'వీసీ పదవీకాలం పొడిగించుకునేందుకు వర్సిటీలో వైఎస్ విగ్రహం' - ఏఐఎస్ఎఫ్ నిరసన
Students Protest Under AISF : శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఏర్పాటును ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్యర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గుంతకల్లు పట్టణంలోని అజంతా కూడలి వద్ద ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకట్ నాయక్ పేర్కొన్నారు. ఈ రోజు అధికార పార్టీ నాయకుడి విగ్రహం ఏర్పాటు చేస్తే.. భవిష్యత్తులో ప్రభుత్వం మారితే.. వారు కూడా తమ పార్టీ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేస్తారని తెలిపారు.
విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ రామకృష్ణారెడ్డి పదవీ కాలం ముగుస్తుడంతో దానిని పొడిగించుకునే ఉద్దేశంలో భాగంగా.. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్ మెప్పు పొందాలనుకున్నారని ఆరోపించారు. అంతగా విశ్వవిద్యాలయాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయాలనుకుంటే.. దేశం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో ఉన్నారని తెలిపారు. వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతే తప్ప.. రాజకీయ నాయకుల విగ్రహాలను పెడితే.. ఏఐఎస్ఎఫ్ ఆధ్యర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.