంకే స్టాలిన్​, తమిళనాడు ముఖ్యమంత్రి.

రూ.10 లక్షల సాయం..

డీఎంకే యూత్​ వింగ్​ కార్యదర్శి, ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్​.. బాధితుడి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ నుంచి రూ.10 లక్షల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

2017లోనే..

ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో 2017లో నీట్​ నుంచి తమిళనాడును మినహాయించేందుకు బిల్​ తీసుకొచ్చారు. కానీ, దానికి రాష్ట్రపతి ఆమోదం లభించలేదు.

ఇదీ చూడండి: NEET: రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్​ పరీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.