జనం లేక వెలవెలబోయిన వైసీపీ బస్సు యాత్ర - ఖాళీ కుర్చీల మధ్య ప్రసంగాలు
YCP Bus Trip Failed in Ambedkar Konaseema District : అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్ర సమావేశం ప్రారంభంలోనే జనం వెను తిరిగి వెళ్లిపోవడంతో వెలవెలబోయింది. రావులపాలెంలోని ప్రభుత్వ కళాశాల ప్రాంగణం నుంచి బస్సు యాత్ర ప్రారంభమై కొత్తపేట వరకు సాగింది. కొత్తపేటలోని సభా ప్రాంగణంపైకి నాయకులను పిలుస్తున్న సమయంలోనే మహిళలు సభ నుంచి వెళ్లిపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రజలు వెళ్లకుండా నాయకులు ఎంత ప్రయత్నించినా వారి మాట వినకుండా సభ నుంచి వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీల మధ్యనే మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రసంగాలు సాగాయి.
అధికార దన్నుతో బహిరంగ సభలు విజయవంతం చేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రభుత్వ పథకాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ సభకు వచ్చేలా.. వాలంటీర్లు, డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి తేవడంతో వచ్చిన జనం కూర్చోకుండా ప్రసంగాల ప్రారంభం నుంచి జారుకున్నారు. ఓ వైపు ప్రసంగాలు సాగు తుండగానే వేదిక ఎదురుగా ఉన్న కుర్చీలు ఖాళీ అవ్వడంతో నాయకులు అప్రమత్తం అయ్యారు. ఖాళీ అయిన కుర్చీలన్నీ అక్కడి నుంచి తొలగించి.. వెనుక ఉన్న కొద్ది మందిని ముందు కూర్చోమని నాయకులు కోరారు. అప్పటికీ జనం వెళ్లిపోతుండంతో ప్రసంగాలు త్వరగా ముగించారు. కోనసీమ ప్రధాన రహదారిపై స్టేజి ఏర్పాటు చేయడంతో వాహనాలను మరొక మార్గం నుంచి పోలీసులు మళ్లించటం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.