TDP Leader Ayyanna Gets Relief in High Court: టీడీపీ నేత అయ్యన్నకు హైకోర్టులో ఊరట.. అర్నేష్ కుమార్ మార్గదర్శకాలు పాటించాలని పోలీసులకు ఆదేశం
TDP Leader Ayyanna Gets Relief in High Court: టీడీపీ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆత్కూరు పీఎస్‌లో నమోదైన కేసులో.. అర్నేష్ కుమార్ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. గన్నవరం నియోజకవర్గంలో ఆత్కూర్ పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసును కొట్టివేయాలని.. అయ్యన్నపాత్రుడు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీఎం జగన్‌తో పాటు ఇతర నేతలపై.. అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు చేశారని.. వైసీపీ ఎమ్మేల్యే పేర్ని నాని ఆత్కూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయ్యన్నపాత్రుడు వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. అయ్యన్న తరపున న్యాయవాది వీవీ సతీష్ వాదనలను వినిపించారు. పోలీసులు నమోదు చేసిన పలు సెక్షన్లు పిటిషనర్‌కు వర్తించవని కోర్టుకు వివరించారు. రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై అలాంటి పదప్రయోగం చేయవచ్చా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను పాటించాలని ఆదేశించింది.