ETV Bharat / bharat

17 Minutes Of Terror Chandrayaan 3 : ఆఖరి 17 నిమిషాలు చాలా కీలకం.. 8 దశల్లో జాబిల్లిపైకి ల్యాండర్​ దిగేలా ప్లాన్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2023, 5:15 PM IST

17 Minutes Of Terror Chandrayaan 3
17 Minutes Of Terror Chandrayaan 3

17 Minutes Of Terror Chandrayaan 3 : కోట్లాది మంది భారతీయులు సహా ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి. మరికొద్ది గంటల్లో చంద్రయాన్‌-3 వ్యోమనౌక జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది. జులై 14న నింగికెగిసిన చంద్రయాన్-3.. 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు సిద్ధమవుతోంది. అయితే దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఈ నలభై రోజుల ప్రయాణమంతా ఒక ఎత్తయితే.. చివరి 17 నిమిషాల ప్రక్రియ మరో ఎత్తు. వాటినే శాస్త్రవేత్తలు 17 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌ అని పిలుస్తారు. ఈ 17 నిమిషాల్లోనే ఎనిమిది దశల్లో ల్యాండర్‌ను జాబిల్లిపైకి దిగేలా ప్రణాళిక రూపొందించారంటే.. అది ఎంత క్లిష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇస్రో శాస్త్రవేత్తలు నియంత్రణ లేని పరిస్థితుల్లో విక్రమ్‌ ల్యాండర్‌.. వేగాన్ని తనంతట తాను తగ్గించుకుంటూ జాబిల్లిపై దిగాల్సి ఉంటుంది.

17 Minutes Of Terror Chandrayaan 3 : జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విక్రమ్‌ ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసి చరిత్ర సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధంగా ఉంది. అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈసారి చంద్రయాన్‌-3ను పకడ్బంధీగా తయారు చేశారు. చంద్రయాన్‌-2 సమయంలోనూ చివరి కొద్ది నిమిషాల వరకు అంతా సాఫీగానే సాగింది. ఇంచుమించుగా గమ్యస్థానం వరకూ వెళ్లగలిగింది. కానీ చిన్నపాటి లోపాల కారణంగా జాబిల్లిపై ల్యాండర్‌ కూలిపోయింది. ఈ సమస్యలే మళ్లీ ఉత్పన్నం కాకుండా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. చందమామ దక్షిణ ధ్రువంపై దిగేందుకు అత్యంత కీలకమైన, సంక్లిష్టమైన చివరి 17 నిమిషాలను ఎదుర్కొనేలా ల్యాండర్‌ను ఇస్రో సిద్ధం చేసింది. ఈ 17 నిమిషాలను ఎనిమిది దశల్లో ఇస్రో నిర్వహించనుంది.

17 నిమిషాలు చాలా కీలకం..
Chandrayaan 3 Landing Date : జాబిల్లిపై విక్రమ్‌ ల్యాండర్‌ దిగే ల్యాండింగ్‌ ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు ప్రారంభం కానుంది. ల్యాండర్‌ దిగిన తర్వాత అందులో నుంచి రోవర్‌ సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు బయటకు రానుంది. టెర్రర్‌ ఆఫ్‌ 17 మినిట్స్‌గా పిలిచే ఆ 17 నిమిషాల సమయమే ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలను కాస్త కలవరపెడుతోంది. గతంలో చంద్రయాన్‌- 2 విషయంలో ఈ సమయంలోనే సాంకేతిక లోపం తలెత్తి ల్యాండర్‌ కూలిపోయింది. ఈ సారి అవాంతరాలు ఎదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొనేలా విక్రమ్‌ ల్యాండర్‌ను తయారు చేశారు. ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ 134x25 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ కక్షలో పరిభ్రమిస్తున్నప్పుడు విక్రమ్ ల్యాండర్ చంద్రునికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు జాబిల్లి ఉపరితలంపై దిగే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సెకనుకు 1.68 కిలోమీటర్ల వేగంతో విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపైకి దూసుకుపోతుంది. అంటే ఆ సమయంలో ల్యాండర్‌ వేగం గంటకు 6,048 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది విమాన వేగం కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ.

