పుట్టపర్తిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన - రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు
Published: Nov 21, 2023, 9:22 PM

SP Madhava Reddy on President Droupadi Murmu visit: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి రాబోతున్నారని.. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సాయి హీరా గ్లోబల్ ప్రైవేటు కన్వెన్షన్ హాల్‌లో జరగనున్న సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొననున్నారని ఆయన వెల్లడించారు.
SP Madhava Reddy Comments: ''రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పుట్టపర్తికి రాబోతున్నారు. సాయి హీరా గ్లోబల్ ప్రైవేటు కన్వెన్షన్ హాల్‌లో జరిగే సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు డీగ్రీలు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితోపాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా నాలుగు జిల్లాల పోలీసులు, గ్రేహౌండ్స్ పోలీస్ బెటాలియన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశాం. బుధవారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు రాష్ట్రపతి పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుని.. ప్రశాంతి నిలయంలోని మహా సమాధిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని, విద్యార్థులకు బంగారు పతకాలు అందజేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు తిరిగి విమానాశ్రయంకు చేరుకుంటారు'' అని జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు.