భోజనంలో పురుగులు, మూడురోజులుగా తాగునీరు లేదు - విద్యార్థినుల ఆందోళన
Students Worried Food Drinking Water In Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల ఎదుట సోమవారం విద్యార్థినులు ఆందోళన చేశారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం సరిగ్గా పెట్టడం లేదని, తాగునీరు కూడా ఉండటం లేదని, భోజనంలో పురుగులు ఉంటున్నాయని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూరజ్ గనోరే విద్యార్థినులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజనంలో పురుగులు ఉండటంతో తినలేక పోతున్నామని, మూడు రోజులుగా తాగునీరు లేదని విద్యార్థినులు తెలిపారు.
ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని.. ఆమెను వెంటనే మార్చాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధికారి పాఠశాలను సందర్శించి తనిఖీ చేశారు. సాయంత్రంలోగా తాగునీరు కల్పించేందుకు చర్యలు చేపడతామని అధికారి తెలిపారు. మెనూ ప్రకారమే విద్యార్థినులు భోజనం పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రిన్సిపాల్‌పై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని విద్యార్థినులకు భరోసా ఇచ్చారు. దీంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.