ల్యాండింగ్ అయ్యే ముందు స్కానింగ్​..
ఇంత వేగంతో వెళ్తున్న విక్రమ్‌ ల్యాండర్‌ను భూమిపై నుంచి శాస్త్రవేత్తలు నియంత్రించలేరు. ఎందుకంటే భూమ్మీద నుంచి చంద్రుడి మీద ఒక రేడియో సిగ్నల్ పంపించడానికి సుమారు 1.3 సెకన్ల సమయం పడుతుంది. తిరిగి రావడానికి అంతే సమయం పడుతుంది. సిగ్నల్ పంపి అది భూమ్మీదకు చేరాలంటే 2.6 సెకన్ల సమయం పడుతుంది. గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి మీదకు వెళ్లే ల్యాండర్‌ను నియంత్రించాలంటే రెండున్నర సెకన్ల సమయం పడుతుంది. ఇది సాధ్యం కాదు. అందుకే విక్రమ్‌ ల్యాండర్‌ ఆటోమెటిక్‌గా తనంతట తానే ల్యాండయ్యేలా ప్రోగ్రామ్ చేశారు. వేగాన్ని నియంత్రించేందుకు విక్రమ్‌ ల్యాండర్‌.. తన నాలుగు థ్రస్టర్ ఇంజిన్‌లను మండిస్తుంది. దీనిని పవర్డ్‌ బ్రేకింగ్ దశ అంటారు. ఇది దాదాపు 11 నిమిషాల పాటు కొనసాగుతుంది. అనంతరం ఫైన్ బ్రేకింగ్ దశ ఆరంభం అవుతుంది. ఈ దశలోనే చంద్రయాన్-2 ల్యాండర్ అదుపు తప్పి కూలిపోయింది. 6.8 కిలోమీటర్లు ఎత్తుకు చేరుకున్నప్పుడు కేవలం రెండు ఇంజన్లను మాత్రమే ఉపయోగించుకుంటూ ల్యాండర్‌ వేగాన్ని నియంత్రించుకుంటుంది. జాబిల్లి ఉపరితలానికి 100 నుంచి 150 మీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు తనలోని సెన్సార్లు, కెమెరాలు వినియోగించుకుని జాబిల్లి ఉపరితలంపై ఏమైనా అడ్డంకులు ఉన్నాయో లేదో స్కాన్ చేసి ల్యాండింగ్‌ చూసుకుంటుంది. ఆపై సాఫ్ట్-ల్యాండింగ్ చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

Chandrayaan 3 Vikram Lander Information : ఇలా దశలవారీగా విక్రమ్‌ ల్యాండర్‌ వేగం తగ్గుతూ చంద్రుడి ఉపరితలానికి చేరువవుతుంది. 800 మీటర్ల ఎత్తు నుంచి 10 మీటర్ల ఎత్తు వరకు ల్యాండర్ చేరడానికి నాలుగున్నర నిమిషాలు పడుతుంది. చివరి 10 మీటర్లకు చేరుకున్న దశలో రాకెట్లు మండటం ఆగిపోతుంది. రాకెట్లు మండుతూ దిగడం వల్ల చంద్రుడి ఉపరితలం మీద ఉన్న ధూళి పైకి రేగి, అది ల్యాండర్ మీద ఉన్న సోలార్ ప్యానెళ్ల మీద పడితే.. అవి విద్యుత్ ఉత్పత్తి చేయలేని ప్రమాదం ఉంది. విక్రమ్‌ ల్యాండర్‌లో లేజర్ డాప్లర్ వెలోసిమీటర్ అనే ఒక కొత్త పరికరాన్ని ఇస్రో చేర్చింది. ఇది జాబిల్లి ఉపరితలంపైకి లేజర్ పల్స్ పంపిస్తుంది. అవి తిరిగి దాన్ని చేరుతాయి. అలా అది తాను ఎంత వేగంతో కిందికి దిగుతున్నాను అనేది క్షణం క్షణం లెక్కిస్తుంది. ఒకవేళ సాంకేతిక లోపం తలెత్తి ల్యాండర్ సెకనుకు 3 మీటర్ల వేగంతో పడినా సరే పరికరాలు చెక్కు చెదరకుండా ఉండేంత దృఢంగా వాటి కాళ్లను ఇస్రో రూపొందించింది.

ఏ సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. సాంకేతికంగా సమస్యలు ఉత్పన్నమైనా ల్యాండర్‌ చంద్రుడిపై దిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ల్యాండర్ జాబిల్లిపై సురక్షితంగా దిగిన తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్‌ రోవర్‌ బయటకువ వచ్చి ఫోటోలు తీసి భూమ్మీదకు పంపిస్తుంది. 14 రోజుల పాటు రోవర్ ప్రజ్ఞాన్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేస్తుంది.

Chandrayaan 3 VS Chandrayaan 2 : ఓటమి నేర్పిన పాఠం.. చంద్రయాన్​-3 సాఫ్ట్​ ల్యాండింగ్​ ఖాయం!

Chandrayaan 3 : కీలక దశకు చంద్రయాన్​-3.. బుధవారం ఏం జరగనుంది? లైవ్ ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.